Ongole: భర్తలు పెద్ద హోదా ఆఫీసర్లు.. భార్యలు దొంగలు! విలాసాలకు బానిపై నేరాలబాట పట్టిన కి’లే’డీలు!
ఆ మహిళల భర్తలు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. కుటుంబానికి సరిపడా ఆదాయం ఆర్జిస్తున్నారు. అయితే ఆ మహిళలకు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు. భర్తల సంపాదన కన్నా ఈజీగా డబ్బు సంపాదించేందుకు చోరీలే మార్గాలుగా ఎంచుకున్నారు. అందుకు ఒంటరి మహిళలను టార్గెట్..
ఒంగోలు, సెప్టెంబర్ 7: ఆ మహిళల భర్తలు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. కుటుంబానికి సరిపడా ఆదాయం ఆర్జిస్తున్నారు. అయితే ఆ మహిళలకు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు. భర్తల సంపాదన కన్నా ఈజీగా డబ్బు సంపాదించేందుకు చోరీలే మార్గాలుగా ఎంచుకున్నారు. అందుకు ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకున్నారు. రెండు సార్లు సక్సెస్ అయ్యారు. అయితే వీళ్లు చేసిన చిన్న పొరపాటు మూడోసారి పోలీసులకు చిక్కేలా చేసింది. దీంతో ప్రస్తుతం కటకటాలపాలై ఊచలు లెక్కబెడుతున్నారు.
విలాసాలకు అలవాటు పడి అప్పుల పాలైన నలుగురు మహిళలు ఈజీ మనీ కోసం చోరీ చేసేందుకు సిద్దపడ్డారు. తమ భర్తలు మంచి ఉద్యోగాలు చేస్తున్నా అవసరాలకు అవి సరిపోవడం లేదంటూ నేరాలవైపు దృష్టి సారించారు. అందుకు అనువుగా ఒంటరిగా ఉంటున్న మహిళలను టార్గెట్ చేసుకున్నారు. ఇప్పటికే ఈ తరహా నేరాలు చేసి పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నారు. తాజాగా ఒంగోలు కృష్ణానగర్‌లో ఓ బ్యాటీషియన్ పగలు ఒంటరిగా ఉంటుందని, ఆమె దగ్గర బంగారం ఎక్కువగా ఉందని మరో బ్యూటీషియన్ ద్వారా వివరాలు సేకరించారు. అంతే ఎప్పటిలాగే తమ ప్లాన్ అమలు చేసేందుకు రంగంలోకి దిగిపోయారు ఈ మాయల మరాఠీలు. బ్యూటీషియన్ రజియాపై బాత్రూమ్ యాసిడ్‌తో దాడి చేసి, మత్తుమందు ఇచ్చి బంగారం, డబ్బు ఎత్తుకెళ్ళారు. అయితే ఇక్కడ ఈ మహిళలు చేసిన ఓ పొరపాటు గంటల వ్యవధిలోనే పోలీసులు పట్టుకునేలా చేసింది. దీంతో ఈ ముగ్గురి గుట్టు రట్లయింది.
ప్లాన్ ఒకరిది… యాక్షన్ ముగ్గురిది…
ఒంగోలులో కొత్త తరహా నేరాలకు తెరలేపారు నలుగురు మహిళలు. మహిళల ఆధ్వర్యంలో నిర్వహించే బ్యూటీపార్లర్లపై కన్నేశారు. అందుకు అనువుగా ఉన్న ఒంగోలు నగరంలోని కర్నూలు రోడ్డులో ఉన్న ఓ బ్యూటీపార్లర్‌ను ఎన్నుకున్నారు. ఈ బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది రజియా అనే ఒక మహిళగా నిర్ధారించుకున్నారు. రజియా భర్త ఉద్యోగానికి బయటకు వెళితే తిరిగి సాయంత్రమే ఇంటికి వస్తారని, ఇంట్లో ఇక ఎవరూ ఉండరని ముందుగానే పధకం ప్రకారం తెలుసుకున్నారు. ఈ సమాచారం ఇచ్చింది కూడా మరో బ్యూటీపార్లర్ నడుపుతున్న దాసరి భాను అనే మహిళే. ఈ ప్రకారం తమ ప్లాన్ అమలు చేసేందుకు రంగంలోకి దిగారు ఆ నలుగురు. చోరీకి ప్లాన్ చేసింది దాసరి భాను అనే బ్యూటీషియన్ అయితే ఆ ప్లాన్ను అమలు చేసేందుకు మరో ముగ్గురు మహిళలు యాక్షన్‌లో దిగారు.
ఆ ముగ్గురు మహిళలు. మేకప్ చేయించుకుంటామంటూ రజియా నిర్వహించే బ్యూటీపార్లర్‌లోకి ఆ ముగ్గురు మహిళలు వచ్చారు. వీరిలో ఒకరు ఫేషియల్ చేయించుకున్నారు. మరో మహిళ ఐ బ్రోస్ చేయించుకున్నారు. ముగ్గురిలో ఓ మహిళ తాను బాత్రూంకు వెళ్ళింది. బాత్రూమ్ నుంచి బయటకు వస్తూనే ఆ మహిళ తన వెంట తెచ్చుకున్న యాసిడ్‌తో రజియాపై దాడి చేసింది. యాసిడ్ దాటిలో రజియాకు స్వల్ప గాయాలయ్యాయి. యాసిడ్ ముఖంపై పడటంతో గాయాలపాలైన రజియాను పట్టుకున్న మరో ఇద్దరు మహిళలు ఆమె ముఖంపై క్లోరోఫాం మత్తు మందు కలిపిన కర్చీఫ్‌తో అదిమిపెట్టారు. అయితే రజియా ప్రతిఘటిచడంతో ఆమె నోట్లో యాసిడ్ పోసేందుకు ప్రయత్నించారు. అనంతరం రజియాను ముగ్గురు మహిళలు నిర్బంధించి బీరువాలో ఉన్న 18 సవర్ల బంగారు ఆభరణాలు, అలాగే కౌంటర్లో ఉన్న 40 వేల నగదు తీసుకుని ముగ్గురు పరారయ్యారు. ఆ తరువాత కొద్ది సేపటికి స్పృహ కోల్పోయిన రజియాను గుర్తించిన స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
24 గంటల్లో ఛేధించిన పోలీసులు…
బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఒంగోలు తాలూకా సీఐ భక్తవత్సల రెడ్డి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుల్ని గుర్తించేందుకు సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజీలను సేకరించారు. నిందితులైన ముగ్గురు మహిళల ఆచూకీని కనిపెట్టేందుకు ప్రయత్నించే క్రమంలో ఈ ముగ్గురు మహిళా నిందితుల గురించిన క్లూ పోలీసులకు లభించింది. అసలు ఈ ముగ్గురు మహిళలు మరో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్న దాసరి భాను అనే మహిళ ఇచ్చిన రిఫరెన్స్‌తో బాధితురాలు రజియా దగ్గరకు వచ్చినట్టు తెలుసుకున్నారు. బ్యూటీషియన్ దాసరి భానును అదుపులోకి తీసుకోవడంతో ఈ ముగ్గురు నిందితుల ఆచూకీ తెలిసిపోయింది. దీంతో నేరం జరిగిన 24 గంటల్లోనే నిందితులైన ముగ్గురు మహిళలు ముండ్రు లక్ష్మి నవత @ నవ్య, కరణం మోహన దీప్తి @ దీప్తి, అలహరి అపర్ణ లతో పాటు ఈ చోరీకి ప్లాన్ చేసిన మరో బ్యూటీషియన్ దాసరి భానును పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీకి పాల్పడిన ముగ్గురు నిందితుల భర్తలు మంచి ఉద్యోగాలు చేస్తుండటం గమనార్హం. అయినా ఈ ముగ్గురు విలాసాలకు అలవాటు పడి చోరీలు చేస్తున్నారని గుర్తించారు. వీరిని అరెస్ట్ చేయడంతో గతంలో చేసిన నేరాల చిట్టా కూడా బట్టబయలైంది. నిందితుల నుంచి 10 సవర్ల బంగారు నగలు, 40 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్‌పి మలికగార్గ్ తెలిపారు.
సిబ్బందికి ఎస్‌పి అభినందన…
ఒంగోలులో కలకలం సృష్టించిన బ్యూటీపార్లర్ నిర్వాహకురాలిపై దాడి, చోరీ కేసును పోలీసులు 24 గంటల్లో ఛేధించి నలుగురు మహిళా నిందితులను అరెస్ట్ చేయడంతో పోలీసు సిబ్బందిని ఎస్‌పి మలికగార్గ్ అభినందించారు. నేరం జరిగిన ప్రాంతంలో లభించిన సిసి కెమెరా పుటేజ్, సాంకేతిక సమాచారంతో సేకరించిన ఇతర ఆధారాలతో నిందితులను వెంటనే అరెస్ట్ చేసి చోరీకి గురైన సొత్తును రికవరీ చేసిన పోలీసు సిబ్బందికి ఎస్‌పి రివార్డులు అందించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.