మనసెలా వచ్చిందిరా! ఆ సమయంలో ఏడ్చిందని అబంశుభం తెలియని చిన్నారిని కొట్టి కొట్టి చంపేశారు..
Vizag News: ఓ పదిహేడు నెలల చిన్నారి బుడిబుడి అడుగులు వేస్తోంది. బుజ్జి బుజ్జిగా మాట్లాడుతోంది. ముద్దులోలకే ఆ చిన్నారి గొంతు ఒక్కసారిగా వినిపించడం మానేసింది.. కాదు కాదు ఆ చిన్నారి కూడా కనిపించకుండా పోయింది. తల్లిని ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాలు..!

విశాఖపట్నం, జులై 23: ఓ పదిహేడు నెలల చిన్నారి బుడిబుడి అడుగులు వేస్తోంది. బుజ్జి బుజ్జిగా మాట్లాడుతోంది. ముద్దులోలకే ఆ చిన్నారి గొంతు ఒక్కసారిగా వినిపించడం మానేసింది.. కాదు కాదు ఆ చిన్నారి కూడా కనిపించకుండా పోయింది. తల్లిని ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాలు..! చివరకు ఇంటి వెనకే ఆ చిన్నారిని సమాధి చేసింది ఆ తల్లి. గరిటతో కొట్టి.. వాడితో కలిసి కనికరం లేకుండా గోడకేసి కొట్టి.. చంపి పూడ్చిపెట్టింది. ఆపై ఏమి ఎరగనట్టు ఉండిపోయింది. మాతృత్వానికి మచ్చ తెచ్చేలా ఉన్న ఈ ఘటన వెనుక ఉన్న అమానవీయమైన వివరాలివే..
అనకాపల్లి జిల్లా ఎలమంచిలికి చెందిన సాయి.. గాజువాకలో ఉంటున్న స్నేహను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2020లో వీరి వివాహం జరిగింది. ఆ తర్వాత పొట్టకూటి కోసం ఇద్దరూ విజయవాడకు వెళ్ళిపోయారు. అన్యోన్యంగా ఉండేవారు. ఈ క్రమంలో గతేడాది మార్చి నెలలో ఈ దంపతులకు చిట్టి తల్లి జన్మించింది. పాపకు గీత శ్రీ అని నామకరణం కూడా చేశారు. అప్పటి వరకు అన్యోన్యంగా ఉన్న వీరి మధ్య ఒక్కసారిగా కలహాలు మొదలయ్యాయి. విజయవాడ నుంచి తిరిగి వచ్చి ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. చిన్నారి తల్లి వద్దే ఉంటోంది.
వాడితో పరిచయం..
ఈ క్రమంలో.. స్నేహకు రమణబాబు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా శారీరక సంబంధంగా మారింది. ప్రస్తుతం కూర్మన్నపాలెం మంగళపాలెంలోని జేఎన్ఎన్‌యుఆర్ఎం కాలనీలో స్నేహ ఓ ఇంటిని రెంట్‌కు తీసుకొని నివాసం ఉంటుంది.




ఏడుస్తుందని గరిటతో కొట్టి..
అయితే ఇద్దరూ చనువుగా ఉన్నప్పుడు.. చిన్నారి అల్లరి చేస్తుందని స్నేహకు కోపం వచ్చింది. దీంతో గరిటతో కొట్టి చిన్నారిపై కసి తీర్చుకుంది. తలకు తీవ్ర గాయం అవగా.. పసుపు రాసింది స్నేహ. తీవ్ర నొప్పితో అల్లాడిపోయిన ఆ చిన్నారి నిద్రపోయింది. ఆ తర్వాత కాసేపటికి మళ్లీ నిద్ర లేచింది చిన్నారి. గీతకు అన్నం తినిపిస్తోంది. ఇప్పుడు దారుణం చోటు చేసుకుంది.
వాడే కనికరం లేకుండా..!
భోజనం తింటున్న సమయంలో పాపం ఆ చిట్టి తల్లికి తలకు అయిన గాయం నొప్పి తట్టుకోలేక.. ఏడ్చింది. అక్కడే ఉన్న ప్రియుడు రమణబాబు.. కోపంతో ఊగిపోయాడు. అంతటితో ఆగకుండా.. చిన్నారి గీత శ్రీ ని గోడకేసి కొట్టాడు. కనికరం లేకుండా విచక్షణా రహితంగా చిన్నారిని కొట్టాడు. దీంతో చిన్నారి స్పృహ తప్పి పడిపోయింది. ఆ వెంటనే ప్రాణాలు కోల్పోయింది.
ఇంటి వెనకే పూడ్చిపెట్టి..!
ప్రాణాలకు కోల్పోయిన చిన్నారిని బయటకు తీసుకెళ్తే అందరికీ తెలిసిపోతుందని భావించి.. మరో ప్లాన్ చేశారు. ఇంటి వెనకే.. గొయ్యి తీసి ఆ చిట్టి తల్లి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. ఈ ఘటన ఈనెల 17న జరుగగా.. ఆ తర్వాత స్నేహ తండ్రి ఇంటికి వచ్చాడు. గీత శ్రీ కోసం ఆరా తీశాడు. దీంతో పొంతనలేని సమాధానాలు చెప్పింది స్నేహ. ఓసారి ఆర్థిక పరిస్థితులు బాగోలేక కూతురుని విక్రయించానని చెప్పగా.. మరోసారి వేరువేరు కథలు అల్లింది. గట్టిగా నిలదీయడంతో పాటు.. ఇంటి వెనుక నుంచి దుర్వాసన వస్తున్నడంతో వెళ్లి చూశారు. అప్పటికే వీధి కుక్కలు మృతదేహాన్ని బయటకు లాగినట్టు కనిపించింది. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు.
ఘటనా స్థలికి చేరుకున్న దువ్వాడ పోలీసులు.. చిన్నారి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. రమణ బాబు, స్నేహలపై కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిద్దరినీ రిమాండ్‌కు తరలించారు. ఇంతటి ఘాతుకానికి పాల్పడిన వీరిద్దరిపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
