Munugode Bypoll: గతంలో కొడంగల్‌లో కూడా ఇవే కబుర్లు చెప్పిండు.. కేసీఆర్ దత్తత ప్రకటనపై రేవంత్ సెటైర్లు
టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. మునుగోడును దత్తత తీసుకుంటానని ప్రకటించారు. సిరిసిల్లలా మారుస్తానని హామీ ఇచ్చారు. తాజాగా ఈ ప్రకటనపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

మునుగోడు ఉప సమరం హోరాహోరీగా సాగుతోంది. నేతలు ప్రచారంలో దూసుకెళుతున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు నియోజకవర్గ ప్రజలకు గుంపగుత్త హామీలు ఇస్తున్నారు. అదే సమయంలో ప్రత్యర్థి పార్టీ నేతలపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇక నిన్న టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. మునుగోడును దత్తత తీసుకుంటానని ప్రకటించారు. సిరిసిల్లలా మారుస్తానని హామీ ఇచ్చారు. తాజాగా ఈ ప్రకటనపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మునుగోడు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మంత్రి కేటీఆర్‌పై ధ్వజమెత్తారు. ‘నిన్న మునుగోడు వచ్చిన కేటీఆర్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా అని కబుర్లు చెబుతుండు. గతంలో కొడంగల్‌లో నన్ను ఓడించేందుకు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా అని అన్నాడు. ఇప్పటివరకు అక్కడ రోడ్లపై గుంతల్లో తట్టెడు మట్టి కూడా వేయలేదు. మాయగాళ్ల వలలో మునుగోడు ప్రజలు పడొద్దు’
‘ఉప ఎన్నికలు నియోజకవర్గ అభివృద్ధికి రాలేదు. ఒక వ్యక్తి అమ్ముడుపోతే వచ్చాయి. వ్యక్తి ధన దాహనికి కాంగ్రెస్ పార్టీని తాకట్టు పెట్టి చంపేయాలని చూస్తున్నాడు. కన్న తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసి శత్రువు పంచన చేరాడు. బీజేపీ, టీఆర్‌ఎస్ నాయకులు ముఠాలతో, మూటలతో ఓట్లు కొల్లగొట్టాలనుకుంటున్నారు. రాజగోపాల్ రెడ్డి డిండి ప్రాజెక్టు కోసం 5వేల కోట్లు ఇప్పించగలడా? మునుగోడులో కాంగ్రెస్ గెలిస్తే బీజేపీ, టీఆరెస్ లకు బుద్ది చెప్పినట్లవుతుంది’ అని బీజేపీ, టీఆర్‌ఎస్‌లపై ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్. అంతకుముందు నామినేషన్ల దాఖలు చివరి రోజున పాల్వాయి స్రవంతి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా బంగారుగడ్డ గ్రామం నుంచి చండూర్ ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
