AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kinnera Mogulaiah: పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన మొగిలయ్య కన్నీటి గాథ తెలుసా! ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్న కళాకారుడి జీవితం..

కిన్నెర మొగిలయ్య జీవన ప్రయాణం మాత్రం కన్నీటికడగల్లే! ఐతే పూర్వీకులనుండి వారసత్వంగా వస్తున్న అద్భుత కళకు చిట్టచివరి వారసుడి కళకు పట్టం కట్టి.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తోంది. కేంద్రం దృష్టిలో పడేలా చేసింది కూడా..

Kinnera Mogulaiah: పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన మొగిలయ్య కన్నీటి గాథ తెలుసా! ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్న కళాకారుడి జీవితం..
Kinnera Mogulaiah
Srilakshmi C
| Edited By: Ravi Kiran|

Updated on: Jan 29, 2022 | 10:15 PM

Share

Kinnera Mogulaiah Biography: తెల్ల చొక్కా, పెద్దజుట్టు, పంచెకట్టు, కొరమీసం, భుజం మీద ‘మెట్ల కిన్నెర’తో అత్యంత సాధారణంగా కనిపించే అరుదైన కళాకారుడు కిన్నెర మొగిలయ్య. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు మోగిపోతోంది. ఐతే అతని జీవన ప్రయాణం మాత్రం కన్నీటికడగల్లే! ఐతే పూర్వీకులనుండి వారసత్వంగా వస్తున్న అద్భుత కళకు చిట్టచివరి వారసుడి కళకు పట్టం కట్టి.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తోంది. కేంద్రం దృష్టిలో పడేలా చేసింది. దీంతో అతని అరుదైన ప్రతిభను గుర్తించిన కేంద్రం రేపు పద్మంతో సత్కరించబోతోంది. ఈ నేపథ్యంలో.. కిన్నెర మొగులయ్య జీవన ప్రయాణం మీకోసం..

నిజానికి మొగిలయ్య అసలు పేరు దర్శనం మొగిలయ్య. నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలం అవుసలికుంట అతని సొంతూరు. 12మెట్ల కిన్నెర పలికించే వారిలో ఆయన ఆఖరి తరం కళాకారుడు. పద్మశ్రీ రావడంపై ఆయన స్పందన ప్రతి ఒక్కరిని కంటనీరు పెట్టిస్తోంది. కిన్నెరమెట్ల కళ అత్యంత అద్భుతమైందని, ఈ కళ నాతోనే అంతమవుతుందా అనే మనోవేదనతో ఉన్న సమయంలో.. పద్మశ్రీ పురస్కారం రావడం సంతోషంగా ఉందని కన్నీటి పర్యాంతమ్యాడు. ఈ అవార్డు ద్వారా తన కళకు జీవం పోశారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ కళను గుర్తించి, పురస్కారాన్ని ఇవ్వడంతో అందరికీ తెలిసిందని చెప్పుకొచ్చారు.

వైవిధ్యమైన ప్రాచీన కళైన పన్నెండు మెట్ల కిన్నెర పలికించే కళాకారుడుగా కిన్నెర పాటలతో ప్రతి ఒక్కరిని తన్మయత్వంలో ముంచెత్తుతున్న మొగిలయ్య.. తరాల తెలుగు జీవన విధానం, చారిత్రక గాథలు ఒడిసిపట్టి, పాట రూపంలో కిన్నెర మెట్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. వాద్యం పేరునే ఇంటి పేరుగా మార్చుకుని కిన్నెర మొగిలయ్యగా స్థిరపడ్డారు. వాయిద్య ప్రదర్శనలతో కుటుంబ పోషణ చేసుకుంటున్న మొగులయ్యను కరోనా రోడ్డుపైకి లాగింది. కుటుంబపోషణ కష్టతరమై, దీనావస్థలో ఉన్న తన కుటుంబాన్ని పోషించడానికి గత్యంతరం లేక నలుగురినీ యాచించాల్సిన దుస్థితి ఏర్పడింది.

పాఠ్యపుస్తకంలో తన గురించి ఉన్న పాఠాన్ని చూపుతూ హైదరాబాద్‌లోని తుక్కుగూడలో భిక్షాటన చేస్తూ కనిపించాడు. ఆదరణ కోల్పోయిన కళతో భిక్షమెత్తుకుంటున్న కళాకారుడి దుస్థితిని చూసి. .భీమ్లా నాయక్​ చిత్రంలో పాట పాడే అవకాశం దక్కింది. ఈ చిత్రంలో ఇటీవలే విడుదలైన మొగిలయ్య పాటతో ఒక్కసారిగా స్టార్​గా అందరి దృష్టిలో పడ్డాడు. ప్రముఖ ఛానెళ్లు కూడా ఆయన్ను ఇంటర్వ్యూ చేసేందుకు ముందుకొచ్చాయి. ఆ ఇంటర్వ్యూల్లో కూడా ఆయన తన ఆర్థిక స్థోమత గురించి ప్రస్తావించారు. దీంతో పవర్ స్టార్ ముందుకొచ్చి రూ.2 లక్షల సాయం అందించారు. ప్రస్తుతం పద్మశ్రీ అవార్డు లోకల్‌ వాయిద్యకారుడిని.. ఇంటర్నేషనల్‌ స్టార్‌ని చేసింది.

మొగిలయ్య గురించిన ఇంకా మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఐతే ఈ కింది వీడియోను వీక్షించండి.