Chandrababu: హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఫ్యామిలీలే ధ్యేయం: సీఎం చంద్రబాబు పక్కా ప్లానింగ్
కుటుంబం వృద్ధి చెందితేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. అందుకే.. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఫ్యామిలీలే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సంపద సృష్టిలో ఆల్‌టైమ్ రికార్డులు క్రియేట్ చేస్తామని, జీఎస్‌డీపీ వృద్ధి రేటును ఉరకలెత్తిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకోసం పక్కా ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నాం.. అన్నారు. నేనొస్తే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు నమ్మారు.. ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకోను అని ప్రామిస్ చేశారు స్వర్ణాంధ్ర స్వాప్నికుడు చంద్రబాబు.
90వ దశకంలోనే ఆర్థిక, ఐటీ సంస్కరణల్ని అందిపుచ్చుకున్నాం.. వాటి ఫలాలు ఇప్పుడు ఆస్వాదిస్తున్నాం.. ఇప్పుడు మలి దశ సంస్కరణలకు టైమొచ్చింది అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. విద్యుత్, ఓపెన్ స్కై పాలసి, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులు.. ఇలా అనేక రంగాల్లో మౌలిక సదుపాయాలకు శ్రీకారం చుట్టామన్నారు. కుటుంబ వ్యవస్థ బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుందన్నదే తమ ప్రభుత్వ మూల సిద్ధాంతం అన్నారు. రాష్ట్ర వృద్ధిరేటు. ఆదాయార్జన అంశాలపై సమీక్షించాక సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు.
విజన్ 2047ని, అందులో పేర్కొన్న పీ4 విధానాన్ని గుర్తు చేశారు. గతంలో సంపద సృష్టికి పి3 ఎలా ఉపయోగపడిందో.. ఇప్పుడు ప్రగతిలో ప్రజల్ని కూడా మమేకం చేసే పీ4 విధానంతో అంతకంటే ఎక్కువ సంపద పుడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్‌కు 16 లక్షల మంది స్పందించారని, జాతీయ విజన్ డాక్యుమెంట్‌కు కూడా అంతటి ఆదరణ రాలేదని, మన విజన్ ఎంత శక్తివంతమైందో ఇక్కడే తెలుస్తోందని చెప్పారు.
రాష్ట్ర జీడీపీ వృద్ధిపై కూడా ప్రజెంటేషన్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర ప్రగతికి కీలకమైంది వృద్ధిరేటు. గడచిన ఐదేళ్లలో వృద్ధి రేటు 10 శాతానికే పరిమితమైంది. మన ఆలోచనలు కార్యరూపం దాలిస్తే ఇప్పుడది 15 శాతానికి చేరుతుంది. అదే జరిగితే GSDP 347 లక్షల కోట్లకు చేరుతుంది.. తద్వారా తలసరి ఆదాయం 58 లక్షల కోట్ల మేర పెరిగే అవకాశం ఉంది.. అన్నారు.
2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2.4 ట్రిలియన్ డాలర్లకు చేర్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఏపీ సర్కార్. సంపద సృష్టి మాత్రమే కాదు.. జనాభాను కూడా సృష్టించాలి.. అంటూ అప్రమత్తం చేశారు సీఎం చంద్రబాబు. జాతీయ జనాభాలో ప్రస్తుతం సౌత్ఇండియా డేంజర్ జోన్‌లో ఉందని, 2031 నుంచి ఆంధ్ర ప్రదేశ్ జనాభా తగ్గుముఖం పట్టే ప్రమాదం ఉందని హెచ్చరించారు. జనాభా తగ్గితే మనం మనం సృష్టించే సంపద ఏం చేసుకోవాలో తెలీదు.. అందుకే ఇంటింటా పిల్లల సందడి పెరగాలి అనేది ముఖ్యమంత్రి ఇచ్చిన ముక్తాయింపు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.