వీడుతున్న ముంబై పుచ్చకాయ మరణాల మిస్టరీ
ముంబైలో పుచ్చకాయ తిన్న తర్వాత నలుగురు కుటుంబ సభ్యుల మరణం దేశాన్ని కలచివేసింది. పురుగుమందుల అవశేషాలు కారణమా లేక ఆహార విష ప్రభావమా అని దర్యాప్తు జరుగుతోంది. ఆహార భద్రతా అధికారులు పురుగుమందుల వల్ల మరణాలు అరుదని పేర్కొన్నారు. పాడైన ఆహారం లేదా కలుషిత నీరు కూడా కారణం కావచ్చని అనుమానిస్తున్నారు. ప్రయోగశాల నివేదికల కోసం ఎదురుచూస్తూ, ప్రజలు పండ్లను శుభ్రం చేసి, సురక్షితమైన ఆహార అలవాట్లు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ముంబైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మరణించిన ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. పుచ్చకాయ తిన్న తర్వాతే ఈ విషాదం చోటుచేసుకోవడంతో, ప్రజల్లో ఈ పండుపై భయాందోళనలు మొదలయ్యాయి. ఈ ఘటన వెనుక అసలు కారణమేంటి? పురుగుమందుల అవశేషాలే మరణాలకు దారితీశాయా? దీనిపై ఆహార భద్రతా అధికారులు ఏమంటున్నారు? ముంబైలోని పైధోనీ ప్రాంతంలో అబ్దుల్లా డోకాడియా, ఆయన భార్య నసీమ్, కుమార్తెలు అయేషా , జైనాబ్ ఆదివారం కొన్ని గంటల వ్యవధిలోనే మరణించారు. ఒకే కుటుంబం ఇలా అకస్మాత్తుగా మరణించడంతో పోలీసులు, ఆరోగ్య అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, ఏప్రిల్ 26 ఆదివారం రాత్రి ఆ కుటుంబం పుచ్చకాయను ఆహారంగా తీసుకుంది. ఆ తర్వాత కొద్దిసేపటికే అందరికీ వాంతులు ప్రారంభమయ్యాయి. పరిస్థితి విషమించడంతో అపస్మారక స్థితిలో ఉన్న ఆ నలుగురినీ వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయానికి లోపే నలుగురూ ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు విడిచారు. ఈ కుటుంబం మరణానికి అసలు కారణం పురుగుమందులేనా అన్న అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో ఆహార భద్రతా సంస్థ క్లారిటీ ఇచ్చింది. పుచ్చకాయలపై పిచికారీ చేసే పురుగుమందుల వల్లే ఈ మరణాలు సంభవించాయన్న వార్తలపై మహారాష్ట్ర ఆహార భద్రతా కమిషనర్ శ్రీధర్ దుబే-పాటిల్ స్పష్టత నిచ్చారు. పుచ్చకాయ అనేది ఒక వ్యవసాయ ఉత్పత్తి. అది పంట కోత కోసి మార్కెట్‌కు వచ్చే వరకు ఆహార భద్రతా సంస్థ పరిధిలోకి రాదని ఆయన వివరించారు. సాగు సమయంలో పుచ్చకాయలపై సుమారు 14 నుంచి 15 రకాల పురుగుమందులు, క్రిమిసంహారకాలను పిచికారీ చేస్తారు. వీటి అవశేషాలు పండ్లపై ఉండటం సహజమేనని, కానీ కేవలం వాటి వల్ల ఇంతటి ఘోరమైన మరణాలు సంభవించే అవకాశం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.కేవలం పుచ్చకాయలపైనే కాకుండా.. ద్రాక్ష వంటి అనేక పండ్లపై పురుగుమందుల అవశేషాలు ఉంటాయని, కేవలం వీటి కారణంగానే ప్రాణాలు పోవడం అనేది చాలా అరుదని, అసాధ్యమని అధికారులు పేర్కొంటున్నారు. ఇక పోలీసుల దర్యాప్తు విషయానికి వస్తే.. ఈ కేసును పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు. అయితే ప్రాథమిక విచారణలో కొన్ని కీలక అడ్డంకులు ఎదురయ్యాయి. బాధిత కుటుంబం ఆ పుచ్చకాయను ఎక్కడ కొనుగోలు చేసిందో ఇంకా తెలియలేదు. ఆ పరిసరాల్లోని పండ్ల వ్యాపారులను పోలీసులు ప్రశ్నించినప్పటికీ, సదరు వ్యాపారిని గుర్తించలేకపోయారు. రోడ్డు పక్కన చిన్న దుకాణాల్లో కొనుగోలు చేయడం వల్ల వారి వద్ద ఎలాంటి రసీదు లేదు. దీంతో ఆ పండు ఎక్కడి నుంచి వచ్చింది, దాని మూలాలు ఎక్కడున్నాయి అనేది గుర్తించడం కష్టంగామారింది. FDA అధికారులు డోకాడియా కుటుంబం నివసించే ఇంటి నుంచి పలు ఆహార నమూనాలను సేకరించారు. కేవలం పుచ్చకాయనే కాకుండా, ఆ రోజు వారు తిన్న ఇతర పదార్థాలను కూడా పరీక్షలకు పంపారు. సగం తిన్న పుచ్చకాయ ముక్కలు, మిగిలిపోయిన బిర్యానీ, పులావ్, వంటగదిలోని బియ్యం, మసాలాలు , ఖర్జూరాలు, బాధితులు తాగగా గ్లాసుల్లో మిగిలిపోయిన తాగునీరును కూడా బాంద్రాలోని ప్రయోగశాలకు పరీక్షలకోసం పంపారు. పరీక్షల అనంతరం ఆహారంలో విషపూరిత మూలకాలు ఉన్నాయా లేదా అనే విషయం తేలుతుంది. నగరవ్యాప్తంగా పుచ్చకాయల తనిఖీలు ఏమైనా చేపడుతున్నారా అని అడగ్గా.. ప్రస్తుతం అలాంటి ప్రత్యేక తనిఖీలేవీ లేవని దుబే-పాటిల్ తెలిపారు. సాధారణంగా మామిడి పండ్లను కృత్రిమంగా పండించడానికి కాల్షియం కార్బైడ్ ఉపయోగిస్తారు, కాబట్టి వాటిపై నిఘా ఉంచినట్లు చెప్పారు. అయితే పుచ్చకాయలను పచ్చిగా ఉన్నప్పుడు కోయరని, అవి పండిన తర్వాతే మార్కెట్‌కు వస్తాయని, కాబట్టి వీటిలో కల్తీకి అవకాశం తక్కువని ఆయన పేర్కొన్నారు. ఏదైనా అనుమానాస్పద సమాచారం వస్తేనే తనిఖీలు చేపడతామన్నారు. ఆహార భద్రతా అధికారుల విశ్లేషణ ప్రకారం…మరణాలకు కేవలం పుచ్చకాయ మాత్రమే కారణం కాకపోవచ్చు. బిర్యానీ లేదా ఇతర వండిన పదార్థాలు పాడైపోవడం వల్ల తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్ జరిగి ఉండవచ్చు. వారు తాగిన నీటిలో ఏదైనా ప్రమాదకర రసాయనం కలిసి ఉండవచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో బాధితుల పోస్ట్‌మార్టం నివేదిక మరియు విసెరా (Viscera) పరీక్షలు అత్యంత కీలకం కానున్నాయి. FDA నివేదికతో పాటు ఫోరెన్సిక్ రిపోర్ట్‌ను కలిపి విశ్లేషించినప్పుడే మరణానికి గల అసలు కారణం బయటపడుతుంది. ఈ ఘటన నేపథ్యంలో ప్రజలు భయాందోళన చెందకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. పండ్లను తినే ముందు కనీసం 20 నిమిషాల పాటు ఉప్పు నీటిలో నానబెట్టి, ఆ తర్వాత మంచి నీటితో శుభ్రంగా కడగాలి. నమ్మకమైన వ్యాపారుల వద్దే పండ్లను కొనుగోలు చేయాలి. ముక్కలుగా కోసి విక్రయించే పుచ్చకాయలను , బయట నిల్వ ఉంచిన ముక్కలను కొనుగోలు చేయవద్దని సూచిస్తున్నారు. వండిన ఆహారాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచి తినకూడదు. పుచ్చకాయ మరణాల మిస్టరీ ఇంకా వీడలేదు. ప్రయోగశాల నివేదికలు మరియు ఫోరెన్సిక్ ఆధారాలు వస్తే తప్ప, ఆ నలుగురు ప్రాణాలు కోల్పోవడానికి పుచ్చకాయే కారణమా లేక మరేదైనా విషాహారమా అనేది స్పష్టం కాదు. అప్పటివరకు ప్రజలు ఆహార భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండటం ఎంతైనా అవసరం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Singer Mangli: అందుకే మంగ్లీని టార్గెట్ చేశారు.. నోరువిప్పిన శివ చౌహాన్
దేశంలో క్యాన్సర్ మరణ మృదంగం.. దడ పుట్టిస్తున్న ICMR నివేదిక
నాడు “మీసాల పిల్ల” అంటూ ఎగతాళి.. నేడు స్టేట్ టాపర్ గా సక్సెస్
నాడు "మీసాల పిల్ల'' అంటూ ఎగతాళి.. నేడు స్టేట్ టాపర్ గా సక్సెస్
డోర్ తీసే ఉంది.. డెలివరీ బాయ్ ఏం చేసాడంటే
రైళ్లో టీసీని చూడగానే ప్రయాణికుడు పరుగో పరుగు.. కారణం ఇదే
చెరువులో నోట్ల కట్టలు.. పరిగెత్తుకెళ్లిన పోలీసులకు షాక్
వంట గ్యాస్ కష్టాలు.. బెలూన్లలో స్టోరేజీ
కావిడి కట్టి ..తల్లిని మోసి..3 నెలలు 24 రోజుల పాటు నడిచి
అమ్మాయిలని ఇంప్రెస్ చేయబోయి.. చావు దెబ్బలు తిన్న యువకుడు

