Telangana: ప్రమాదాలకు కేరాఫ్‌గా మారిన ప్రాజెక్టు.. ఆందోళన కలిగిస్తున్న గణాంకాలు
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో వరుస ప్రమాదాలు వణుకు పుట్టిస్తున్నాయి. స్నానాలకు వెళ్లి చనిపోతున్న వారి సంఖ్య యేటా పెరుగుతున్నా.. అధికారులు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు.. స్నానాలకు వెళ్లి యేటా ఎంతో మంది గల్లంతవుతున్నారు.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో వరుస ప్రమాదాలు వణుకు పుట్టిస్తున్నాయి. స్నానాలకు వెళ్లి చనిపోతున్న వారి సంఖ్య యేటా పెరుగుతున్నా.. అధికారులు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రమాదాలకు కేరాఫ్‌గా మారింది. శివరాత్రి పర్వదినం సందర్భంగా లక్ష్మి కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్ద స్నానానికి దిగి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. గేట్ దగ్గర ఎలాంటి రక్షణ లేకపోవడంతో.. ఒకరిని కాపాడబోయి మరొకరు నీట మునిగి, తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. అయితే లక్ష్మి కాలువ హెడ్ రెగ్యులేటర్ గేట్లను విద్యుద్దీకరించినప్పటికి, ట్రాన్స్‌ఫార్మర్ చెడిపోవడంతో విద్యుత్ విధానం పని చేయలేదు. దీంతో గేట్లను దింపేందుకు అధికారులు ఎంతో శ్రమించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు.. స్నానాలకు వెళ్లి యేటా ఎంతో మంది గల్లంతవుతున్నారు. 2003లో ఇద్దరు, 2007లో ముగ్గురు, 2021లో ఆరుగురు, 2022లో ఇద్దరు, 2023లో ముగ్గురు… ఇప్పుడు మరో ముగ్గురు స్నానాలకు వెళ్లి చనిపోయారు. అయితే ప్రాజెక్టులో అక్రమ మట్టి, ఇసుక తవ్వకాల వలన భారీ గుంతలు ఏర్పడటం ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది. దైవదర్శనం నిమిత్తం గంగ స్నానాలకు వచ్చే భక్తులకు ఎక్కడ గుంతలు ఉన్నాయో, ఎక్కడ స్నానాలు చేయచ్చో తెలియక నీళల్లోకి దిగి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటు ఇరిగేషన్ అధికారులు కానీ, అటు దేవాదాయ శాఖ అధికారులు కానీ ఎక్కడ స్నానాలు చేయాలో చెప్పకపోవడం, పండుగ రోజుల్లో ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
మొత్తంగా బాధిత కుటుంబాలు అధికార యంత్రాంగంపై మండిపడుతున్నాయి. ఇప్పటికైనా స్పందించి స్నానాలకు ప్రత్యేక ఘాట్‌లను ఏర్పాటు చేయాలని అలాగే పండుగ రోజుల్లో ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…




