Cheating: పెళ్లి పేరుతో ఘరానా మోసం.. ముక్కూ , మొఖం తెలియకుండానే 17 లక్షలు కొట్టేసిన వైనం..

Cheating: అతనో ఘరానా నేరస్తుడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 16 కేసుల్లో జైలుకు వెళ్ళాడు. ప్రకాశం జిల్లా మద్దిపాడు యువతి

Cheating: పెళ్లి పేరుతో ఘరానా మోసం.. ముక్కూ , మొఖం తెలియకుండానే 17 లక్షలు కొట్టేసిన వైనం..
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 29, 2022 | 11:13 PM

Cheating: అతనో ఘరానా నేరస్తుడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 16 కేసుల్లో జైలుకు వెళ్ళాడు. ప్రకాశం జిల్లా మద్దిపాడు యువతి ఫిర్యాదుతో మరోసారి పోలీసులకు చిక్కాడు. అక్రమంగా సంపాదించిన రూ.17 లక్షలకు పైగా మొత్తంలో రూ. 8 లక్షలు పోలీసులు సీజ్ చేయగా మరో రూ. 9 లక్షలను ఫ్రీజ్ చేసేదిశగా పోలీసులు దృష్టి సారించారని జిల్లా ఎస్పీ మలికగార్గ్ తెలిపారు. మద్దిపాడు పోలీసుస్టేషన్లో నమోదైన సైబర్ నేరాన్ని ఎలా చేధించింది ఎస్పీ వివరించారు.

ఎవరీ ఘరానా మోసగాడు.. పొట్లూరి బాలవంశీకృష్ణ అలియాస్ ప్రతాపనేని రాజేష్ కుమార్ (35) స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా. అయితే ప్రస్తుతం ఇతను ఖమ్మం జిల్లా బుర్జాంపురం మండలం వెంకటేశ్వరనగర్‌లోని డ్రీంవ్యాలీ అపార్టుమెంట్, ప్లాట్ నెంబర్ 204, అలాగే విజయవాడలోని పోరంకి వద్ద ఉన్న ప్రియఫుడ్ ఫ్యాక్టరీ ఎదురుగా వెంకటేశ్వర కాలనీలో 67.2-84లో నివాసం ఉంటున్నాడు. ఇతను 2008లో కాకినాడలోని ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీలో బీ.ఫార్మసి పూర్తిచేశాడు. 2002లో ఇతని తండ్రి చనిపోగా తల్లి 2018లో మరో వివాహం చేసుకుని వెళ్ళిపోయింది. 2011లో హెచ్ఎస్ బీసీ బ్యాంకుకు చెందిన కస్టమర్ కేర్ సెంటర్‌లో ఉద్యోగం చేస్తుండేవాడు. 2014లో ఉద్యోగం వదులుకుని, షేర్ మార్కెట్ వ్యాపారంపై దృష్టిపెట్టాడు. 2016లో వివాహం చేసుకుని భార్యతో కలిసి బెంగళూరులో నివాసం ఉన్నాడు. 2018లో గుర్రపు రేసులు, గ్యాంబ్లింగ్ మొదలైన దుర్వ్యసనాలకు అలవాటుపడి ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేయడం ప్రారంభించాడు. దీంతో ఇతని భార్య విడాకులకు దరఖాస్తు చేసుకుని 2019 నుంచి ఇతనికి దూరంగా వెళ్ళిపోయింది. అయితే ఇతను 2011, 2012లోనే ఏటీఎం నేరాలకు పాల్పడి డబ్బులు సంపాదించేవాడు. అయితే అనంతరం ఏటీఎం మోసాల నియంత్రణకు బ్యాంకర్లు వన్ టైం పాస్ వర్డ్ సిస్టం ప్రారంభించడంతో ఆ నేరాలకు దూరంగా ఉండేవాడు. దీంతో నేరాలు ఎలా చేయాలనే దానిపై యూట్యూబ్ లో పరిశీలించుకుని మాట్రిమోనియల్ చీటింగ్ కు తెరలేపాడు.

యువతి ఫిర్యాదుతో గుట్టురట్టు… 2021 ఆగస్టులో జీవన్ షాధి మాట్రిమోనియల్.కాంలో ప్రతాపనేని రాజేష్ కుమార్ పేరుతో సెల్ నెంబర్ 9888123666 , రాజేష్ ప్రతాపనేని అనే మెయిల్ అడ్రస్‌తో అకౌంట్ ఓపెన్ చేశాడు. ఈ క్రమంలోనే యువతికి వివాహం చేయాలని భావించిన వారి తల్లిదండ్రులు రాజేష్ వివరాలను మాట్రిమోనియల్‌లో పరిశీలించి అతనిని ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించారు. ఈ సందర్భంగా రాజేష్ వారిని తాను న్యూయార్కులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నట్లు, కరోనా పరిస్థితుల కారణంగా హైదరాబాద్ కు బదిలీ అయి వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నట్లు నమ్మించాడు. తాను మరలా ఈ ఏడాది మేలో న్యూయార్కు వెళ్లాల్సి ఉంటుందని, ఈలోగా వివాహానికి అంగీకరిస్తే సరే అన్నాడు. అంతే కాకుండా వివాహం అనంతరం యువతిని న్యూయార్క్‌కు తీసుకువెళ్ళాలంటూ ఆమె సిబిల్ స్కోరు కేవలం 704 ఉందని, అది కనీసం 840 ఉండాలన్నాడు. ఇందుకోసం ఇండియాలో పలు రుణాలు తీసుకుని రెండు నెలలు సక్రమంగా వాయిదాలు చెల్లిస్తే సిబిల్ స్కోరు పెరుగుతుందంటూ నమ్మబలికాడు. అయితే అతని మాయమాటలను గమనించలేని యువతి కుటుంబసభ్యులు సరే అన్నారు.

మోసానికి పాల్పడింది ఇలా… సిబిల్ స్కోరు పెంచేందుకు అంటూ యువతికి చెందిన ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు ద్వారా 1,74,750 రూపాయలను, హౌసింగ్.కాం ద్వారా ఆన్లైన్లో 75,750 రూపాయలు, పేటియం రెంటల్ యాప్స్ ద్వారా 98,980 రూపాయలను తన అకౌంట్ కు మార్పించుకున్నాడు. – క్రెడ్ యాప్ ద్వారా రు4.30 లక్షలు రుణం యువతి ద్వారా అప్లై చేయించి, రుణం మొత్తాన్ని ఆమె ద్వారానే తన అకౌంట్‌కు బదిలీ చేయించుకున్నాడు

జెస్ట్ మనీ యాప్ ద్వారా 1.20 లక్షలు రుణానికి దరఖాస్తుచేయించి రుణం మొత్తం యువతి ఖాతాలో జమకాగానే దానిని తన అకౌంట్ కు పంపించుకున్నాడు. ఇక మనీ వ్యూ యాప్ ద్వారా 5 లక్షల రుణానికి దరఖాస్తు చేయించి రుణం మొత్తం యువతి అకౌంట్ లో 4,62,874 రూపాయలు, నవీ పర్సనల్ లోన్ యాప్ ద్వారా 4.50లక్షలు యువతి ద్వారానే రుణానికి దరఖాస్తు చేయించి ఆమె అకౌంట్ లో పడిన 4,41,151 రూపాయలను యువతి ద్వారానే ఆర్టీజీఎస్ ద్వారా తన ఖాతాకు మొత్తం 9,44,581 రూపాయలు జమచేయించుకున్నాడు. బాధిత యువతి బజాజ్ కార్డు ద్వారా 59,999 రూపాయలతో వన్ ప్లస్ నైన్ ప్రో మొబైల్ ను కొనుగోలు చేశాడు.

బాధితురాలి క్రెడిట్ కార్డు, వివిధ సంస్థల నుంచి ఆన్‌లైన్ ద్వారా తీసుకున్న రుణం వెరసి మొత్తం 17,49,649 రూపాయలను నిందితుడు రాజేష్ సొంతం చేసుకున్నట్లయింది. ఈ నేపథ్యంలోనే అతనికి ఈ నెల 18న జెస్ట్ మనీ లోన్ యాప్ ద్వారా 1.20 లక్షలు గిఫ్ట్ ఓచర్లు రాగా వాటితో అమెజాన్ యాప్ లో బంగారం కొనుగోలుచేసి దానిని మొత్తాన్ని అదే యాప్ లో అమ్మి వచ్చిన మొత్తం 1.20 లక్షలను తన బ్యాంకు ఖాతాకు జమచేసుకున్నాడు. క్రెడ్ యాప్ లోను ద్వారా వచ్చిన మొత్తంలో 1,98,970 రూపాయలను ఐసిఐసిఐ బ్యాంకు డెబిట్ కార్డునుంచి నోబ్రోకర్ రెంటల్ యాప్ ద్వారా తన అకౌంటుకు బదిలీ చేసుకున్నాడు. వీటిలో ఫోన్ పే అకౌంట్ ద్వారా వంశీకృష్ణ పేరుతో ఇయర్ బడ్స్ కొనుగోలుచేశాడు.

స్పందన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు… అయితే ఇష్టం వచ్చినట్లుగా రుణాలు తీసుకోవడం ద్వారా ఏదో మోసం జరుగుతుందేమో అనే అనుమానం యువతిలో కలిగింది. దీంతో ఆమె తన రుణాల ప్రాసెస్ మొత్తం రద్దు చేయాలని సూచించగా అందుకు వారం రోజులు గడువు పడుతుందంటూ రాజేష్ సూచించాడు. దీంతో ఆమెకు అనుమానం కలిగి ఇటీవల స్పందనలో జిల్లా ఎస్పీ మలికాగర్గ్ కు ఫిర్యాదుచేసింది. దీంతో ఎస్పీ ఆదేశాల మేరకు రూరల్ సిఐ ఆర్.రాంబాబు, మద్దిపాడు ఎస్సై టి.శ్రీరాంలు దీనిపై ప్రత్యేక దృష్టిసారించగా నిందితుడు పొట్లూరి శ్రీ బాలవంశీకృష్ణ అలియాస్ ప్రతాపునేని రాజేష్ కుమార్ సీతారామపురం కొష్టాలు వద్ద ఉండగా అరెస్టు చేశారు. అనంతరం అతనిని విచారించగా అతనిపై గతంలోనే 16 కేసులు నమోదైనట్లు గుర్తించారు. రాజమండ్రిలో ఏడు కేసులు, విశాఖపట్నంలో ఒకటి, కృష్ణాజిల్లా వస్తవలి పీయస్ పరిధిలో మరో నేరం చేసినట్లు స్పష్టమైంది. ఇక తెలంగాణాకు సంబందించి హైదరాబాద్ బంజారాహిల్స్ పరిధిలో 2, కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు పరిధిలో 2, రాచకొండ, హైదరాబాద్, రామగుండంలలో మరో కేసులలో అరెస్టు అయ్యాడు.

5 లక్షలకు పైగా చెడు వ్యవసనాలకే ఖర్చు.. నిందితుడు రాజేష్ కుమార్ గుర్రపు పందాలు, గ్యాంబ్లింగ్‌కు 5.70 లక్షలు వెచ్చించినట్లు గుర్తించారు. అతని వద్ద 8లక్షలు లభించగా సీజ్ చేశారు. ఇక అతనికి సంబధించి ఇండస్ బ్యాంకు ఖాతాలో 9,18,970 రూపాయలు జమకావాల్సి ఉందని గుర్తించి సంబంధిత సంస్థకు ఫ్రీజ్ చేయాలంటూ లెటర్ పంపారు. ఫిర్యాదుపై వేగంగా స్పందించి సైబర్ క్రైం కేసును చాకచక్యంగా చేధించి నిందితుడిని కటకటాల వెనక్కు పంపినందుకు ఒంగోలు డీఎస్పీ నాగరాజు, రూరల్ సీఐ రాంబాబు, మద్దిపాడు ఎస్సై శ్రీరాం, వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ మలికాగర్గ్ అభినందించి నగదు రివార్డులను అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వివాహ సంబంధాల సైట్లతో జాగ్రత్తగా ఉండాలని, సైబర్ నేరాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ మోసపోకుండా ఉండాలన్నారు. ఇంటర్నెట్ ద్వారా కొన్ని యాప్స్ ద్వారా పరిచయాలు పెంచుకుని జీవితాలు నాశనం చేసుకోవద్దని ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లిక గార్గ్ విజ్ఞప్తి చేశారు.

ఫైరోజ్, టీవీ9 రిపోర్టర్ ఒంగోలు.

Also read:

Hyderabad: తగ్గేదేలే అంటున్న స్పెషల్ టాస్క్‌ఫోర్స్.. అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం..

Kinnera Mogulaiah: పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన మొగిలయ్య కన్నీటి గాథ తెలుసా! ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్న కళాకారుడి జీవితం..

MLA Car Accident: గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఎమ్మెల్యే కారును ఢీకొన్న మరో కారు..