TS Assembly: కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం.. బుధవారం సభ హైలెట్స్ ఇవే

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని మండిపడింది..రాష్ట్ర అసెంబ్లీ. బడ్జెట్‌లో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని డిమాండ్‌ చేస్తూ.. కేంద్రానికి ఏకగ్రీవ తీర్మానాన్ని పంపింది. మరోవైపు అసెంబ్లీ ఈరోజు ఆర్టీసీ, విద్యుత్‌ సహా పలు అంశాలపై హీట్‌ డిస్కషన్‌ నడిచింది. ప్రభుత్వం, ప్రతిపక్ష నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో సభలో వాతావరణం వేడెక్కింది.

TS Assembly: కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం.. బుధవారం సభ హైలెట్స్ ఇవే
Ktr Vs Revanth Reddy
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 24, 2024 | 8:07 PM

కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణకు జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో తీర్మానం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సభలో తీర్మానం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. తెలంగాణకు నిధులు కేటాయిస్తూ కేంద్రం రీబడ్జెట్‌ ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణకు జరిగిన అన్యాయానికి నిరసనగా అవసరమైతే ఢిల్లీలో దీక్ష చేస్తామని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.

ఇక కేంద్ర బడ్జెట్‌ తెలంగాణను తీవ్రంగా నిరాశపరిచిందన్నారు..ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ప్రధానిని ఎన్నో అడిగామని..కానీ ఒక్కటి కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షానికి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని మండిపడ్డారు. బడ్జెట్‌పై నిరాశతోనే ఇవాళ చర్చ పెట్టామన్నారు. తమ ప్రతిపాదనలను కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదన్న భట్టి.. తెలంగాణ దేశంలో భాగం కాదా అని ప్రశ్నించారు. ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరించిందన్నారు.

కేంద్ర బడ్జెట్‌లో జరిగిన అన్యాయంపై తెలంగాణ అసెంబ్లీలో ఈ ఉదయం వాడీవేడీ చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ మధ్య మాటల యుద్ధం జరిగింది. అవగాహనా రాహిత్యంతో కేటీఆర్‌ సభను తప్పుదోవ పట్టిస్తున్నారన్న రేవంత్‌.. కీలకమైన చర్చ జరుగుతున్నప్పుడు కేసీఆర్‌ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. దీంతో ” మాకు జవాబు చెప్పండి చాలు..మీకు కేసీఆర్‌ అవసరం లేదు’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించడంతో సీఎం రేవంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. మరోవైపు ఆధారం లేకుండా ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు..ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.

గత ప్రభుత్వ హయాంలో పంచాయతీలుగా మారిన తండాలకు రోడ్డు మార్గం లేదన్నారు..సీఎం రేవంత్‌రెడ్డి. అన్ని తండాలకు మండల కేంద్రం నుంచి బీటీ రోడ్లు వేస్తామని అలాగే విద్యుత్ సౌకర్యం కూడా కల్పిస్తామని స్పష్టం చేశారు.ఏడు లక్షల ఇళ్లకు గత ప్రభుత్వం తాగునీరు ఇవ్వలేదని చెప్పారు. ఎన్నికల్లో ప్రజలు శిక్షించినా బీఆర్‌ఎస్‌ నేతలు మాత్రం మారలేదని మండిపడ్డారు. మరోవైపు తెలంగాణ బీజేపీ నేతలపై అసెంబ్లీ సాక్షిగా మంత్రి పొన్నం ప్రభాకర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు డీఎన్ఏ టెస్టు చేయించుకోవాలని విమర్శించారు. బీజేపీ వాళ్లకు పౌరుషం లేదా.. బానిసలుగా ఉన్నారా అని మండిపడ్డారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఏర్పాటును మోదీ అవమానించారని, తల్లిని చంపి బిడ్డను తీసుకెళ్లారని కామెంట్ చేశారని మంత్రి పొన్నం గుర్తుచేశారు.

ఆర్టీసీ అంశంపై తెలంగాణ అసెంబ్లీలో హాట్ హాట్‌ డిస్కషన్ జరిగింది. కార్మికుల యూనియన్ పునరుద్ధరణ, పీఆర్సీ బకాయిలు, ఆర్టీసీలో ఖాళీలపై మాజీ మంత్రి హరీష్‌రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయితే దీనిపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతుండగా బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం చెప్పారు. దీంతో స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. కార్మికుల కోసం పోరాడే కమ్యూనిస్టులకు మైక్ ఇస్తే తప్పేంటి? అని ప్రశ్నించారు. ఆర్టీసీని అన్ని విధాలుగా ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులు 50 రోజులు సమ్మె చేసినప్పుడు బీఆర్ఎస్ నేతలకు సోయి లేదా? అని ప్రశ్నించారు ముఖ్యమంత్రి.ఎన్నికల ముందు ఆదరబాదరగా ప్రభుత్వంలో విలీనం చేశారని మండిపడ్డారు.

తెలంగాణలో స్కూల్‌, కళాశాల బస్సుల ప్రమాదం జరగకుండా తీసుకుంటున్న చర్యలపై వివరించారు..మంత్రి పొన్నం ప్రభాకర్‌. రాష్ట్రంలో పాఠశాలలకు సంబంధించి దాదాపు 24 వేల బస్సులు ఉన్నాయని..పాఠశాలల ప్రారంభానికి నెల ముందు నుంచే ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఇచ్చామని చెప్పారు. బస్సులను తనిఖీ చేయడంతో పాటు డ్రైవర్లు, అదనపు డ్రైవర్లు, అటెండర్లకు కౌన్సిలింగ్‌ ఇచ్చాకే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఇస్తున్నామన్నారు. ఇక పదేళ్ల తర్వాత అసెంబ్లీలో ప్రజాస్వామ్యం కనిపిస్తుందన్నారు మంత్రి సీతక్క. బీఆర్ఎస్ హయాంలో అసెంబ్లీలో నిరసన చేస్తే సస్పెండ్ చేశావారని..కానీ తాము మాత్రం అలా చేయడం లేదన్నారు. అధికారం పోయాక బీఆర్ఎస్‌కు నిరుద్యోగులు గుర్తుకు వచ్చి ఆందోళన చేయడం హస్యస్పదంగా ఉందన్నారు.

జూలై 31 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క రేపు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. గత డిసెంబరులో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫిబ్రవరిలో తాత్కాలిక బడ్జెట్‌ను అసెంబ్లీ ఆమోదించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంతో.. తెలంగాణ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..