Khammam: మీరు కూడా షాప్స్ ముందు ఇలా QR కోడ్స్ పెడుతున్నారా..? వెంటనే ఈ విషయం తెలుసుకోండి
ఖమ్మంలో కొత్త తరహా సైబర్ మోసం వెలుగుచూసింది. ఓ సూపర్‌మార్కెట్ యజమానికి క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా వచ్చే డబ్బులు తన ఖాతాలోకి రావడం లేదని అనుమానం కలిగింది. దీంతో సీసీ కెమెరాలో చూసిన తర్వాత నిజం వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా....

మారుతున్న కాలానికి అనుగుణంగా సైబర్ నేరగాళ్లు కూడా తమ ట్రిక్స్ అప్‌డేట్ చేసుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో ఓ సూపర్‌మార్కెట్ యజమానిని ఇలాంటి కొత్త తరహా మోసానికి గురి చేశారు. తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం గ్రామానికి చెందిన వెంకన్న ఓ సూపర్‌మార్కెట్ నడుపుతున్నాడు. కస్టమర్లు డిజిటల్ చెల్లింపులు చేయడానికి షాపు ముందు క్యూఆర్ కోడ్ స్కానర్ ఏర్పాటు చేశాడు. ఈనెల 7న గుర్తు తెలియని వ్యక్తి వచ్చి వెంకన్న అకౌంట్‌కు సంబంధించిన అసలైన క్యూఆర్ కోడ్ స్టిక్కర్‌ను తీసేసి.. తను తీసుకొచ్చిన క్యూఆర్ కోడ్‌ను అంటించి వెళ్లిపోయాడు.
దాంతో అప్పటి నుంచి షాపులో కొనుగోలు చేసిన కస్టమర్లు స్కాన్ చేసినప్పటికీ, మొత్తం నగదు ఆ దొంగల ఖాతాకే వెళ్తోంది. అనుమానం వచ్చిన వెంకన్న సీసీ కెమెరా ఫుటేజ్ తనిఖీ చేయగా షాకయ్యాడు. ఓ వ్యక్తి క్యూఆర్ స్టిక్కర్ మార్చి పెట్టడం స్పష్టంగా రికార్డ్ అయింది. తీరా డబ్బులు వెళ్తున్న ఖాతా ఓ మహిళ పేరుతో ఉందని గమనించిన వెంకన్న వెంటనే తిరుమలాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ప్రజలు ఇలాంటి సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తిరుమలాయపాలెం ఎస్సై జగదీష్ హెచ్చరించారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే ముందు దానిని పరిశీలించుకోవడం ద్వారా ఇలాంటి మోసాల నుండి తప్పించుకోవచ్చని సూచించారు.
వీడియో దిగువన చూడండి….
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




