రియల్ లైఫ్‌లోనూ సూపర్‌స్టారే..! సినిమాల్లోనే కాదు పిల్లల పెంపకంలో ఆయన స్టైల్ డిఫరెంటే
రజనీకాంత్ కేవలం గొప్ప నటుడు మాత్రమే కాదు, అంతకుమించిన గొప్ప తండ్రి కూడా. తన ఇద్దరు కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్యలను పెంచిన తీరు, వారి కెరీర్ పట్ల ఆయన చూపిన ఉదారత నేటి తరం తల్లిదండ్రులకు ఒక పాఠం అని చెప్పవచ్చు. నటుడిగా ఎంత బిజీగా ఉన్నా కుటుంబాన్ని, పిల్లల భవిష్యత్తును ఆయన బ్యాలెన్స్ చేసిన విధానం అద్భుతం. సూపర్‌స్టార్ నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన ఆ పేరెంటింగ్ పాఠాలేంటో వివరంగా తెలుసుకుందాం.

తమిళ సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్ అంటే కేవలం వెండితెరపై మేజిక్ చేసే నటుడు మాత్రమే కాదు, కోట్ల మందికి ఒక స్ఫూర్తిప్రదాత. శివాజీ రావు గైక్వాడ్‌గా ప్రస్థానం మొదలుపెట్టి, ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో సుమారు 170 సినిమాల్లో నటించి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశారు. ఏడు పదుల వయసు దాటినా నేటి తరం యంగ్ హీరోలకు పోటీనిస్తూ ఆయన వేసే స్టెప్పులు, చూపించే స్టైల్ అభిమానులను మంత్రముగ్ధులను చేస్తాయి.
పిల్లల వ్యక్తిత్వానికి ప్రాధాన్యత
తల్లిదండ్రులు సాధారణంగా పిల్లల జీవితాలను తామే నియంత్రించాలని చూస్తుంటారు. కానీ రజనీకాంత్ తన కుమార్తెలకు నచ్చిన మార్గాన్ని ఎంచుకునే పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. పిల్లలపై తమ ఆలోచనలను బలవంతంగా రుద్దడం కంటే, వారి వ్యక్తిత్వాన్ని గౌరవించడం ముఖ్యమని ఆయన నమ్ముతారు. ఏదైనా విషయంలో సాధకబాధలను వివరించాలే తప్ప నిర్బంధించకూడదని ఆయన ప్రవర్తన నిరూపిస్తుంది. పిల్లలను ఒక వ్యక్తిగా గుర్తించి వారి భావాలను అర్థం చేసుకోవడమే నిజమైన పేరెంటింగ్ అని ఆయన చాటి చెప్పారు.
స్నేహపూర్వక బంధం
నేటి కాలంలో పిల్లలతో తల్లిదండ్రులు ఎంత సాన్నిహిత్యంగా ఉంటే అంత మంచిది. రజనీకాంత్ తన కుమార్తెలతో స్నేహితుడిలా మెలుగుతారు. తల్లిదండ్రులపై నమ్మకం ఏర్పడాలంటే వారితో సరైన కమ్యూనికేషన్ ఉండాలి. స్ట్రిక్ట్‌గా ఉండటం వల్ల పిల్లలు విషయాలను దాచిపెట్టే అవకాశం ఉంది, అదే స్నేహపూర్వకంగా ఉంటే తమ సమస్యలను ధైర్యంగా చెప్పుకోగలరు. ఈ నమ్మకమే పిల్లలకు జీవితంలో ఒక రక్షణ కవచంలా మారుతుందని మానసిక నిపుణులు కూడా చెబుతున్నారు.
కలలకు వెన్నుదన్నుగా..
రజనీకాంత్ కుమార్తెలు ఇద్దరూ చిత్ర పరిశ్రమనే ఎంచుకుని దర్శకులుగా, నిర్మాతలుగా రాణిస్తున్నారు. వారు ఎంచుకున్న రంగంలో రాణించడానికి ఆయన పూర్తి మద్దతునిచ్చారు. పిల్లల కోసం అన్నీ సమకూర్చడం కంటే, వారి ఆశయాలకు అండగా నిలవడమే అసలైన తండ్రి బాధ్యత. కష్ట సమయాల్లో తోడుగా ఉంటే పిల్లలు ఆత్మవిశ్వాసంతో ఏ సవాలునైనా ఎదుర్కోగలరు. నేటి ఆధునిక తల్లిదండ్రులు తమ పిల్లల ఆసక్తులను గమనించి వాటిని ప్రోత్సహించడం చాలా అవసరం.
కుటుంబమే ప్రాధాన్యత
ఎంతటి ఉన్నత స్థితిలో ఉన్నా కుటుంబానికి ఇచ్చే సమయం విషయంలో రాజీ పడకూడదని రజనీకాంత్ నిరూపించారు. ప్రపంచమంతా తనను సూపర్‌స్టార్‌గా కొలుస్తున్నా, ఆయన మాత్రం ఇంటికి వెళ్తే ఒక సాధారణ తండ్రిగానే ఉండటానికి ఇష్టపడతారు. “కుటుంబమే లేకుంటే మనం లేం” అనే సిద్ధాంతాన్ని ఆయన బలంగా నమ్ముతారు. ఉద్యోగ బాధ్యతలతో ఎంత బిజీగా ఉన్నా కుటుంబంతో గడిపే క్వాలిటీ టైమ్ బంధాలను బలపరుస్తుంది. కుటుంబం సంతోషంగా ఉన్నప్పుడే మనిషి బయట కూడా విజయం సాధించగలరని తలైవా జీవితం మనకు నేర్పుతున్న గొప్ప పాఠం.
