AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Congress: కాంగ్రెస్ వ్యూహం.. తెలంగాణలో పూర్వ వైభవం కోసం డీకే శివకుమార్ సేవలు..!

ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీజేపీ బలంపుంచుకోవడంతో కాంగ్రెస్ శ్రేణులు మరింత ఢీలాపడుతున్నారు. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం.. తెలంగాణలోని ఆ పార్టీ శ్రేణులకు కొత్త జోష్ ఇస్తోంది. కర్ణాటక తరహాలోనే తెలంగాణలోనూ అధికార పగ్గాలు హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు.

Telangana Congress: కాంగ్రెస్ వ్యూహం.. తెలంగాణలో పూర్వ వైభవం కోసం డీకే శివకుమార్ సేవలు..!
KPCC Chief DK Shivakumar
Follow us
Janardhan Veluru

|

Updated on: May 17, 2023 | 11:34 AM

Telangana Elections 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల విజయాన్ని ఆశ్వాదిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం.. ఇక తెలంగాణపై దృష్టిసారించనుంది. మరికొన్ని మాసాల్లోనే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా చెప్పుకుంటున్న కాంగ్రెస్.. గత రెండు పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెవిచూసింది. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీజేపీ బలంపుంచుకోవడంతో కాంగ్రెస్ శ్రేణులు మరింత ఢీలాపడుతున్నారు. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం.. తెలంగాణలోని ఆ పార్టీ శ్రేణులకు కొత్త జోష్ ఇస్తోంది. కర్ణాటక తరహాలోనే తెలంగాణలోనూ అధికార పగ్గాలు హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. దీనికి సంబంధించిన వ్యూహాలకు కాంగ్రెస్ పెద్దలు పదునుపెడుతున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయంలో ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించారు. తెలంగాణలోనూ కాంగ్రెస్‌కు పూర్వ వైభవం సాధించే లక్ష్యంతో డీకే శివకుమార్‌కు కీలక బాధ్యతలు అప్పగించే యోచనలో పార్టీ హైకమాండ్ ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సిద్ధరామయ్యకు సీఎం పగ్గాలు అప్పగించి.. డీకే శివకుమార్‌ సేవలను తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించుకోవాలని కాంగ్రెస్ పెద్దలు యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

గత కొన్నేళ్లుగా తెలంగాణలో సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతోంది. అదే సమయంలో బీజేపీ బలం పుంజుకుంటోంది. అయితే తెలంగాణలోని పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపి, పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలంటే డీకే శివకుమార్ వంటి నాయకుడి సేవలు ప్రస్తుతం ఇక్కడ పార్టీ అవసరమని తెలంగాణ కాంగ్రెస్ నేతలు కొందరు అభిప్రాయపడుతున్నారు. డీకే శివకుమార్‌కు కీలక బాధ్యతలు అప్పగిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్, బీజేపీలకు కాంగ్రెస్ ధీటైన పోటీ ఇచ్చే అవకాశముందని ధీమా వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండుసార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓటమి చెవిచూసింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది తామేనని చెప్పుకుంటున్నా.. అధికారం మాత్రం కాంగ్రెస్ పార్టీకి అందని ద్రాక్షగానే ఉంది. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, పలువురు పార్టీ నేతలు బీఆర్ఎస్‌కు జంప్ కావడం వంటి అంశాలు దీనికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. అయితే కర్ణాటక పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య సఖ్యత తీసుకురావడంలో డీకే శివకుమార్ సక్సెస్ సాధించారు. అలాగే దశాబ్ధాలుగా కాంగ్రెస్‌కు దూరంగా ఉన్న కులాలు, సామాజిక వర్గాలను తమ వైపునకు తిప్పుకోవడంలో ఆయన విజయవంతమయ్యారు. ఆ వ్యూహాలు తెలంగాణలోనూ అక్కరకు వస్తాయని కాంగ్రెస్ నేతలు కొందరు ధీమా వ్యక్తంచేస్తున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో డీకే శివకుమార్‌కు కీలక పార్టీ బాధ్యతలు అప్పగించే విషయంలో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో బీజేపీని ధీటుగా ఎదుర్కోవడంలో శివకుమార్ సక్సెస్ అయ్యారు. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీని ఎదుర్కోవడంతో పాటు హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన బీఆర్ఎస్‌ను అడ్డుకోవాలంటే డీకే లాంటి సమర్థవంతమైన నాయకుడి సేవలు అవసరమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా..

కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వ అవినీతిని తమ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్లింది. అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటు జేడీఎస్ కారణంగా చీలకుండా కాంగ్రెస్ చేసిన ప్రచార వ్యూహాలు సానుకూల ఫలితాలు ఇచ్చాయి. ఈ వ్యూహాలు తెలంగాణ కాంగ్రెస్‌కు కూడా అవసరమని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అలాగే బీఆర్ఎస్ – బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమ వైపునకు తిప్పుకునేందుకు డీకే శివకుమార్ సాయపడగలరని చెబుతున్నారు.