AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s Day: మహిళలకు ఉచితంగా రూ.2500! అయితే ఈ అర్హతలు ఉండాల్సిందే..!

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, ఢిల్లీలోని ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన మహిళలకు నెలకు రూ. 2,500 అందించే "మహిళా సమృద్ధి యోజన"ను ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం ప్రకటించనుంది. ఈ పథకం 21-60 ఏళ్ల వయస్సు గల, వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలకు మించని మహిళలకు వర్తిస్తుంది. మార్చి 8 నుండి రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. అయితే, ఆమ్ ఆద్మీ పార్టీ ఈ హామీపై విమర్శలు చేస్తోంది.

Women's Day: మహిళలకు ఉచితంగా రూ.2500! అయితే ఈ అర్హతలు ఉండాల్సిందే..!
Mahila Samridhi Yojana
SN Pasha
|

Updated on: Mar 08, 2025 | 12:12 PM

Share

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వం మహిళలకు గుడ్‌న్యూస్‌ చెప్పనుంది. ఢిల్లీలో ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన మహిళలకు రూ.2,500 అందించే మహిళా సమృద్ధి యోజనను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం జేఎల్‌ఎన్ స్టేడియంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొనే మహిళా దివస్ కార్యక్రమంలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. బీజేపీ ఎన్నికల హామీల్లో భాగంగా మహిళా సమృద్ధి యోజనపై క్యాబినెట్ నోట్‌ను ముఖ్యమంత్రి రేఖ గుప్తా నేతృత్వంలోని ఢిల్లీ క్యాబినెట్ సమావేశం ఆమోదం కోసం శనివారం సమర్పించవచ్చని తెలుస్తోంది. ఈ పథకానికి ఆమోదం తెలిపే ముందు దాని మార్గదర్శకాలు, అర్హత ప్రమాణాలను మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది.

శనివారం మధ్యాహ్నం జేఎల్‌ఎన్ స్టేడియంలో జరిగే ఢిల్లీ బీజేపీ మహిళా దివస్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ యూనిట్ కో-ఇన్‌చార్జ్ అల్కా గుర్జార్, రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా, మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనితా శ్రీనివాసన్, బీజేపీ ఎంపీలు కమల్జీత్ సెహ్రావత్, బన్సూరి స్వరాజ్ సహా పలువురు సీనియర్ బీజేపీ నేతలు హాజరు కానున్నారు. ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ అధికారంలోకి రాగానే మహిళా సమృద్ధి యోజన కింద పేద కుటుంబాలకు చెందిన మహిళలకు నెలకు రూ.2,500 అందిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది.

21 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు, వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలకు మించని మహిళలకు ఈ పథకం వర్తించనుంది. ఈ పథకం కోసం రిజిస్ట్రేషన్ మార్చి 8న ప్రారంభమవుతుందని, అర్హత కలిగిన లబ్ధిదారుల జాబితాను తయారు చేస్తామని, ఆ తర్వాత ఆర్థికంగా పేద ప్రతి మహిళకు రూ.2,500 అందించే మొత్తం ప్రక్రియ ఒకటిన్నర నెలల్లో పూర్తవుతుందని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ గత వారం చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ విషయంలో “వాగ్దానం” చేసినప్పటికీ, బీజేపీ ప్రభుత్వం తన మొదటి మంత్రివర్గ సమావేశంలో ఈ పథకాన్ని ఆమోదించలేదని ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శించింది. మరి నేడు మహిళ దినోత్సవం సందర్భంగా దీనిపై ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.