Hyderabad: ఘట్‌కేసర్‌లో అనుమానాస్పదంగా 17 ఏళ్ల బాలుడు.. ఆపి తనిఖీ చేయగా..
హైదరాబాద్‌లో కోటి రూపాయల విలువైన హ్యాష్ ఆయిల్ పట్టుబడడం కలకలం రేపుతోంది. అంతర్రాష్ట్ర గంజాయి బ్యాచ్.. ఓ మైనర్‌తో ఒడిశా నుంచి హ్యాష్ అయిల్ తెప్పించడం షాకిస్తోంది. ఇంతకీ.. మైనర్లతో హ్యాష్ ఆయిల్ రవాణా చేయిస్తున్న కంత్రీగాళ్లు ఎవరు? .. ..

హైదరాబాద్ పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా గంజాయి గ్యాంగ్‌లు రెచ్చిపోతూనే ఉన్నాయి. పోలీసులు, టాస్క్‌ఫోర్స్ టీమ్‌లు ఎప్పటికప్పుడు డేగ కన్నేస్తున్నా.. సిటీలోని ఏదో ఒక ప్రాంతంలో పోలీసు తనిఖీల్లో డ్రగ్స్, గంజాయి, హ్యాష్ ఆయిల్ లాంటి మత్తు పదార్థాలు బయటపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. రీసెంట్‌గా.. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఘట్‌కేసర్‌లో కోటి రూపాయల విలువైన హ్యాష్ ఆయిల్ పట్టుబడింది. ఘట్‌కేసర్ రైల్వేస్టేషన్‌లో ట్రైన్ దిగి వెళ్తున్న ఓ బాలుడ్ని స్థానిక పోలీసులు, మల్కాజ్‌గిరి ఎస్‌వోటీ బృందాలు తనిఖీలు చేయడంతో హ్యాష్ ఆయిల్ గుట్టురట్టు అయింది. ఆ బాలుడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా కీలక విషయాలు వెల్లడించాడు.
ఒడిశా నుంచి హ్యాష్ ఆయిల్ తీసుకొచ్చినట్లు తెలిపాడు. అంతర్రాష్ట్ర డ్రగ్స్, గంజాయి స్మగ్లర్లు బాలుడితో హ్యాష్ ఆయిల్ సరఫరా చేయిస్తున్నట్లు గుర్తించారు. బాలుడి నుంచి స్వాధీనం చేసుకున్న సుమారు 5కేజీల హ్యాష్ ఆయిల్.. కోటి 15లక్షల వరకు విలువ ఉంటుందని రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. మైనర్లతో సరఫరా చేయిస్తే పోలీసులకు అనుమానం రాదనే అంతర్రాష్ట్ర స్మగ్లర్ల ఎత్తుగడ అన్నారు. హ్యాష్ ఆయిల్ తరలిస్తున్న బాలుడ్ని ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా జీ.మాడుగుల మండలం సారపల్లి చెందినవాడిగా ఐడెంటిఫై చేశారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసిన.. డొంక కదిలించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రధాన నిందితుడిని ఒడిశాకు చెందిన దేబేంద్ర జోడియాగా గుర్తించిన పోలీసులు.. అతని కోసం గాలిస్తున్నారు. ఇదే మైనర్‌తో విశాఖలోనూ హ్యాష్ ఆయిల్ సప్లయ్ చేయించినట్లు తేలిందన్నారు. ఇంకా ఎంతమంది మైనర్లు ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొంటున్నారనేదానిపైనా ఫోకస్ పెడతామన్నారు సీపీ సుధీర్‌బాబు.
