Women’s day: రుణం తీసుకుంటే మహిళలకు ఇన్ని ప్రయోజనాలా..?అస్సలు వదులుకోవద్దు..
సొంత ఇల్లు సమకూర్చుకోవడం అనేది ప్రతి ఒక్కరి కల. ఉద్యోగం చేరిన వెంటనే, వ్యాపారంలో స్థిర పడిన తర్వాత ఇల్లు నిర్మించుకోవడానికి తొలి ప్రాధాన్యం ఇస్తారు. ఈ విషయంలో పురుషులకంటే మహిళలకు ఎక్కువ ప్రయోజనాలు అందుతున్నాయి. ముఖ్యంగా హౌసింగ్ రుణాల విషయంలో అ నేక రాయితీలు లభిస్తున్నాయి. మహిళలు ఇంటి యజమానులుగా మారడానికి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ప్రభుత్వాలు సహకారం అందిస్తున్నాయి. హౌసింగ్ రుణాల విషయంలో మహిళలకు ఈ కింద ప్రయోజనాలు లభిస్తాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ఆ ఉపయోగాలను తెలుసుకుందాం.

మన దేశంలో మహిళల సంక్షేమానికి, వారి సాధికారతకు ప్రభుత్వాలు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. అన్నిరంగాల్లో ప్రగతి సాధించేందుకు వివిధ పథకాలు అమలు చేస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నాయి. మహిళా సాధికారత కోసం అనేక రాయితీలు, ప్రోత్సహకాలు అందజేస్తున్నాయి. వాటిలో హౌసింగ్ రుణాలు ఒకటి. తక్కువ వడ్డీరేట్లు, రుణ ప్రాధాన్యం, తగ్గిన స్టాంపు డ్యూటీ తదితర ఆరు కీలక ప్రయోజనాలు అందిస్తున్నాయి.
తక్కువ వడ్డీరేటు
మహిళలకు తక్కువ వడ్డీరేటుకు హౌసింగ్ రుణాలు అందిస్తున్నారు. వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకున్నా, సహ రుణదాతగా ఉన్నా వడ్డీపై 0.05 శాతం నుంచి 0.10 శాతం తగ్గిస్తారు. ఇది చాాలా తక్కువగా కనిపించినా, దీర్ఘకాలంలో గణనీయమైన పొదుపునకు దారితీస్తుంది. ఉదాహరణకు 8.75 శాతం వడ్డీరేటులో 30 ఏళ్లకు రూ.30 లక్షల హౌసింగ్ రుణం తీసుకుంటే మీరు చెల్లించాల్సిన మొత్తం రూ.84.9 లక్షలు అవుతుంది. అదే 8.65 శాతం వడ్డీ అయితే రూ.84 లక్షలు చెల్లిస్తే సరిపోతుంది.
పన్ను ప్రయోజనాలు
మహిళా రుణ గ్రహీతలు ఆదాయపు పన్నుచట్టంలోని సెక్షన్ 80 (సీ), 24 (బి) కింద ఆదాయపు పన్ను మినహాయింపులను పొందవచ్చు. అసలు మొత్తంపై ఏడాదికి రూ.1.50 లక్షల వరకూ క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే ఇంటికి చెల్లించే వడ్డీపై ఏడాదికి రూ.2 లక్షల వరకూ తగ్గింపు లభిస్తుంది. ఆస్తి సహ యాజమాన్యంలోఉంటే రుణగ్రహీతతో పాటు సహ రుణగ్రహీత కూడా వ్యక్తిగతంగా పన్ను తగ్గింపులు పొందవచ్చు.
రుణాల మంజూరులో ప్రాధాన్యం
సాధారణంగా మహిళలు ఆర్థిక క్రమశిక్షణతో మెలుగుతారు. మంచి ప్రణాళికతో ముందుకు వెళతారు. ఈ నేపథ్యంలో వారికి రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ప్రాధాన్యం ఇస్తాయి. మంచి క్రెడిట్ స్కోర్, స్థిరమైన ఆదాయం ఉన్న మహిళలకు చాలా సులభంగా హౌసింగ్ రుణాలు మంజూరవుతాయి.
తక్కువ స్టాంప్ డ్యూటీ చార్జీలు
మహిళల పేరుమీద రిజిస్టర్ చేస్తే ఆస్తులకు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తక్కువ స్టాంప్ డ్యూటీ రేట్లను అందిస్తున్నాయి. మామూలు చార్జీతో పోల్చితే ఒకటి నుంచి రెండు శాతం తగ్గిస్తున్నాయి. ఇది రిజిస్ట్రేషన్ సమయంలో గణనీయమైన పొదుపును అందిస్తుంది. మహిళల్లో ఆస్తి యాజమానాన్యి ప్రోత్సహిస్తుంది.
ప్రభుత్వ పథకాలు
ప్రభుత్వం హౌసింగ్ పథకాలలో మహిళలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) వంటి పథకాలలో ప్రయోజనం లభిస్తుంది. క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ పథకం (సీఎల్ఎస్ఎస్) కింద మహిళలకు హౌసింగ్ రుణాలపై 6.50 శాతం సబ్సిడీ అందిస్తున్నారు.
భద్రత, సాధికారత
మహిళల భద్రత, సాధికారతకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల ద్వారా వారికి ప్రయోజనాలను అందిస్తోంది. ఆస్థి కలిగి ఉన్న మహిళ ఆర్థిక స్వాతంత్య్రంలో జీవిస్తుంది. ఈ ప్రోత్సాహకాలతో నేడు దేశంలో అనేక మంది మహిళలు ఇంటి యజమానులుగా మారుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








