అంతర్జాతీయ మహిళా దినోత్సవం
‘పట్టు విడవకుండా చేసే ప్రయత్నం చివరికి విజయాన్ని సాధించి పెడుతుంది. అయితే దీనిని ఒక రోజులో సాధించలేం..’ అని స్వామి వివేకానంద అన్న మాటలు మగువలు నెరవేర్చి చూపారు. అన్నింటా సాధికారిత దిశగా అడుగులు వేసుకుంటూ ముందుకు సాగుతోన్న మహిళలు.. మహిళా దినోత్సవం సాధించుకోవడానికి దశాబ్ధాలపాటు పోరాడారు. అలా సాధించుకున్న విజయమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. దీనిని ప్రతీయేట మార్చి 8న జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలలో మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ సహకారాన్ని గుర్తించి, గౌరవించే ప్రపంచ దినోత్సవం ఇది. ఈ రోజున మహిళలు సాధించిన విజయాలను గుర్తించి, వారిని గౌరవించడం ఆనవాయితీగా వస్తోంది. సమానత్వం కోసం చేసే ప్రయత్నాన్ని కొనసాగించడానికి వారికి అధికారం ఇస్తుంది. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత శిఖరాలు అధిరోహించినప్పటికీ మహిళకు ఇంకా లింగ వివక్ష, హింస, దురాగతాలు తప్పడం లేదు. సమాన వేతనం, విద్యకు ప్రాధాన్యత, నాయకత్వ అవకాశాలు వంటి రంగాలలో మహిళలు ఇప్పటికీ ఎన్నో సవాళ్లు, వివక్షలను ఎదుర్కొంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో ఐక్యత, సంఘీభావాన్ని పెంపొందించడానికి, అనుభవాలను పంచుకోవడానికి, ఒకరికొకరు మద్దతు ఇవ్వడానికి, సమాన హక్కులు – అవకాశాలను కొనసాగించడంలో వారిని సామూహిక శక్తిగా మార్చడానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారిని ఒకచోట చేర్చుతుంది. ముఖ్యంగా మహిళలు సాధించిన విజయాలను ప్రపంచానికి చాటిచెప్పడానికి, ఇప్పటికే ఉన్న అసమానతల గురించి అవగాహన పెంచుకోవడానికి, భవిష్యత్తులో మహిళలు సమాన హక్కులు-అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఉద్యమించాల్సిన కర్తవ్యాన్ని గుర్తు చేసుకునే రోజు ఇది. ఇంటా, బయటా మహిళలు ఎదుర్కొనే సమస్యలు, మహిళల హక్కులు, వారిపై జరుగుతోన్న లైంగిక దోపిడీ వంటి పలు సమస్యల చర్చకు ఇది వేదిక. కాగా ప్రతీ యేట మహిళా దినోత్సవాన్ని ఓ ప్రత్యేక థీమ్‌తో జరుపుకుంటారు. 2024 ఏడాదికి ‘ ఇన్‌స్పైర్ ఇన్‌క్లూజన్’ అనే థీమ్‌తో ఇంటర్నేషనల్ విమెన్స్ డేని జరుపుకుంటున్నారు.