Hanuman Temples: మీరు హనుమాన్ భక్తులా.. దేశంలోని మహిమాన్విత ఈ ఆంజనేయ ఆలయాలను దర్శించండి..
రామ భక్త హనుమంతుడికి అత్యధిక సంఖ్యలో భక్తులున్నారు. భక్తిశ్రద్దలతో కొలిస్తే కష్టాలను తీర్చే దైవం అని భక్తుల నమ్మకం. అందుకనే సంకట మోచనుడైన హనుమంతుడిని ప్రతి మంగళ శనివారాల్లో అత్యంత భక్తిశ్రద్దలతో పూజిస్తారు. సమీపంలో ఉన్న హనుమంతుడి ఆలయాలను దర్శించుకుంటారు. అయితే దేశ వ్యాప్తంగా హనుమంతుడికి సంబంధించిన ప్రసిద్ధిగాంచిన ఆలయాలున్నాయి. మీరు ఎప్పుడైనా ఈ ప్రాంతాలకు వెళ్ళితే.. తప్పకుండా ఈ హనుమంతుడి ఆలయాలను దర్శించుకోండి..

భక్తి, బలం, క్రమశిక్షణ, సానుకూలతకు ప్రతిరూపమైన హనుమంతుడు.. దేవుడిగా భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. అయితే హనుమాన్ దేవుడు కాకముందు శ్రీ రామ భక్తుడు. సీతారాములను సేవిస్తూ తన జీవితాన్ని గడిపాడు. రామయ్యకు సీతమ్మ జాడని తెలపడమే కాదు లంకేశ్వరుడిపై యుద్ధం చేసేందుకు సహాయం చేశాడు. సీతారాములను అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిచిన హనుమంతుడు చిరంజీవి. నేటికీ భూమి మీద జీవిస్తున్నాడు అని నమ్మకం. ఎక్కడ రామ నామ స్మరణ జరిగే అక్కడ హనుమంతుడు ఉంటారని.. అవసరం అయినప్పుడు పిలిస్తే పలికే దైవంగా భక్తులతో పూజలను అందుకుంటాడు. మీరు హనుమంతుడి భక్తులు అయితే మన దేశంలో తప్పకుండా దర్శించాల్సిన హనుమాన్ ఆలయాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..
హనుమాన్‌గరి, అయోధ్య శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలోని రామాలయానికి దగ్గరగా హనుమాన్ గర్హి ఉంది. రాజ్‌ద్వారం ముందు ఎత్తైన దిబ్బపై నిర్మించిన ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ హనుమాన్‌గర్హి ఆలయంలో ఏడాది పొడవునా భక్తుల ప్రవాహం ఉంటుంది. హనుమంతుడు ఇక్కడ వెండి ‘ఛత్రం’ (గొడుగు) కింద ఉంటాడు. హనుమంతుడు ఎల్లప్పుడూ పూలతో ముఖ్యంగా బంతి పువ్వులతో కప్పబడి ఉంటాడు. ఇక్కడ హనుమంతుడు చుట్టూ చెడు, అసురులతో పోరాడటానికి అతను తీసుకెళ్ళిన దైవిక ఆయుధమైన ‘గదాలు’ ఉన్నాయి. హనుమాన్ గర్హి చేరుకోవడానికి, భక్తులు హనుమంతుడి దర్శనం చేసుకోవడానికి దాదాపు 76 మెట్లు ఎక్కాలి.
శ్రీ బడే హనుమాన్ దేవాలయం, అలహాబాద్ త్రివేణి సంగమం సమీపంలోని ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న బడే హనుమాన్ మందిర్‌లో హనుమంతుడు నిద్రిస్తున్న స్థితిలో ఉన్నాడు. ఇక్కడ హనుమంతుడు శయనించిన స్థితిలో విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా ఉన్నాడు. ఈ ఆలయంలో హనుమంతుడి విగ్రహం చాలా పెద్దది. దాదాపు 20 అడుగుల పొడవు ఉంటుంది. భూమిమీద నిద్రిస్తున్నట్లు ఉంటాడు. వర్షాకాలంలో ఈ ఆలయం గంగా నీటిలో మునిగిపోతుంది. గంగాదేవి హనుమంతుడికి స్నానం చేయిస్తుందని చెబుతారు. మరొక పురాణం ప్రకారం లంక నుంచి తిరిగి వచ్చిన తర్వాత హనుమంతుడు అలసిపోయి అలహాబాద్ కోట సమీపంలో ఉన్న ఈ ప్రదేశంలో కొంత కాలం విశ్రాంతి తీసుకున్నాడు. అందువలన ఇక్కడ హనుమంతుడు శయన స్థితిలో ఉన్నాడు.
సలాసర్ హనుమాన్ దేవాలయం, రాజస్థాన్ రాజస్థాన్‌లోని చురు జిల్లాలో నిర్మించిన సలాసర్ ఆలయం ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ హనుమంతుడు విగ్రహం గడ్డం, మీసాలతో ఉంటుంది. నారింజ రంగులో ఉంటాడు. ఈ విగ్రహాన్ని ఒక రైతు పొలంలో కనుగొన్నట్లు చెబుతారు. ఇక్కడ ఉన్న హనుమంతుడికి పూజలను చేయడం ద్వారా కోరిన కోర్కెలు తీరతాయని భక్తుల నమ్మకం. భక్తులు హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి, అతని ఆశీర్వాదాలను పొందడానికి చుర్మ లడ్డూను ఆయనకు సమర్పిస్తారు.
బాలాజీ హనుమాన్ దేవాలయం, మెహందీపూర్ రాజస్థాన్ దౌసా జిల్లా సమీపంలో నిర్మించిన బాలాజీ హనుమాన్ ఆలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. వేల సంవత్సరాల క్రితం బాలాజీ రూపంలో హనుమంతుడు అక్కడ దర్శనమిచ్చాడని చెబుతారు. అందుకనే ఇక్కడ హనుమంతుడిని మెహందీపూర్ బాలాజీ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం దాదాపు వెయ్యి సంవత్సరాల పురాతనమైనదని చెబుతారు. ఈ ఆలయం భూతవైద్యం, ఇతర నమ్మకాలకు ప్రసిద్ధి చెందింది. బాలాజీ ప్రత్యేక శక్తితో దయ్యాల పీడ నయం చేస్తాడని నమ్మకం. అందుకనే దయ్యాల బారిన వ్యక్తులను ఆలయానికి తీసుకువస్తారు. బాలాజీ దర్శనం ద్వారా శారీరక, మానసిక రుగ్మతలు నయం అవుతాయని నమ్ముతారు
హనుమాన్ ధార, చిత్రకూట్ ఉత్తరప్రదేశ్ చిత్రకూట్‌లోని సీతాపూర్‌లో హనుమాన్ ధార ఆలయం ఉంది. ఈ భగవంతుని విగ్రహానికి కొంచెం పైన రెండు చెరువులు ఉన్నాయి. ఇక్కడ నీరు ఎల్లప్పుడూ ప్రవహిస్తుంది. అందుకే దీనికి హనుమాన్ ధార అని పేరు వచ్చింది. రోప్‌వే ద్వారా మందిరానికి చేరుకోవాలి. తమ జీవితంలోని అన్ని అనారోగ్యాన్ని, చెడుని తొలగించమని హనుమంతుడిని ప్రార్థిస్తారు. ఈ హనుమాన్ ధార ఆలయానికి ఉన్న ఒక ప్రత్యేకత ఏమిటంటే, ఆలయంలోని హనుమంతుడి విగ్రహం మీద సహజంగా నీటి ప్రవాహం ఉంటుంది. అయితే ఈ ప్రవాహం ఎక్కడి నుంచి వస్తుందో, ఉద్భవించిందో ఎవరికీ తెలియదు. లంకను తగలబెట్టిన తర్వాత హనుమంతుడు ఇక్కడికి వచ్చినప్పుడు.. రాముడు అతన్ని చల్లబరచడానికి ఈ ప్రవాహాన్ని తయారు చేశాడని పూజారులు, స్థానికులు చెబుతారు.
శ్రీ సంకత్మోచన దేవాలయం, వారణాసి ఉత్తరప్రదేశ్‌లో ప్రముఖ ఆధ్యాత్మిక నగరం వారణాసిలో సంకటమోచనుడి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. గోస్వామి తులసీదాసు తపస్సు, ధర్మం మెచ్చి ఈ హనుమంతుని విగ్రహం స్వయంభువుగా వెలసినట్లు నమ్మకం. ఈ ఆలయంలో హనుమంతుడు తన భక్తుల బాధలు, ఇబ్బందులను తొలగిస్తాడని నమ్మకం. భక్తి , ప్రేమతో ఆలయానికి వచ్చే వారు ప్రశాంతతను పొందుతారు. ఆలయం చుట్టూ పచ్చదనం, ప్రసాద దుకాణాలు, బొమ్మలు ఉన్నాయి. ఇక్కడ హనుమంతుని విగ్రహం ముదురు నారింజ రంగులో ఉంటుంది. హనుమంతుడి కళ్ళు భక్తులను తన వైపుకు పిలుస్తున్నట్లుగా కనిపిస్తాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు