Doomsday Fish: తమిళనాడు సముద్ర తీరంలో 30 అడుగుల విచిత్ర చేప.. భారీ విపత్తు తప్పదంటూ భయం! కారణం ఏంటంటే..?
తమిళనాడు తీరంలో 30 అడుగుల పొడవున్న అరుదైన ఓర్ ఫిష్ (రిగాలెకస్ గ్లెస్నే) చేప మత్స్యకారుల వలలో చిక్కుకుంది. జపాన్‌లో దీన్ని 'ప్రళయ చేప'గా భావిస్తారు. ఈ ఘటన భూకంపాలు, సునామీలకు సంకేతమని కొందరు భయపడుతుండగా, సముద్ర జీవశాస్త్రవేత్తలు ఇది సహజ సంఘటన అని వివరించారు.

తమిళనాడు సముద్ర తీరం వద్ద మత్స్యకారుల వలలో ఓ అరుదైన చేప పడింది. అది చూసి.. అక్కడున్న వారంతా భయంతో వణికిపోయారు. వాళ్లే కాదు.. ఆ చేప పడిందనే విషయం తెలిసిన చాలా మంది ఆందోళన చెందుతున్నారు. వామ్మో.. ఈ చేప వలలో పడిందంటే.. ఏదో పెద్ద ముప్పు రాబోతోంది అంటూ భయపడుతున్నారు. ఇంతకీ మత్స్యకారుల వలలో ఏ చేప పడింది? దాన్ని చూసి ఎందుకంత భయపడుతున్నారో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
తమిళనాడు సముద్ర తీరంలో మత్స్సకారుల వలలో 30 అడుగుల పొడవు ఉన్న ఓ అరుదైన చేప పడింది. దాన్ని ఓర్ ఫిష్ అని అంటారు. అయితే.. ఈ చేప సముద్ర గర్భంలో ఉంటుంది. సాధారణంగా ఇది సముద్ర పై భాగానికి రాదు.. అలా వచ్చిందంటే.. ఏదో విపత్తు రాబోతుందని చాలా మంది నమ్ముతారు. జపాన్‌లో కూడా ఈ చేపను ప్రళయ చేపగా భావిస్తారు. ఇది కనిపించిందంటే.. కచ్చితంగా ఏదో అరిష్టం జరగబోతుందని అర్థం. ముఖ్యంగా భారీ భూకంపాలు, సునామీలు వచ్చే ప్రమాదానికి సూచికంగా ఈ చేప ఒడ్డున కనిపిస్తుందని అనేక మంది నమ్ముతారు. ఇప్పుడు అలాంటి వారే ఈ చేప కనిపించిందనే విషయం తెలిసి.. ఆందోళన చెందుతున్నారు.
కాగా ఈ అరుదైన ఓర్ ఫిష్‌ను శాస్త్రీయంగా రిగాలెకస్ గ్లెస్నే (Regalecus Glesne) అని పిలుస్తారు. సముద్రంలో నివసించే అతిపెద్ద ఎముకల చేప జాతుల్లో ఒకటి. ఇది సాధారణంగా సముద్రంలో 200 నుంచి 1,000 మీటర్ల లోతులో జీవిస్తుంది. దీని వెండి రంగు శరీరం, తలపై ఉండే ఎర్రటి కిరీటం వంటి నిర్మాణం దీన్ని ప్రత్యేకంగా ఉంచుతుంది. అయితే ఈ చేపను జపాన్, ఆగ్నేయాసియా దేశాల్లో అపశకునంగా భావిస్తారు. అక్కడ దీనిని ‘డూమ్స్ డే ఫిష్’ లేదా ‘ప్రళయ చేప’ అని పిలుస్తారు.
అయితే తాజాగా తమిళనాడులో ఈ చేప కనిపించడంతో మత్స్యకారులు, స్థానిక ప్రజలతో పాటు నెటిజన్లు కూడా భయం వ్యక్తం చేస్తున్నారు. ఈ చేపకు సంబంధించిన వీడియో ఈ నెల మొదటి వారంలో సోషల్ మీడియాలో కనిపించింది. ఆ తర్వాత వింత చేప వీడియో అంటూ వైరల్ అయింది. ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు ప్రపంచం అంతమైపోతుందేమోనని భయపడుతున్నారు. మరోవైపు సముద్ర జీవశాస్త్రవేత్తలు ఈ భయాలను కొట్టిపారేస్తున్నారు. ఓర్ ఫిష్ గాయపడినప్పుడు లేదా సముద్ర ప్రవాహాల వల్ల దారి తప్పినప్పుడు మాత్రమే ఉపరితలానికి వస్తాయని అంటున్నారు. దీన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.
Doomsday fish have been found in Tamil Nadu, India. pic.twitter.com/MQWurkE9ZN
— ಸನಾತನ (@sanatan_kannada) May 31, 2025
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
