Hyderabad: తగ్గేదేలే అంటున్న స్పెషల్ టాస్క్‌ఫోర్స్.. అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం..

Hyderabad: మహానగరం ఎంత వేగంగా విస్తరిస్తోందో.. అంతే వేగంగా అక్రమార్కుల ఆగడాలు జడలు విప్పుతున్నాయి.

Hyderabad: తగ్గేదేలే అంటున్న స్పెషల్ టాస్క్‌ఫోర్స్.. అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం..
Follow us

|

Updated on: Jan 29, 2022 | 10:22 PM

Hyderabad: మహానగరం ఎంత వేగంగా విస్తరిస్తోందో.. అంతే వేగంగా అక్రమార్కుల ఆగడాలు జడలు విప్పుతున్నాయి. ఇప్పటికే అక్రమ కట్టడాలతో సీటీ అతలాకుతలం అవుతుంటే.. నగర శివారుల్లోనూ అదే తంతు కొనసాగుతోంది. భావి భాగ్యనగరానికి శివారుల వరకు ముప్పు తప్పదా అంటే.. ఆక్రమణలు, అక్రమ కట్టడాలు చూస్తే తప్పదనే చెప్పాలి. దీనిపై దృష్టి పెట్టిన సర్కారు అక్రమార్కుల ఆశల అంతస్థులను పేకమేడలు చూసి కూలగొడుతోంది. హెచ్ఎండీఏ పరిధిలో స్పెషల్ టాస్క్ పోర్స్.. ఇల్లీగల్ బిల్డింగ్ లను స్మాష్ చేస్తూ నేలకూలుస్తోంది.

అక్రమాలకు కాదేది అనర్హం అన్నట్టు కేటుగాళ్లు అడ్డగోలుగా బడా బిల్డింగ్ లు కట్టేస్తున్నారు. ఫలితంగా కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల మున్సిపాలిటీల్లో రోజురోజుకు పెరుగుతున్న అభివద్ధితో మోసగాళ్లు పెద్దపెద్ద స్థలాల్లో యథేచ్చగా నిబంధనలు ఉల్లంఘిస్తూ నిర్మాణాలు చేస్తున్నారు. రెండు అంతస్థులకు పర్మిషన్ తీసుకొని నాలుగైదు అంతస్థులు కట్టెస్తున్నారు. రోడ్లు, పుట్ పాత్ లు ఆక్రమించి మరి భవనాలు లేపేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు ఖాళీగా కనిపిస్తే కన్నేస్తున్నారు. ఇన్ని అక్రమాల మాటున సైలెంట్ గా ఉన్న ప్రభుత్వం.. ఒక్కసారి అలర్ట్ అయింది. ప్రత్యేక టాస్క్ పోర్స్ ఏర్పాటు చేసి అక్రమ నిర్మాణాలను గుర్తించింది. డిస్ట్రిక్ టాస్క్ పోర్స్, హెచ్ఎండీఏ, రెవెన్యూ, మున్సిపల్, పోలీసుల బృందాలు గుర్తించిన అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తున్నాయి. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ స్పెషల్ డ్రైవ్ అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో మొత్తం 7 మున్సిపల్ కార్పోరేషన్లు, 29 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఒక్కో మున్సిపాలిటీలో కనీసం రోజుకో రెండో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. అయితే దశలవారీగా చర్యలు చేపట్టాలని భావించిన హెచ్ఎండీఏ తొలుత 600 చదరపు గజాలకు పైగా ఉన్న ఇల్లీగల్ నిర్మాణాలను గుర్తించింది. తొలిదశలో వీటిని కూల్చేందుకు శ్రీకారం చుట్టి జనవరి 29 నాటికి 114 నిర్మాణాలపై చర్యలు తీసుకుంది. మేడ్చల్ జోన్ లో 28, ఘటకేసర్ జోన్ లో 22, శంకరపల్లి జోన్ 25 శంషాబాద్ జోన్ లో 28 నిర్మాణాలపై చర్యలు తీసుకున్నారు. ఇందులో 89 నిర్మాణాలను కూల్చివేయగా.. మరో 25 నిర్మాణాలను సీజ్ చేశారు. 10 అంతస్తుల భవనం నుంచి భారీ షెడ్డుల వరకు నిర్మాణాలను అధికారులు కూల్చారు. ఒక్క నిజాంపేట్ మున్సిపాలిటీలో 40 అక్రమ నిర్మాణాలు గుర్తిస్తే 39 భవనాలపై చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.

దుండిగల్ పరిధిలోని మల్లంపేట్ అక్రమ విల్లాలపై టీవీ9 వరస కథనాలను ప్రసారం చేసింది. దీంతో కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీల్లో గ్రామ పంచాయతీ అనుమతుల పేరుతో జీ ప్లస్ 2 కు మించి కడుతున్న అక్రమ నిర్మాణాలను గుర్తించాలని మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. లెక్క లేనన్ని లేవుట్లు, గేటేడ్ కమ్యూనిటీలు, అపార్టుమెంట్లు అనుమతులు లేకుండా కడుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో డిసెంబర్ 30 నాటికి అన్ని మున్సిపల్ కమిషనర్ల నుంచి నివేదిక తెప్పించుకున్న ప్రభుత్వం.. వాటిని కూల్చేందుకు ప్రత్యేక టాస్క్ పోర్స్ ను ఏర్పాటు చేసింది. లీగల్ గా ఇబ్బందులు ఎదురయ్యే అక్రమ నిర్మాణాలపై ఆచితూచి అడుగేస్తున్న మున్సిపల్ శాఖ.. దేన్ని వదిలిపెట్టేది లేదని, అక్రమంగా నిర్మణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది.

మరోవైపు ఒకసారి రెండు మూడు అంతస్తులు కూల్చాక తిరిగి అక్రమ నిర్మాణాలు చేపడితే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ఆయా మున్సిపాలిటీల్లో తిరిగి నిబంధనలు ఉల్లంఘిస్తూ నిర్మాణాలు జరిగితే ఆ మున్సిపాలిటీ కమిషనర్ దే బాధ్యత అంటూ ఆదేశాలు జారీ చేశారు. గతంలో పంచాయతీ కార్యదర్శుల పేరిట కొంతమంది చూపిస్తున్న అనుమతులపై విచారణ చేసి హెచ్ఎండీఏ అనుమతి తీసుకోవాల్సిన నిర్మాణాలకు ఎలా పర్మిషన్ ఇచ్చారో వాళ్లని బాధ్యుల్ని చేస్తామంటున్నారు. అక్రమ నిర్మాణాల అనుమతులు, జాప్యంపై సంబంధిత అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ఇప్పుడు పెద్ద నిర్మణాలపై దృష్టి పెట్టిన హెచ్ఎండీఎ.. దశల వారీగా 100 చదరపు గజాల లోపు ఉన్న అక్రమ నిర్మాణాలను సైతం వదలకుండా కూల్చేస్తామంటూ హెచ్చరిస్తోంది.

Also read: Kinnera Mogulaiah: పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన మొగిలయ్య కన్నీటి గాథ తెలుసా! ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్న కళాకారుడి జీవితం..

MLA Car Accident: గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఎమ్మెల్యే కారును ఢీకొన్న మరో కారు..

Viral: 70 ఏళ్ల నుంచి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కారును తోలుతున్న యూకే పెద్దమనిషి!