AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: కెనడా ప్రధాని కార్నీతో ప్రధాని మోదీ భేటీ! కీలక విషయాలపై చర్చ

జీ7 శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ మధ్య సమావేశం జరిగింది. తాజా దౌత్య వివాదాల తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. వ్యాపారం, శక్తి, అంతరిక్షం వంటి రంగాలలో సహకారాన్ని పెంచుకోవడానికి ఇద్దరు నాయకులు అంగీకరించారు.

PM Modi: కెనడా ప్రధాని కార్నీతో ప్రధాని మోదీ భేటీ! కీలక విషయాలపై చర్చ
Pm Modi And Canada Pm
SN Pasha
|

Updated on: Jun 18, 2025 | 8:37 AM

Share

మంగళవారం రాత్రి (కెనడా కాలమానం ప్రకారం) కెనడాలోని కననాస్కిస్‌లో జరిగిన G7 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కెనడా ప్రధాని మార్క్ కార్నీతో సమావేశం అయ్యారు. ఇండియా, కెనడా మధ్య సంబంధాలు ‘చాలా ముఖ్యమైనవి’ అని మోదీ అన్నారు. మార్క్‌ కార్నీ 2025 మేలో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇద్దరు నాయకుల మధ్య జరిగిన మొదటి సమావేశం ఇదే. భారత్‌-కెనడా సంబంధాలు చాలా ముఖ్యమైనవని నేను నమ్ముతున్నాను. భారత్‌, కెనడా కలిసి పనిచేయాలి, అనేక రంగాలలో సహకారాన్ని సాధించాలి అని ద్వైపాక్షిక సమావేశానికి ముందు ప్రధాని మోదీ అన్నారు. సదస్సు విజయవంతంగా నిర్వహించినందుకు కెనడా ప్రధాని కార్నీని మోదీ అభినందించారు.

“ప్రధాని మార్క్ కార్నీతో అద్భుతమైన సమావేశం జరిగింది. G7 శిఖరాగ్ర సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు ఆయనను, కెనడా ప్రభుత్వాన్ని అభినందనలు. భారత్‌, కెనడా ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, చట్ట పాలనపై బలమైన నమ్మకంతో పోలికలు కలిగి ఉన్నాయి. భారత్‌-కెనడా స్నేహాన్ని బలోపేతం చేయడానికి ప్రధాని కార్నీ, నేను ఎదురుచూస్తున్నాం. వాణిజ్యం, శక్తి, అంతరిక్షం, స్వచ్ఛమైన శక్తి, కీలకమైన ఖనిజాలు, ఎరువులు, మరిన్ని రంగాల్లో పరస్పర సహకారం ఉంటుంది.” అని సమావేశం తర్వాత ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

2023లో కెనడాలోని గురుద్వారా బయట హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో NIA నియమించిన భారత ఏజెంట్ల ప్రమేయం ఉందనే కెనడా ఆరోపణల నేపథ్యంలో.. భారత్‌, కెనడా మధ్య కొంతకాలం ఘర్షణ వాతావరణం నెలకొన్న తర్వాత ప్రధాని మోదీ కెనడా పర్యటన ప్రారంభమైంది. ఈ ఆరోపణలను భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఇరు దేశాలు పరస్పరం ప్రతిగా సీనియర్ దౌత్యవేత్తలను బహిష్కరించడంతో దౌత్యపరమైన ప్రతిష్టంభన పెరిగింది. కెనడా గడ్డపై ఉగ్రవాదం, భారత వ్యతిరేక కార్యకలాపాల గురించి భారత్‌ నిరంతరం ఆందోళనలను వ్యక్తం చేస్తూనే ఉంది, అటువంటి శక్తులను అరికట్టడానికి కెనడా అధికారులు కచ్చితమైన చర్యలు తీసుకోవాలని కోరింది.

కాగా ఇప్పుడు తాజా భేటీ తర్వాత రెండు దేశాలు తమ రాయబారులను ఒకరి రాజధానులకు మరొకరు తిరిగి పంపించాలని అంగీకరించాయి. G7 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు భారత్‌ను ఆహ్వానించినందుకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. G7లో ప్రధాని మోదీకి ఆతిథ్యం ఇవ్వడం గొప్ప గౌరవమని కార్నీ అన్నారు. కాగా దశాబ్దం తర్వాత ప్రధాని మోదీ కెనడాలో పర్యటించారు. ఐదు దేశాల పర్యటనలో మూడవ, చివరి దశలో ఆయన కెనడా నుండి క్రొయేషియాకు బయలుదేరుతారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి