తెలంగాణ ప్రజలకు పండుగలాంటి వార్త.. ఆ రోజున పథకాల జాతర.. ఇవిగో పూర్తి వివరాలు
ఈనెల 26 నుంచి తెలంగాణలో రెండో విడత సంక్షేమ పథకాల జాతర షురూ కాబోతోంది. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా.. మొత్తం నాలుగు పథకాలు అమల్లోకి రాబోతున్నాయ్. ఇందుకోసం లబ్దిదారుల ఎంపికను యుద్ధప్రాతిపదికన మొదలుపెట్టింది ప్రభుత్వం. క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన జరిపి... గ్రామ సభల్లో చర్చించి.. ఆ తర్వాతే అర్హులైన లబ్ధిదారుల జాబితాను రూపొందించాలన్నది ప్రణాళిక.
ఈనెల 26 నుంచి తెలంగాణలో రెండో విడత సంక్షేమ పథకాల జాతర షురూ కాబోతోంది. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా.. మొత్తం నాలుగు పథకాలు అమల్లోకి రాబోతున్నాయ్. ఇందుకోసం లబ్దిదారుల ఎంపికను యుద్ధప్రాతిపదికన మొదలుపెట్టింది ప్రభుత్వం. క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన జరిపి… గ్రామ సభల్లో చర్చించి.. ఆ తర్వాతే అర్హులైన లబ్ధిదారుల జాబితాను రూపొందించాలన్నది ప్రణాళిక. అమలు కార్యాచరణ కోసం జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు చీఫ్ సెక్రటరీ శాంతికుమారి. ఎటువంటి అపోహలకు తావు లేకుండా లబ్దిదారుల ఎంపిక జరగాలని, నిజమైన అర్హులకే లబ్ది దక్కేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా రైతు భరోసా అమలు దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది రేవంత్ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో అసలైన రైతుల కంటే నకిలీ రైతుల జేబుల్లోకే ఎక్కువగా రైతుబంధు నిధులు వెళ్లాయని భావించిన సర్కార్.. తమ హయాంలో ఇటువంటి లూప్‌హోల్స్ లేకుండా అమలు చేయాలని డిసైడైంది.
ముఖ్యంగా రైతుభరోసా పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రేవంత్ ప్రభుత్వం. సాగులో ఉన్న భూమి కోసం ఏటా 12వేలు పెట్టుబడి సాయంగా అందజేయాలన్నది ప్రభుత్వ సంకల్పం నుంది. అధికారంలోకి వస్తే ఎకరాకు ఏడున్నర వెయ్యి చొప్పున రెండు పంటలకూ కలిపి 15 వేలు జమ చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి దీన్ని 12వేలకు కుదించింది రేవంత్ సర్కార్. భూభారతి పోర్టల్ నుంచి పట్టదారు పాస్ పుస్తకాలున్న రైతుల వివరాలను మండల వ్యవసాయ అధికారులకుఅందజేసింది ప్రభుత్వం. ఈ డేటా ఆధారంగా రెవెన్యూ అధికారితో కూడిన ప్రత్యేక బృందాలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. వ్యవసాయ యోగ్యం కాని భూములు ఎక్కడ..? గ్రామాల్లో ఇళ్లు, కాలనీలుగా మారిన భూములేంటి? రియల్ ఎస్టేట్ వెంచర్లు, రోడ్లుగా మారిన భూములు, పరిశ్రమలకు, గోదాములకు, మైనింగ్‌కు వినియోగిస్తున్న భూములు.. ఇలా క్షేత్రస్థాయిలో పర్యటించి, ప్రతీ సర్వేనెంబర్‌ను పరిశీలించి… వ్యవసాయయోగ్యం కాని ప్రతీ సెంటునూ లెక్క తేల్చడమే టార్గెట్. రాళ్లు-రప్పలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, నివాస స్థలాలకు రైతు భరోసా ఇచ్చి ప్రజాధనాన్ని వృధా చేయకుండా ఈ సర్వే దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అధికారుల సర్వేకు రైతులనుంచి కూడా మద్దతు లభిస్తోంది.
గ్రామాల్లో ఒక్కో సర్వే నెంబర్‌ను డిజిటల్ మ్యాప్స్, జిపిఎస్ ద్వారా పరిశీలిస్తారు. 19వ తేదీ వరకు ఐదు రోజుల పాటు సర్వే చేసిన తర్వాత.. సేకరించిన వివరాలను గ్రామ సభలో చదివి వినిపిస్తారు. 24వ తేదీ వరకు అభ్యంతరాల్ని స్వీకరించి.. చర్చిస్తారు. 25వ తేదీ నాటికి తుదిజాబితాను జిల్లా కలెక్టర్లు నిర్ధారించి ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేస్తారు. ఇన్‌చార్జ్ మంత్రులతో ఆమోదం తీసుకుంటారు. 26 నుంచి అర్హులైన రైతులకు రైతు భరోసా అమలు చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 68 లక్షల 99 వేల మంది రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలున్నాయి. ధరణి రికార్డుల ప్రకారం మొత్తం భూమి 1.52 కోట్ల ఎకరాలు. ఇందులో సాగు చేయని భూములు తీసేస్తే కోటి 30 లక్షల ఎకరాలు మాత్రమే మిగులుతాయని, వీటికి మాత్రమే రైతు భరోసా అందుతుందని ప్రాధమిక అంచనా వేసింది ప్రభుత్వం. ఇందుకోసం 7 వేల 625 కోట్లు అవసరమౌతుంది. తహసిల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, వ్యవసాయ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల సిబ్బంది.. అందరూ ఈ నాలుగురోజుల పాటు ఉరుకులు పరుగుల మీద సర్వే చేస్తారు. ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్దిదారుల ఎంపిక చేసి డేటా సిద్ధం చేస్తారు.