AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు గడియ వేసి..

మేడ్చల్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈఎంఐ కట్టలేక యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. బైక్ లోన్ చెల్లింపుల విషయంలో ఫైనాన్సర్ల వేధింపులు తట్టుకోలేక 34 ఏళ్ల సుమన్ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

Telangana: షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు గడియ వేసి..
Medchal
Vijay Saatha
| Edited By: |

Updated on: Feb 28, 2026 | 6:29 PM

Share

మేడ్చల్ జిల్లా చిర్యాల్ గ్రామానికి చెందిన సుమన్ కీసరలో మొబైల్ షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలం క్రితం సెకండ్ హ్యాండ్ బైక్‌ను ప్రైవేట్ ఫైనాన్స్ ద్వారా కొనుగోలు చేశాడు. అయితే వ్యాపారం సరిగ్గా సాగకపోవడంతో ఈఎంఐలను క్రమం తప్పకుండా చెల్లించలేకపోయాడు. ఈ క్రమంలో ఫైనాన్సర్లు పలుమార్లు ఇంటికి వచ్చి డబ్బులు చెల్లించాలని ఒత్తిడి తీసుకువచ్చినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇటీవల ఫైనాన్సర్లు ఇంటి వద్దకు వచ్చి నానా హంగామా చేయడంతో పరువు పోయిందని తీవ్ర మనస్తాపానికి గురైన సుమన్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫైనాన్సర్ల వేధింపుల కోణంలో విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఈ ఘటనతో చిర్యాల్ గ్రామంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది. కుటుంబానికి ఏకైక ఆధారంగా ఉన్న సుమన్ అకస్మాత్తుగా మృతి చెందడంతో అతడి భార్య, పిల్లలు, తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. చిన్నచిన్న ఆర్థిక ఇబ్బందులు ఎంత పెద్ద విషాదాలకు దారితీస్తాయో ఈ ఘటన స్పష్టం చేస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల ఆరోపణల ప్రకారం, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు బాకీలు వసూలు చేసే సమయంలో అనుచిత పద్ధతులు అవలంబిస్తున్నాయని, అప్పుదారులను బహిరంగంగా అవమానించే విధంగా ప్రవర్తిస్తున్నాయని అంటున్నారు. ఇలాంటి వేధింపులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీసులను కోరుతున్నారు. ఫైనాన్సర్ల కాల్ రికార్డులు, సందేశాలు తదితర వివరాలను పోలీసులు సేకరిస్తున్నట్లు సమాచారం.

మరోవైపు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఆత్మహత్య వంటి తీవ్ర నిర్ణయాలకు వెళ్లకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడాలని, అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సమస్యలు ఎంత పెద్దవైనా పరిష్కారం ఉంటుందని, క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు కుటుంబాలను దెబ్బతీస్తాయని వారు హెచ్చరిస్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Follow Us