Telangana: విడాకులకు చెక్.. పెళ్లికి ముందే కౌన్సెలింగ్.. తెలంగాణ సర్కార్ సరికొత్త నిర్ణయం
ఒకప్పుడు విడాకులు అనే మాట చాలా అరుదుగా వినిపించేది. దంపతుల మధ్య గొడవలు అప్పట్లో లేవని కాదు కానీ.. ఎవరో ఒకరు సర్దుకుపోతూ ఉండేవారు. ఇబ్బందులు ఉన్నా పిల్లల కోసం అయినా భార్యాభర్తలు కలిసి ఉండేవారు. పెద్దలు కూడా సర్దిచెప్పేవారు. కానీ కాలం మారింది. ఇప్పుడు చిన్న చిన్న విభేదాలకే విడాకుల మార్గాన్ని ఎంచుకునే జంటలు సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. ఈ పెరుగుతున్న ధోరణిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త మార్గాన్ని అన్వేశించింది. అదేంటో తెలుసుకుందాం పదండి.

ఒకప్పుడు విడాకులు అనే మాట చాలా అరుదుగా వినిపించేది. దంపతుల మధ్య గొడవలు అప్పట్లో లేవని కాదు కానీ.. ఎవరో ఒకరు సర్దుకుపోతూ ఉండేవారు. ఇబ్బందులు ఉన్నా పిల్లల కోసం అయినా భార్యాభర్తలు కలిసి ఉండేవారు. పెద్దలు కూడా సర్దిచెప్పేవారు. కానీ కాలం మారింది. ఇప్పుడు చిన్న చిన్న విభేదాలకే విడాకుల మార్గాన్ని ఎంచుకునే జంటలు సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. ఈ పెరుగుతున్న ధోరణిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త మార్గాన్ని అన్వేశించింది. పెళ్లికి ముందు తప్పనిసరిగా కౌన్సెలింగ్ ఇవ్వాల్సిందేనని.. వైవాహిక బంధంలో తలెత్తే సమస్యలను ముందుగానే అర్థం చేసుకునేలా చేయాలన్న లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రీ-మారిటల్ కౌన్సెలింగ్ సెంటర్లు స్థాపించేందుకు తెలంగాణ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఈ కేంద్రాల్లో న్యాయ నిపుణులు, సైకాలజిస్టులు, సోషల్ వర్కర్లు, హెల్పర్లు వంటి సిబ్బంది అందుబాటులో ఉంటారు. వారు కాబోయే వధూవరులకు కౌన్సిలింగ్ ఇస్తారు. వివాహ జీవితంలో ఎదురయ్యే సవాళ్లు, విభేదాలను ఎలా ఎదుర్కోవాలో, ఒకరినొకరు ఎలా అర్థం చేసుకోవాలో మార్గనిర్దేశం చేస్తారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఈ ప్రతిపాదనపై ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. రూ.5 కోట్ల నిధులతో 33 జిల్లాల్లో ఒక్కో కౌన్సెలింగ్ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రతిపాదనకు మంత్రి సీతక్క ఆమోదం తెలిపి సంతకం చేశారు. ఇప్పుడు ఆర్థిక శాఖ నుంచి అనుమతులు వస్తే.. అంతా క్లియర్ అయిపోయినట్లే. ప్రతి జిల్లాలోని సఖీ – వన్‌స్టాప్ సెంటర్లలోనే ఈ కౌన్సెలింగ్ కేంద్రాలు తొలుత ఏర్పాటు చేయనున్నారు. అవసరమైతే తరువాత సొంత భవనాలు కూడా నిర్మించాలనే ఆలోచనలో సర్కార్ ఉంది.
ఇటీవలి కాలంలో రాష్ట్రంలోని మహిళా కమిషన్, సఖీ వన్‌స్టాప్ సెంటర్లకు దంపతుల మధ్య తలెత్తిన విభేదాలు, కుటుంబ సమస్యలపై ఫిర్యాదులు భారీగా పెరిగాయి. తల్లిదండ్రుల జోక్యం, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి వంటి అంశాలే వీటికి కారణమని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ఈ కార్యక్రమం ద్వారా వివాహ బంధాలు బలపడతాయని, విడాకుల కేసులు తగ్గుతాయని ఆశిస్తోంది. త్వరలోనే ఈ ప్రీ-మారిటల్ కౌన్సెలింగ్ సెంటర్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




