Watch Video: మస్కట్‌లో సిరిసిల్ల యువకుడి నరకయాతన.. కాపాడాలంటూ వేడుకోలు! వీడియో
Telangana resident Face Struggle In Muscat: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగ్గళ్ళపల్లి మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన సతీష్ అనే యువకుడు మస్కట్లో అష్టకష్టాలు పడుతున్నాడు. కుటుంబ పరిస్థితులు సరిగాలేక ఉపాధి ఆశతో విదేశాలకు వెళ్తే.. అక్కడ పీకల్లోతు సమస్యల్లో చిక్కుకున్నాడు. ‘మంచి జాబ్ ఉంది, జీవితమే మారిపోతుంది’ అని ఆశలు చూపిన గల్ఫ్ ఏజెంట్ మాటలు నమ్మి..

సిరిసిల్ల, అక్టోబర్ 26: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగ్గళ్ళపల్లి మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన సతీష్ అనే యువకుడు మస్కట్లో అష్టకష్టాలు పడుతున్నాడు. కుటుంబ పరిస్థితులు సరిగాలేక ఉపాధి ఆశతో విదేశాలకు వెళ్తే.. అక్కడ పీకల్లోతు సమస్యల్లో చిక్కుకున్నాడు. ‘మంచి జాబ్ ఉంది, జీవితమే మారిపోతుంది’ అని ఆశలు చూపిన గల్ఫ్ ఏజెంట్ మాటలు నమ్మి, మస్కట్ వెళ్లిన సతీష్ ఎదుర్కొన్నది మాత్రం చేదు అనుభవం. అక్కడ ఉద్యోగం దొరక్కపోగా.. సౌకర్యాలు లేని చోట ఒంటరిగా, దయనీయ పరిస్థితుల్లో బతుకుతున్నాడు.
తినడానికి సరైన ఆహారంలేక, రోజులు గడవడం కూడా కష్టంగా మారింది. తన పరిస్థితిని ఎవరికీ చెప్పుకోవాలా..? అని ఆవేదనతో కన్నీరు పెట్టుకున్న సతీష్ చివరకు తన బాధను సెల్ఫీ వీడియో రూపంలో బయటపెట్టాడు. ఈ వీడియోలో సతీష్ తన గోడునంత వెల్లగక్కాడు. నన్ను భారత్‌కు తీసుకెళ్లండి. ‘మా అమ్మా నాన్న దగ్గరికి వెళ్లాలనుంది‘ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సతీష్ ఆవేదన విన్న వారందరూ కదిలిపోయారు. సతీష్ తల్లిదండ్రులు కొడుకుతో ఎప్పుడు ఫోన్‌లో మాట్లాడినా ఊరికిగి మళ్లీ తిరిగి వస్తానంటున్నాడని, కానీ ఇప్పుడు ఆ మాటలు కూడా ఆశగా మిగిలిపోయాయని చెబుతున్నారు. ఏజెంట్ మమ్మల్ని మోసం చేశాడు. మా కొడుకును ఇంటికి రప్పించండి అంటూ వారు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
ఇది సతీష్ ఒక్కడి పరిస్థితి మాత్రమే కాదు.. వేలాది యువకుల బాధ. ఉద్యోగం పేరుతో విదేశాలకు వెళ్తున్న నిరుద్యోగ యువతులు, గల్ఫ్ ఏజెంట్ల మాటలకు మోసపోయి ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో చిక్కుకుంటున్నారు. సతీష్ లాంటి నిరుపేద కుటుంబాల ఆశలు ఇలా కూలిపోవడం విచారించదగ్గ విషయం. ప్రస్తుతం సతీష్ వీడియో సొంత గ్రామంలో విషాదం నింపాయి. ఓ వైపు చేసిన అప్పులు తీర్చలెమన్నా బాధ.. మరో వైపు కొడుకు వస్తాడో రాడోనన్న ఆవేదన వృద్ధ తల్లిదండ్రులను కలచి వేస్తుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.








