సముద్రంలో కలిసే జలాలు ఉపయోగించుకుంటే తప్పేంటి..? నీటిపై రాజకీయాలు వద్దుః సీఎం చంద్రబాబు
నీటి వివాదం.. PPP విధానం.. దుర్గగుడి పవర్ కట్ అంశం.. పెట్టుబడుల విషయం.. ఇలా ఒక్కటేంటి ఎన్నో ఆసక్తికర విషయాలను మంత్రులతో చర్చించిన సీఎం చంద్రబాబు.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ తర్వాత కీలక అంశాలపై మంత్రులతో చర్చించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇటీవల ఏపీ, తెలంగాణ మధ్య తలెత్తిన జలవివాదంపై ప్రధానంగా మాట్లాడారు.

నీటి వివాదం.. PPP విధానం.. దుర్గగుడి పవర్ కట్ అంశం.. పెట్టుబడుల విషయం.. ఇలా ఒక్కటేంటి ఎన్నో ఆసక్తికర విషయాలను మంత్రులతో చర్చించిన సీఎం చంద్రబాబు.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ తర్వాత కీలక అంశాలపై మంత్రులతో చర్చించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇటీవల ఏపీ, తెలంగాణ మధ్య తలెత్తిన జలవివాదంపై ప్రధానంగా మాట్లాడారు. సముద్రంలో కలిసే నీళ్లను ఉపయోగించుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. నీటి లభ్యత ఉంటే రైతులు కొత్త పంటలు వేసుకోవచ్చని చెప్పారు. జగన్ హయాంలోనే ఆగిపోయిన రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు గురించి ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం పూర్తయితే గోదావరి జలాలను విశాఖకు తీసుకెళ్లవచ్చన్నారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రతీ ప్రాజెక్టును గ్రౌండ్ చేయాలని మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
విజయవాడ దుర్గ గుడి పవర్ కట్ అంశంపైనా స్పందించిన చంద్రబాబు.. మంత్రులపై కాస్త అసహనం వ్యక్తం చేశారు. మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సున్నితమైన అంశాల్లో జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి సమస్య మరోసారి రాకూడదని కాస్త గట్టిగానే చెప్పారు. జగన్ పాలనలో విధించిన 4 వేల 490 కోట్ల రూపాయల ట్రూఅప్ ఛార్జీల భారం ప్రజలపై పడకుండా ప్రభుత్వమే భరిస్తోందని మరోసారి గుర్తుచేశారు. యూనిట్ విద్యుత్ ఛార్జీ 5 రూపాయల 19 పైసల నుంచి 4 రూపాయల 90కి తగ్గించామని చెప్పుకొచ్చారు. మార్చి నాటికి 4 రూపాయల 80 పైసలకు తగ్గే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు చంద్రబాబు.
PPP విధానంపైనా మరోసారి స్పందించారు చంద్రబాబు. దేశం మొత్తం మీద ఏపీలోనే పీపీపీ విధానం అత్యుత్తమంగా అమలవుతోందని… ఈ విధానంపైనే అంతటా చర్చ జరుగుతోందన్నారు. కేవలం ఈ విధానం వల్లే ప్రజలకు నాణ్యమైన సేవలు అందించగలుగుతామని స్పష్టం చేశారు. అలాగే… ఏపీకి 23.5 శాతం పెట్టుబడులు రావడంపైనా మంత్రులతో చర్చించారు చంద్రబాబు. జనంలోకి ఈ విషయాన్ని బలంగా తీసుకు వెళ్లాలని మంత్రులకు సూచించారు చంద్రబాబు. ఇక ఈసారి రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ చేశామన్న ముఖ్యమంత్రి, రైతుల్ని ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఏపీలో జలరవాణా మెరుగుపరుచుకునే దిశగా కార్యాచరణ రూపొందించాలని మంత్రులకు సూచించారు చంద్రబాబు. లాజిస్టిక్స్ వినియోగంలో ప్రపంచస్థాయిలో పోటీపడాలని.. ప్రతీ తీరప్రాంత జిల్లాలో ఓ పోర్టు ఏర్పాటుకావాలన్నారు. అలాగే పర్యాటక రంగంలో అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
