HIT First Case 6 Years: ‘హిట్’ సినిమాకు ఆరేళ్లు.. విక్రమ్ రుద్రరాజు ఇన్వెస్టిగేషన్‌కు 6 వసంతాలు!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలకు ఒక కొత్త ఒరవడిని సృష్టించిన ఆ సినిమా విడుదలై నేటికి సరిగ్గా ఆరేళ్లు. అప్పటివరకు ఉన్న రెగ్యులర్ పోలీస్ స్టోరీలకు భిన్నంగా, ఒక ఆఫీసర్ ఎదుర్కొనే మానసిక సంఘర్షణను, ఒక మిస్టరీని ఛేదించే క్రమంలో వచ్చే ఉత్కంఠను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించింది ఆ చిత్రం.

క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు ఇది ఒక ‘కల్ట్ క్లాసిక్’గా నిలిచిపోయింది. అతను ఒక అద్భుతమైన పోలీస్ ఆఫీసర్.. కానీ అతని గతం అతన్ని వెంటాడుతూ ఉంటుంది. మంటలను చూస్తే వచ్చే భయం అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఒక అమ్మాయి అదృశ్యం కావడంతో ఆ కేసును ఛేదించడానికి రంగంలోకి దిగుతాడు. ఎటువంటి క్లూ లేని ఆ కేసును తన తెలివితేటలతో ఎలా పరిష్కరించాడు? హంతకుడిని ఎలా పట్టుకున్నాడు? అనే ఉత్కంఠభరితమైన కథాంశంతో వచ్చి ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెట్టిన ఆ సినిమా మరేదో కాదు.. అదే ‘హిట్’ (Homicide Intervention Team: The First Case).
కొత్తదనానికి నాంది..
ఫిబ్రవరి 28, 2020న విడుదలైన ఈ సినిమా నేటితో 6 ఏళ్లు పూర్తి చేసుకుంది. దర్శకుడు శైలేష్ కొలను ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఘనంగా అడుగుపెట్టారు. ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ జీవితాన్ని ఎంత సహజంగా చూపించవచ్చో ఆయన నిరూపించారు. అనవసరమైన ఫైట్లు, పాటలు లేకుండా కేవలం కథను నమ్ముకుని తీసిన ఈ సినిమా ప్రేక్షకులను అడుగడుగునా ఆశ్చర్యపరిచింది.
విశ్వక్ సేన్ విశ్వరూపం
ఈ సినిమాలో విక్రమ్ రుద్రరాజు పాత్రలో విశ్వక్ సేన్ అద్భుతంగా నటించారు. తన గతంలోని బాధను అనుభవిస్తూనే, కేసును ఛేదించే క్రమంలో ఆయన చూపిన తీవ్రత అమోఘం. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లలో ఆయన నటన సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ సినిమా సాధించిన విజయంతో విశ్వక్ సేన్ కెరీర్ కూడా మలుపు తిరిగింది. వివేక్ సాగర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమా మూడ్‌ను ఎలివేట్ చేయడంలో కీలక పాత్ర పోషించింది.
‘హిట్’ సాధించిన విజయంతో దీనికి సీక్వెల్ గా ‘హిట్ 2’ వచ్చింది. అందులో అడవి శేష్ హీరోగా నటించి సక్సెస్ అందుకున్నారు. నాని హీరోగా వచ్చిన ‘హిట్ 3’ కూడా ప్రేక్షకులను మెప్పించింది. ఇక నాలుగో కేస్‌లో హీరోగా కార్తీ కనిపించనున్నారని తెలుస్తోంది. ఇలా ఒక చిన్న సినిమాగా మొదలై, ఇప్పుడు ఒక పెద్ద ‘హిట్ వర్స్’గా ఎదగడానికి పునాది వేసింది ఈ మొదటి భాగమే. నేచురల్ స్టార్ నాని ప్రొడ్యూసర్‌గా వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించడం విశేషం. సినిమా విడుదలై 6 ఏళ్లు గడిచినా, ఇప్పటికీ ఓటీటీలో ఈ సినిమాను చూస్తున్నప్పుడు ఆ ఉత్కంఠ ఏ మాత్రం తగ్గదు. తెలుగులో వచ్చిన బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల జాబితాలో ‘హిట్’ ఎప్పుడూ ముందుంటుంది.
