- Telugu News Photo Gallery Spiritual photos Growing Nandi Statue: Yaganti Uma Maheswara Temple Mystery
Nandi Statue: కలియుగాంతానికి చిహ్నం ఇక్కడ నందీశ్వరుడు.. ఏటా పెరుగుతున్న నంది.. రంకె వేసిన రోజు యుగాంతమట..
భారతదేశం కర్మ సిద్ధాంతాన్ని నమ్మే భూమి. మనిషిలో అధర్మం పెరిగినప్పుడు.. న్యాయం నశించి అన్యాయానికే రోజులు వస్తే దేవుడు భూమి అవతరిస్తాడని..అప్పుడు ఈ కలియుగం అంతం అయిపోతుందని ప్రభలమైన నమ్మకం. కలియుగాంతం అయ్యే రోజులు దగ్గరకు వస్తాయి అని తెలిపేందుకు సాక్ష్యంగా మన దేశంలో అనేక దేవాలయాలున్నాయి. అందులో ఒకటి శివుని వాహనమైన నందీశ్వరుడు క్రమంగా పెరగడం.. ఈ నందికి ప్రాణం వచ్చి రంకె వేసిన రోజున కలియుగాంతం అవుతుందని కాలజ్ఞానంలో కూడ ఉంది. ఈ రోజు ఈ నందీశ్వరాలయం ఎక్కడ ఉంది తెలుసుకుందాం..
Updated on: Jun 06, 2025 | 5:21 PM

భారతదేశంలో చాలా పురాతన ఆలయాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఆలయాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఈ ఆలయాలన్నీ వాటి రహస్యాలు, అద్భుతాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. అలాంటి మర్మమైన ఆలయం ఆంధ్రప్రదేశ్ లో ఒకటి ఉంది. ఆ దేవాలయంలో ఉన్న నంది విగ్రహం పరిమాణం నిరంతరం పెరుగుతోంది. ఈ విగ్రహం పరిమాణం పెరుగుతుండటంలోని రహస్యాన్ని ఇప్పటివరకు ఎవరూ కనుగొనలేకపోయారు.

నంది విగ్రహం పరిమాణం పెరుగుతుండటం గురించి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో పేర్కొన్నారు. మరోవైపు ప్రజలలో కూడా అనేక నమ్మకాలు ప్రబలంగా ఉన్నాయి. ఈ ఆలయ ఖ్యాతి తెలుగు రాష్ట్రాల్లో మాత్రమె కాదు దేశ విదేశాల్లో కూడా వ్యాపించింది. కలియుగాంతంలో ఈ నంది విగ్రహానికి జీవం వస్తుందని నమ్ముతారు. ఈ ఆలయంలో శివుడు అర్ధనారీశ్వరుడుగా పూజలను అందుకుంటున్నాడు.

ఈ ఆలయం ఎక్కడంటే.. ఈ శివాలయం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో ఉంది. ఈ ఆలయం పేరు శ్రీ యాగంటి ఉమామహేశ్వర ఆలయం. ఈ ఆలయం వైష్ణవ సంప్రదాయాల ప్రకారం నిర్మించబడింది. దీనిని 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యంలోని సంగం రాజవంశానికి చెందిన రాజు హరిహర బుక్క రాయలు నిర్మించారు. ఇది పురాతన కాలం నాటి పల్లవ, చోళ, చాళుక్య, విజయనగర పాలకుల సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది.

ఆలయ చరిత్ర ఈ ఆలయ నిర్మాణం గురించి ఒక ప్రసిద్ధ పురాణ కథ ఉంది. ఇక్కడ ఉన్న శివాలయాన్ని అగస్త్య మహర్షి స్థాపించాడని చెబుతారు. వాస్తవంగా ఇక్కడ అగస్త్య మహర్షి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలనుకున్నాడు. అయితే విగ్రహ ప్రతిష్టాపన సమయంలో విగ్రహం బొటనవేలు విరిగింది. అందుకనే గర్భ గుడిలో ఆ విగ్రహాన్ని ప్రతిష్టించడానికి పనికి రాదు కనుక.. కలత చెందిన అగస్త్య మహర్షి శివుడిని కోసం తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై ఈ ప్రదేశం కైలాసంలా కనిపిస్తుందని.. కనుక ఇక్కడ తన ఆలయాన్ని నిర్మించడం సరైనదని చెప్పాడు. అప్పుడు అగస్త్యుడు శివుడిని ఒకే రాయిలో ఉమా మహేశ్వరుడిగా భక్తులకు దర్శనం ఇవ్వమని కోరాడు. దానికి అంగీకరించిన శివుడు.. ఇక్కడ అర్ధనారీశ్వరుడుగా భక్తులతో పూజలను అందుకుంటున్నాడు.

పెరుగుతోన్న నంది విగ్రహం నంది విగ్రహం అన్ని శివాలయాలలో ఉంటుంది. అయితే ఇక్కడ ప్రతిష్టించిన నంది విగ్రహం చాలా ప్రత్యేకమైనది. అద్భుతమైంది. ఇక్కడ ఉన్న నంది విగ్రహం పెరుగుతుందని నమ్ముతారు. ప్రజలు మాత్రమే కాదు శాస్త్రవేత్తలు కూడా ఇక్కడ ఉన్న విగ్రహం పరిమాణం ప్రతి 20 సంవత్సరాలకు ఒక అంగుళం పెరుగుతుందని చెబుతున్నారు. ఇలా నంది పెరుగుతూ ఉండడంతో అలాయంలోని స్తంభాలను ఒక్కొక్కటిగా తొలగించాల్సి వస్తుందట. దీనితో పాటు కలియుగం ఎప్పుడైతే అంతమయ్యే రోజు వస్తుందో.. ఆ రోజు ఈ భారీ నంది విగ్రహ రూపానికి జీవం వస్తుందని.. ఆ రోజు మహాప్రళయం వస్తుందని.. ఆ తర్వాత కలియుగం ముగుస్తుందని చెబుతారు.

కాకులు తిరగని యాగంటి క్షేత్రం ఈ ఆలయంలో శనిశ్వరుడిపై ఎటువంటి ప్రభావం ఉండదు. ఈ ఆలయం దగ్గర మాత్రమే కాదు చుట్టుపక్కల కూడా ఎప్పుడూ కాకులు ఎప్పుడూ కనిపించవు. ఇది అగస్త్య మహర్షి శాపం వల్ల జరిగిందని చెబుతారు. పురాణాల ప్రకారం.. అగస్త్య మహర్షి ధ్యానం చేస్తున్నప్పుడు, కాకులు ఆయనను ఇబ్బంది పెట్టాయి. కోపంతో ఆ మహర్షి కాకులు ఎప్పుడూ ఇక్కడకు రాకూడదు అంటూ శపించాడట. అందుకనే ఈ క్షేత్రంలో కాకులు కనిపించవు.
