America: లాస్ ఏంజెలెస్‌లో ఆందోళనలు ఉధృతం.. నో కింగ్ థీమ్‌తో ట్రంప్‌కు వ్యతిరేకంగా
అమెరికాలో అంతర్యుద్ధం రోజురోజుకూ తీవ్రమవుతోంది. లాస్ ఏంజెలెస్‌లో మొదలైన నిరసనలు పలునగరాలకూ వ్యాపించాయి. నో కింగ్ థీమ్‌తో ట్రంప్‌నకు వ్యతిరేకంగా ఆందోళనలు ఉదృతమవుతున్నాయి. మరోవైపు ట్రంప్ నిర్ణయాలపై ఫెడరల్‌కోర్టు విచారిస్తోంది. మరి ఆందోళనలు తగ్గుతాయా..? లేక ICE చట్టాలపై ట్రంపే వెనక్కి తగ్గుతారా.. వేచి చూడాలి.

లాస్ ఏంజెలెస్‌లో డొనాల్డ్ ట్రంప్ పరిపాలనకు వ్యతిరేకంగా ఆందోళనలు మరోలెవల్‌కు చేరాయి. కఠిన వలస విధానాలు, ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ICE దాడులకు వ్యతిరేకంగా.. జూన్ 15న ప్రారంభమైన ‘నో కింగ్స్’ ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి. ప్రస్తుతం లాస్ ఎంజెలెస్‌లో కర్ఫ్యూ అమల్లో ఉంది . అయితే ఆందోళనకారులు ట్రంప్‌నకు వ్యతిరేకంగా రాత్రిళ్లు సమావేశమై తమ కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు.
జూన్ 16న యు.ఎస్. ఆర్మీ 250వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ట్రంప్ సైనిక పరేడ్‌ను ఆందోళనకారులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే భద్రతా బలగాలు అప్రమత్తమై నిరసనకారులను చెదరగొట్టారు. ఈ ఘటనలో 30 మందికి పైగాఅరెస్టయ్యారు. కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. నో కింగ్ థీమ్‌తో ట్రంప్ రాజు కాదు..అంటూ నినాదాలు చేస్తూ, ట్రంప్ ఫ్లెక్సీలను దహనం చేశారు. లాస్ ఏంజెలెస్‌తో పాటు సాన్ ఫ్రాన్సిస్కో, సీటెల్‌లోనూ నిరసనలు కొనసాగాయి.
మంగళవారం ఉదయం లాస్ ఏంజెలెస్‌లో ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి, నిరసనకారులు సిటీ హాల్ వద్ద సమావేశమయ్యారు. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయడంతో, రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి, రాజ్యాంగాన్ని కాపాడండి” అంటూ ర్యాలీలు నిర్వహించారు, ట్రంప్ విధానాలను “ఫాసిస్ట్”గా వర్ణించారు. ఈ ఘటనలు నగర ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాయి, డౌన్‌టౌన్‌లో వ్యాపారాలు మూతపడ్డాయి. సుమారు 20మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఫెడరల్ అప్పీల్స్ కోర్టు ట్రంప్ సైనిక మోహరింపుపై విచారణ కొనసాగిస్తుండగా, నిరసనకారులు కోర్టు తీర్పును సవాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
వలసదారుల హక్కులు, రాజ్యాంగ స్వేచ్ఛల కోసం తాము పోరాడుతున్నట్లు నిరసనకారులు పేర్కొనగా…ఇవి “అరాచకం” అంటూ ట్రంప్ మద్దతుదారులు విమర్శించారు. మంగళవారం సాయంత్రానికి లాస్ ఏంజెలెస్‌లో 100 మందికి పైగా అరెస్టయ్యారు. ఆందోళనలు ఇతర నగరాలకు వ్యాపించే సూచనలు కనిపిస్తున్నాయి. సాన్ డియాగోలోనూ నిరసన మంటలు రాజుకున్నాయి. ప్రస్తుత పరిస్థితి మరింత ఉద్రిక్తంగా ఉంది. కొన్ని చోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ICE దాడులను నిలిపివేయాలని, సైనిక మోహరింపులను ఉపసంహరించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ట్రంప్ సర్కార్ నిరసనకారులపై ఉక్కుపాదం మోపుతోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..