Telangana: ఆ రోడ్డులో వెళ్లారంటే యముడికి షేక్ హ్యాండ్ ఇచ్చినట్టే.. ఆ దారులు నేరుగా నరకానికే
ఈ రోడ్డు సరాసరి నరకానికే దారి. ఏదులాపూర్ చౌరస్తా నుంచి వెల్దుర్తి వరకు వెళ్లేవారికి కీలకమైన ఈ రోడ్డులో ప్రయాణం చేయాలంటేనే జనాలు వణికిపోతున్నారు. ఆ రోడ్డులో వెళ్తే యముడికి షేక్ హ్యాండ్ ఇచ్చినట్టే. మరి ఆ రోడ్డు వివరాలు ఇలా ఉన్నాయి..

ఆ రోడ్డుపై ప్రయాణం అంటేనే వణికిపోతున్నారు ప్రయాణీకులు. ఒకవేళ రోడ్డుపైకి వచ్చినా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి. ఈ రోడ్డుపై జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని చేపట్టిన, కొత్త రోడ్డు నిర్మాణ పనులు నత్తనడకన సాగడంతో ప్రయాణికులు కష్టాలు అన్ని ఇన్ని కావు. ఈ రోడ్డు మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోనిది. ఏదులాపూర్ చౌరస్తా నుంచి వెల్దుర్తి వరకు వెళ్లేవారికి ఈ రోడ్డే కీలకం. కానీ ఇప్పుడు ఈ రోడ్డు యాక్సిడెంట్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. చాలా రోజులుగా ఈ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతూనే ఉన్నా.. పూర్తి మాత్రం కావడం లేదు.
గతంలో వెల్దుర్తి నుంచి బాలనగర్ వరకు RTC బస్సు నడిచేది అని, ఈ రహదారి పూర్తిగా దెబ్బతినడంతో బస్సు రద్దు కావడం వల్ల ఆయా గ్రామాల నుంచి కూరగాయలు, పాలు.. నర్సాపూర్, తూప్రాన్, హైదరాబాద్ తీసుకెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ ఎనిమిది కిలోమీటర్ల రహదారి నిర్మాణంతో పాటు, చండి నుంచి అనంతారం వరకు 10 కిలోమీటర్ల రహదారి కలిపి మొత్తం 18 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికై సంవత్సరం క్రితమే 38 కోట్లు ప్రభుత్వం సాంక్షన్ చేసింది. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ ఏదులాపూర్ నుంచి పోతులగుడా వరకు రోడ్డు నిర్మాణం పనులు చేపట్టాడు. కానీ 8 నెలలు గడుస్తున్నా రహదారి నిర్మాణం పనులు నత్తనడకగా సాగడంతో స్థానికులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోడ్డు నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలోనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎక్కడా సూచిక బోర్డ్‌లు లేకపోవడం, రోడ్డుపై ముందు వాహనాలు వెళ్తుంటే వెనుక పెద్ద ఎత్తున దుమ్ములేవడంతో, వెనుక వచ్చే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడమే కాదు.. ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. వీటికి తోడు ఎదులపూర్ చౌరస్తా వద్ద రోడ్డు పక్కనే కల్లు డిపో ఉంది. ఇక్కడికి రాగానే అక్కడ కల్లు తాగి వాహనాలు నడపడం వల్ల కూడా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
అందుకే ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటేనే వణికిపోతున్నారు ప్రయాణికులు. ఇక గడిచిన ఆరు నెలల్లో ఈ రోడ్డుపై ఎన్నో ప్రమాదాలు జరిగాయి. ముఖ్యంగా కొన్ని రోజుల క్రితమే ఈ రోడ్డు పక్కన ఉన్న చెరువులో కారు బోల్తా పడి అందులో ఉన్న, ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు చనిపోయారు. ఇది చాలా ఘోరమైన ప్రమాదం. ఇక ఇదే రోడ్డుపై పాంబండ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై నుంచి పడి మృతి చెందారు. అలాగే వెల్దుర్తికి చెందిన ఓ డాక్టర్ కుటుంబం ప్రయాణిస్తున్న కారు సైతం అదుపుతప్పి వరిపొలాల్లోకి దూసుకెళ్లడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదాలు జరిగిన సమయంలో కనీసం అక్కడ సూచిక బోర్డు కూడా లేదని, ప్రమాదం జరిగిన అనంతరం తూతుమంత్రంగా అక్కడా, ఇక్కడా చిన్నగా సూచిక బోర్డు ఏర్పాటు చేశారు అధికారులు. ఈ రోడ్డుపై వరుస ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు అసలు పట్టించుకోవడం లేదంటున్నారు స్థానికులు. రోడ్డు నిర్మాణం పనులు వేగంగా జరగడంలేదని ప్రాణం అరిచేతిలో పెట్టుకుని, బిక్కుబిక్కుమంటూ ప్రయాణం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆయా గ్రామాల ప్రజలు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి