Aswaraopeta: వైన్ షాపు టెండర్ వేసి అదృష్టం పరీక్షించుకుందామంటే… దురదృష్టం వెంటాడింది
అదృష్టం పరీక్షించుకోవడానికి వెళ్లిన హోటల్ యజమానికి దురదృష్టం దెబ్బ తగిలింది. లిక్కర్ షాప్ టెండర్ కోసం బ్యాంకుకు వెళ్లిన అతను బైక్‌లో ఉంచిన రూ.2.50 లక్షల నగదు సంచిని గుర్తు తెలియని దుండగుడు ఎత్తుకెళ్లాడు. అశ్వారావుపేట ఎస్బీఐ బ్రాంచ్ ఎదుట జరిగిన ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డైంది. కేసు నమోదు చేసిన పోలీసులు దొంగ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో దొంగతనం ఘటన కలకలం రేపింది. అదృష్టం పరీక్షించుకోవడానికి లిక్కర్ షాప్ టెండర్ కోసం బ్యాంకుకు వెళ్లిన వ్యక్తికి పెద్ద దెబ్బ తగిలింది. నగదు తీసుకుని బ్యాంకు ముందు నిలిచిన అతని చేతిలోని డబ్బు సంచిని కేటుగాళ్లు ఎత్తుకెళ్లారు.
వివరాల్లోకి వెళ్తే.. అశ్వారావుపేటకు చెందిన రాజు అనే హోటల్ యజమాని శనివారం ఎస్బీఐ బ్రాంచ్ వద్దకు వచ్చాడు. రాష్ట్రంలో లిక్కర్ షాప్ టెండర్లు జరుగుతున్న నేపథ్యంలో చలానా తీయడానికి ఆయన బ్యాంకు వద్దకు వచ్చాడు. టెండర్ చలానా మొత్తం రూ.3 లక్షలు కాగా, తన దగ్గర అప్పటికి రూ.2.50 లక్షలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన రూ.50 వేల రూపాయలు తన మరో బ్యాంకు అకౌంట్ నుంచి తీసుకురావాలని భావించాడు.
అయితే అదే సమయంలో బైక్ కవర్‌లో ఉంచిన రూ.2.50 లక్షల నగదు సంచిని గుర్తు తెలియని దుండగుడు ఎత్తుకెళ్లాడు. ఈ దృశ్యం అక్కడి సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయింది. నిందితులు ముందుగానే ప్లాన్ చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. బాధితుడు రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ సంఘటనతో స్థానిక వ్యాపార వర్గాల్లో ఆందోళన నెలకొంది.
Also Read: ఘట్‌కేసర్‌లో అనుమానాస్పదంగా 17 ఏళ్ల బాలుడు.. ఆపి తనిఖీ చేయగా..




