Bomb Threat: అయోధ్య ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు! ఉలిక్కి పడిన ఇండియన్ రైల్వేస్
అయోధ్య ఎక్స్‌ప్రెస్ రైలుకు శుక్రవారం రాత్రి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. లక్నో చార్బాగ్ స్టేషన్ చేరేలోపు రైలును పేల్చివేస్తామని బెదిరింపు ధ్వనించింది. బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహించి, ఏమీ దొరకకపోవడంతో రైలు ప్రయాణం కొనసాగింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసింది.

ఢిల్లీ వెళ్తున్న అయోధ్య ఎక్స్‌ప్రెస్‌కు శుక్రవారం బాంబు బెదిరింపు కాల్ రావడంతో ఇండియన్ రైల్వే అధికారులు ఉలిక్కిపడ్డారు. శుక్రవారం రాత్రి ఈ బెదిరింపు రావడంతో వెంటనే ఆ రైలును నిలిపివేశారు. దాదాపు రెండు గంటల పాటు రైలులో బాంబు కోసం తనిఖీలు నిర్వహించారు. బాంబ్ స్క్వౌడ్ తనిఖీలు చూసి ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం రాత్రి 112 అత్యవసర నంబర్‌కు బెదిరింపు కాల్ వచ్చింది. అయోధ్య ఎక్స్‌ప్రెస్ (14205) లో బాంబు పెట్టారని, రైలు లక్నోలోని చార్‌బాగ్ రైల్వే స్టేషన్‌కు చేరుకునేలోపు పేలిపోతుందని కాల్ చేసిన వ్యక్తి చెప్పాడని అధికారులు తెలిపారు.
“రాత్రి 7.30 గంటల ప్రాంతంలో రైలు బారాబంకి స్టేషన్‌కు చేరుకునే సమయానికి, ఇప్పటికే భారీ పోలీసు బందోబస్తు ఉంది. బాంబు స్క్వాడ్, సెర్చ్ స్క్వాడ్‌లు ప్రతి కోచ్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశాయి” అని పోలీసు సూపరింటెండెంట్ దినేష్ కుమార్ సింగ్ తెలిపారు. వెంటనే, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గవర్నమెంట్ రైల్వే పోలీస్, బాంబు డిస్పోజల్ స్క్వాడ్ రైలులో సమగ్ర శోధనను ప్రారంభించాయని పోలీసు అధికారులు తెలిపారు. లక్నో చార్‌బాగ్ స్టేషన్‌లో రైలును పేల్చివేస్తామని S-8 కోచ్ టాయిలెట్ లోపల ఒక సందేశాన్ని కూడా శోధన బృందాలు గుర్తించాయి. “బాంబ్ మినీ RDX 8/7 UC 100 mm టైమర్”. ఈ బెదిరింపును అధికారులు తీవ్రంగా పరిగణించాలని ఆ సందేశంలో హెచ్చరిక ఉంది.
S-4/S-5 కోచ్‌లలోని డఫెల్ బ్యాగ్‌లో బాంబును దాచిపెట్టారని వారు తెలిపారు. సహాయం కోసం బాంబు నిర్వీర్య దళాన్ని పిలిపించినట్లు ఎస్పీ సింగ్ ధృవీకరించారు. అయితే ఈ బెదిరింపు కాల్ ఎవరు చేశారు? ఎక్కడి నుంచి వచ్చింది అని కూడా అధికారులు విచారణ చేపట్టారు. అయితే బాంబు స్క్వాడ్‌కు ఎలాంటి పేలుడు పదార్థాలు దొరక్కపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత రైలు ఆ స్టేషన్ నుంచి బయలుదేరేందుకు అనుమతి ఇచ్చారు. ఓ రెండు గంటల పాటు అధికారులు, ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ఉన్నారు. అయితే బాంబు లభించకపోవడంతో బెదిరింపు కాల్ ఫేక్ అయిఉంటుందని అధికారులు అంటున్నారు. అయితే ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయకుండా లోతుగా దర్యాప్తు చేపట్టాలని పై అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
