ముంబైలో సాన్యా మల్హోత్రా డ్రీమ్ హోమ్.. హోమ్ టూర్ వీడియో వైరల్!
బాలీవుడ్ నటి సాన్యా మల్హోత్రా తన జీవితంలో ఒక పెద్ద మైలురాయిని చేరుకున్నారు. ముంబైలోని జుహు-వెర్సోవా లింక్ రోడ్డులో ఉన్న ఒక ఖరీదైన అపార్ట్‌మెంట్‌లోకి ఆమె గృహప్రవేశం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను సాన్యా తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. "ఈ ఇంటి ప్రతి గోడ నా ఓర్పుకు, నమ్మకానికి ప్రతిరూపం" అంటూ ఎమోషనల్ అయ్యారు.

సినిమా రంగంలోకి ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటీమణి ఆమె. ‘దంగల్’ సినిమాతో వెండితెరకు పరిచయమై, తన సహజ సిద్ధమైన నటనతో అనతి కాలంలోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఎన్నో ఏళ్ల కష్టం, మరెన్నో కలల ఫలితంగా ముంబై నగరంలో ఒక అద్భుతమైన ఇల్లు కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు. పట్టుదల ఉంటే ఎంతటి విజయాన్నైనా అందుకోవచ్చని నిరూపించిన ఆ ‘క్యాథల్’ బ్యూటీ మరెవరో కాదు.. సాన్యా మల్హోత్రా.
అత్యంత ఖరీదైన ఇల్లు..
సాన్యా ఈ అపార్ట్‌మెంట్‌ను సుమారు 14.3 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. దీని కోసం కేవలం స్టాంప్ డ్యూటీ రూపంలోనే 71.5 లక్షల రూపాయలు చెల్లించినట్లు సమాచారం. ఇది ఆమెకు ముంబైలో రెండో ఇల్లు కావడం విశేషం. 2018లోనే ఆమె ఒక ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు, కానీ తన కుటుంబ సభ్యులు ఢిల్లీ నుండి వచ్చినప్పుడు సౌకర్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ పెద్ద ఇంటిని తీసుకున్నట్లు సాన్యా తెలిపారు. సాన్యా తన ఇంటిని వింటేజ్, మోడ్రన్ స్టైల్స్ కలిపి అద్భుతంగా డిజైన్ చేయించారు. బాటిల్ గ్రీన్ కలర్ తలుపుతో మొదలయ్యే ఈ ఇంటి లోపల అందమైన పూల అలంకరణలు కనిపిస్తాయి. గోడలకు ఆఫ్-వైట్ మరియు సేజ్ గ్రీన్ రంగులు వేశారు. వీటికి తగ్గట్టుగానే డార్క్ గ్రీన్ కర్టెన్లు ఇంటికి రాజసాన్ని ఇస్తున్నాయి. సముద్రం కనిపిస్తూ, సూర్యాస్తమయం ఆస్వాదించేలా విశాలమైన బాల్కనీలు ఉన్నాయి. సాంప్రదాయ ఇళ్లలో ఉండేలా ఒక అందమైన ఊయల కూడా ఇందులో ఉంది.
View this post on Instagram
తండ్రి ఇచ్చిన ధైర్యంతోనే..
మొదట్లో ఆర్థిక విషయాల గురించి ఆలోచించి సాన్యా ఇల్లు కొనడానికి వెనుకాడారట. కానీ, అద్దె కట్టడం కంటే సొంత ఇల్లు ఉండటం మేలని ఆమె తండ్రి ప్రోత్సహించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో ఉండే తన కుటుంబం ముంబై వచ్చినప్పుడు ప్రశాంతంగా గడపాలన్నదే ఆమె ప్రధాన ఆశయం. ప్రస్తుతం ఆమె కోరిక నెరవేరడంతో అభిమానులు మరియు సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. “ముంబై నాకు స్వేచ్ఛను ఇచ్చింది, నన్ను ప్రశాంతంగా ఉంచుతుంది” అని చెప్పే సాన్యా, తన కష్టార్జితంతో నిర్మించుకున్న ఈ ఇంట్లో మరెన్నో విజయాలు అందుకోవాలని కోరుకుందాం.
