Watch Video: నాడు జలకళ.. నేడు వెలవెల.. ఏడారిని తలపిస్తున్న రిజర్వాయర్ అదే..
ఉమ్మడి మెదక్ జిల్లాలో భూగర్భజలాలు, సాగునీరు లేక రైతులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాడు జలకళతో కళకళాడిన రిజర్వాయర్లు, నేడు పూర్తిగా అడుగంటి పోతున్నాయి. ఇక మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లకు నీటిని ఎత్తిపోసే రంగనాయక సాగర్ రిజర్వాయర్‌లో నీటి ఎద్దడి నెలకొంది. రంగనాయక సాగర్ జలాశయం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా సిద్ధిపేట జిల్లా, చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్ గ్రామాల సమీపంలో నిర్మించారు. ఇది 2,300 ఎకరాల్లో రూ. 3,300 కోట్ల వ్యయంతో 3 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో భూగర్భజలాలు, సాగునీరు లేక రైతులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాడు జలకళతో కళకళాడిన రిజర్వాయర్లు, నేడు పూర్తిగా అడుగంటి పోతున్నాయి. ఇక మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లకు నీటిని ఎత్తిపోసే రంగనాయక సాగర్ రిజర్వాయర్‌లో నీటి ఎద్దడి నెలకొంది. రంగనాయక సాగర్ జలాశయం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా సిద్ధిపేట జిల్లా, చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్ గ్రామాల సమీపంలో నిర్మించారు. ఇది 2,300 ఎకరాల్లో రూ. 3,300 కోట్ల వ్యయంతో 3 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. ఈ జలాశయం సిద్ధిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని 1,14,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తుంది. 2020, ఏప్రిల్ 24న మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, తన్నీరు హరీశ్ రావు చేతులమీదుగా ఈ జలాశయం ప్రారంభించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇది 7వ లిఫ్టుకు చెందింది. శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి ఆరోదశ ఎత్తిపోతతో, అన్నపూర్ణ జలాశయానికి చేరుకున్న గోదావరిజలాలు, రంగనాయకసాగర్ పంప్‌హౌజ్ ప్రారంభంతో రంగనాయకసాగర్ జలాశయంలోకి చేరుతాయి.
కాగా ఇప్పుడు ఈ రంగనాయక సాగర్ పూర్తిగా అడుగంటి పోయింది. గత సంవత్సరం ఇదే సమయంలో నిండు కుండల ఉన్న ఈ రిజర్వాయర్ ప్రస్తుతం పూర్తిగా నీరు లేక ఎడారిని తలపిస్తోంది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో నిర్మించిన మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్లలోకి నీరు వెళ్ళాలి అంటే ఈ రంగనాయక సాగర్ నుండే వెళ్లాలి. ఇది మూడు టీఎంసీలతో నిండుగా ఉన్నప్పుడే ఇందులో నుండి నీటిని మల్లన్నసాగర్‌లోకి వెళ్తాయి. అక్కడి నుండి కొండపోచమ్మ సాగర్‌లోకి వస్తాయి. ఇప్పుడు రంగనాయక సాగర్‌లో సరైన నీరు లేకపోవడంతో, అటు మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్‌లో కూడా నీరు వెళ్లడం లేదు. మరో వైపు రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా నీటిలో మునిగిపోయిన అవశేషాలు అన్ని బయటకు వచ్చాయి. గతంలో రైతులు తమ బావుల వద్ద నిర్మించుకున్న సంపులు, సిద్దిపేట నుండి చంద్లా పూర్ గ్రామానికి వెళ్లే రోడ్డు.. ఇలా అన్ని బయటకు కనిపిస్తున్నాయి. మరోవైపు ఈ రంగనాయక సాగర్ పూర్తిగా ఎండిపోవడంతో ఆయకట్టు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గతంలో ఈ రిజర్వాయర్ కుడి, ఎడమ కాలువ ద్వారా వచ్చే నీటి ద్వారా వ్యవసాయం చేసుకునే వాళ్ళం అని చెబుతున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..