Andhra: పండుగ వేళ బస్సులకు బ్రేక్.. ప్రయాణికులకు షాక్!
సంక్రాంతి పండుగ వేళ బస్టాండ్లు కిక్కిరిసిపోతున్న తరుణంలోనే ఆర్టీసీకి షాక్ ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. నష్టాల పేరుతో అద్దె పెంచాలని డిమాండ్ చేస్తూ, APSRTCలో అద్దె బస్సుల యజమానులు ఈ నెల 12 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగేందుకు సిద్ధమయ్యారు. పెరిగిన ఇంధన, నిర్వహణ ఖర్చులు… స్త్రీ శక్తి పథకం వల్ల పెరిగిన రద్దీ తమపై భారంగా మారిందని వారు చెబుతున్నారు.

సంక్రాంతి వేళ పట్టణాల నుంచి స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్లు కిక్కిరిసిపోతాయి. పండుగకు వెళ్లేవారు పది రోజుల ముందు నుంచే టికెట్లు రిజర్వేషన్లు చేసుకుంటుంటారు. ఇక పండుగ ముందు మూడ్రోజులు, తర్వాత మూడ్రోజులు బస్టాండ్‌లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంటుంది. అయితే సరిగ్గా సంక్రాంతి వేళ, APSRTCలో అద్దె బస్సుల యజమానులు సమ్మెకు దిగడానికి సంసిద్ధమయ్యారు. నష్టాలు వస్తోన్న దృష్ట్యా తమకు చెల్లించే అద్దెను పెంచాలని అద్దె బస్సుల యజమానులు డిమాండ్ చేశారు. ఈ నెల 12 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో అద్దె బస్సులను నిలిపి వేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇవ్వనున్నాయి అద్దెబస్సుల యజమానుల సంఘాలు. స్త్రీ శక్తి పథకం అమలుతో, అధిక రద్దీ వల్ల తమపై అదనపు భారం పడుతోందని అద్దె బస్సుల యజమానులు చెబుతున్నారు. ఇంధనం ఖర్చు పెరగడంతో సహా నిర్వహణ పెరిగినందున అద్దె పెంచాలని గత కొంతకాలంగా వాళ్లు ప్రభుత్వాన్ని అర్థిస్తున్నారు. వీళ్ల అభ్యర్థనపై స్పందించిన ఆర్టీసీ యాజమాన్యం…నెలకు అదనంగా 5,200 రూపాయలు మాత్రమే పెంచడానికి సిద్ధమైంది. ఈ మేరకు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. అయితే పెంచిన అద్దెపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి అద్దె బస్సుల యజమానుల సంఘాలు. తమతో చర్చించి అద్దె మొత్తాన్ని మరింత పెంచాలని కోరుతూ…సమ్మె నోటీసు ఇవ్వాలని నిర్ణయించాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
