Congress Ticket: అభ్యర్థిని వెతుక్కోవడంలోనే మల్లగుల్లాలు పడుతున్న అధికార పార్టీ..?
పార్లమెంట్ ఎన్నికల నగరా మోగింది. ప్రత్యర్థి పార్టీలు తమ గెలుపు గుర్రాలను ప్రకటించి, ఎన్నికల సమర శంఖరావాన్ని మోగించి కదనరంగంలోకి దూకాయి. కానీ, అక్కడ అధికార పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థిని వెతుక్కోవడంలోనే మల్లగుల్లాలు పడుతోంది.

పార్లమెంట్ ఎన్నికల నగరా మోగింది. ప్రత్యర్థి పార్టీలు తమ గెలుపు గుర్రాలను ప్రకటించి, ఎన్నికల సమర శంఖరావాన్ని మోగించి కదనరంగంలోకి దూకాయి. కానీ, అక్కడ అధికార పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థిని వెతుక్కోవడంలోనే మల్లగుల్లాలు పడుతోంది. పార్టీలో బలమైన అభ్యర్థులున్నా.. అంతే బలమైన క్యాడర్ ఉన్నా.. ఎన్నికల ఖర్చుకు కూడా భరించ కలిగే నాయకులున్నా.. అధికార హస్తం పార్టీ మాత్రం అభ్యర్థి ని ఫైనల్ చేయడంలో ఇంకా తర్జనభర్జనలు పడుతూనే ఉంది.
ఓ వైపు ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపి బలం, బలగాన్ని పెంచుకుంటూనే మరింత బలమైన నేతను బరిలోకి దింపాలని చూస్తోంది కాంగ్రెస్. ప్రతిపక్ష పార్టీలు పాత నేతలకే పట్టం కట్టగా, అందుకు భిన్నంగా కొత్త నేతకే అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తోంది హస్తం పార్టీ. ఇంతకీ ఆ పార్లమెంట్ పరిధిలో అంతగా లెక్కలేసుకోవాల్సిన అవసరమేంటి..? కొత్త నేతకు పట్టం కడితే హస్తానికి ఆ పార్లమెంట్ పరిధిలో కలిసొచ్చేదెంత..? ఆపరేషన్ ఆకర్ష్ ఫలితమిచ్చేదెంత..? ఇంతలా హస్తం పార్టీలో తెగ చర్చ మొదలైంది.
అడవుల జిల్లా ఆదిలాబాద్. ఆదివాసీల ఖిల్లా. 16,44,715 మంది ఓటర్లున్న ఈ లోక్‌సభ నియోజకవర్గంలో గెలుచి నిలవాలంటే గిరిజన నాయకుడినే అభ్యర్థిగా బరిలోకి నిలపాలన్న ఎన్నికల సిద్దాంతం కొనసాగుతున్న నియోజక వర్గం. ఇప్పటికే బీజేపీ , బీఆర్ఎస్ పార్టీలు ఆ లెక్కను పక్కాగా అమలు చేస్తూ, తమ గెలుపు గుర్రాలుగా ఆదివాసీ అభ్యర్థులనే ఫైనల్ చేశారు. బీఆర్ఎస్ నుండి ఊహించినట్టుగానే మాజీ ఎమ్మెల్యే గోండు సామాజిక వర్గ నేత ఆత్రం సక్కును అభ్యర్థిగా ప్రకటించగా, బీజేపీ మాత్రం అనుహ్యంగా సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావును కాదని, బీఆర్ఎస్ నుండి వలస వచ్చిన గోండు సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ గోడం నగేష్ కు టికెట్‌ను ఖరారు చేసింది. దీంతో రెండు ప్రతిపక్ష పార్టీలు పాతనేతలైన.. ఒకే సామాజిక వర్గానికి చెందిన బలమైన ఆదివాసీ అభ్యర్థులకే జై కొట్టడంతో అధికార పార్టీ హస్తం డైలామాలో పడింది. తమ పార్టీ నుండి కూడా ఆదివాసీ నేతనే బరిలోకి దింపాలా.. లేదా భిన్నంగా వ్యవహరించి.. గతంలోలా లంబాడా సామాజిక వర్గ నేతను గెలుపు గుర్రంగా బరిలోకి దింపాల అన్న తర్జనభర్జనలో పడింది కాంగ్రెస్ పార్టీ.
ఇంతలోనే ఎన్నికల నగారా మోగడంతో ఎన్నికల సమర శంఖరావాన్ని పూరించి ఎన్నికల కదన రంగంలోకి దూకాలంటే అభ్యర్థిని వీలైనంత త్వరగా ఖరారు చేయాలని ఫిక్స్ అయింది హస్తం పార్టీ. అసలే సిట్టింగ్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోకూడదని కమలం పార్టీ వ్యూహ ప్రతివ్యూహాలు అమలు చేస్తుండటంతో వాటిని పటాపంచలు చేసేలా సరికొత్త వ్యూహంతో తెర మీదకు రావాలని కాంగ్రెస్ భావిస్తోందట. అభ్యర్థి ప్రకటనతోనే కమలం పార్టీకి ఆదిలాబాద్‌లో ఆదిలోనే షాక్ ఇవ్వాలని బావిస్తోందంట అదికార పార్టీ కాంగ్రెస్.
బీజేపీ, బీఆర్ఎస్ బాటలో కాకుండా కొత్త అభ్యర్థిని తెర మీదకు తీసుకురావాలని బావిస్తోందట కాంగ్రెస్. ఇందులో భాగంగానే అనూహ్యంగా బీజేపీ టికెట్ కోసం విశ్వప్రయత్నాలు చేసిన రిమ్స్ వైద్యురాలు ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన ప్రొఫెసర్ సుమలతను హస్తం అధిష్టానం సంప్రదించినట్లు టాక్. పార్టీలోకి వస్తే అభ్యర్థిగా అవకాశం ఇస్తామని, ఓసారి ఆలోచించుకోవాలని రేవంత్ టీం నేరుగా ఆమెను సంప్రదించినట్లు సమాచారం. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబ కావడం, సుమలత తాతా కాశీనాథ్ బోథ్ ఎమ్మెల్యేగా పని చేయడంతో పాటు.. భర్త శ్యామ్ ప్రసాద్ సైతం వైద్యుడిగా మంచి పేరుండటంతో.. ఈ సమీకరణలు తమకు కలిసి వస్తాయని హస్తం పార్టీ భావిస్తోందట.
దీంతో నిన్న మొన్నటి వరకు టికెట్ మాదే అనుకున్న కీలక హస్తం నేతలు ఒక్కసారిగా ఆందోళనలో పడినట్టు సమాచారం. కమలం, కారు పార్టీలు ఆదివాసీలకు పట్టం కట్టడంతో తమ హస్తం పార్టీ బంజారాలకే అవకాశం కల్పిస్తుందని భారీ ఆశలతో ఉన్న మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ వర్గాన్ని ఈ సమాచారం షాక్ కు గురి చేసిందట. మరోవైపు ఆదివాసీగా తనకే అవకాశం దక్కుతుందని, అదిష్టానం మాటిచ్చిందని ధీమాతో ఉన్న ఆదివాసీ మహిళ నేత ఆత్రం సుగుణ వర్గం కూడా డైలామాలో పడిందట. అయితే ఇళ్లు అలకగానే పండుగ అయినట్టు కాదని, సీటు ఖరారు గెలుపు గుర్రానిదినేనని, బలం, బలగం ఉన్న అభ్యర్థినే బరిలోకి దింపుతామని, మీరంతా ఆందోళన చెందవద్దని ఆశవాహులకు అదిష్టానం నచ్చ చెప్పినట్టు తెలుస్తోంది.
మొత్తానికి అదికార పార్టీకి ఆదిలాబాద్ సీటు ఖరారు అంత ఆశామాషీ కాకపోవడంతో అన్ని లెక్కలు వేసుకుని మళ్లీ పాత పద్దతిలోకే వస్తారో లేక.. అసెంబ్లీ ఎన్నికల వ్యూహాన్నే పార్లమెంట్ ఎన్నికల్లోను అమలు చేసి అందరి అంచనాలను తలకిందులు చేసేలా కొత్త నిర్ణయంతో తెర మీదకి వస్తారో చూడాలి. ప్రత్యర్థి పార్టీలకు భిన్నంగా ఆదిలాబాద్ పార్లమెంట్ బరిలో నిలవాలంటే మాత్రం హస్తం పార్టీ కొత్త అభ్యర్థిని తెర మీదకు తీసుకురాక తప్పదు..! అందరి ఆశీస్సులు దక్కాలంటే ఆదివాసీకే పట్టం కట్టక తప్పదు. చూడాలి మరీ చేతి హస్త వాసీ ఆదివాసీల ఖిల్లా ఆదిలాబాద్‌లో ఎలా ఉండనుందో.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…




