AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: 5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను జయించిన ఏపీ దివ్యాంగ విద్యార్థులు..

నువ్వు చేయలేవు.. అని లోకం వెక్కిరించిన చోటే.. మేమేంటో చూపిస్తాం అని గర్జించిన చిచ్చరపిడుగుల కథ ఇది. శారీరక వైకల్యం, పేదరికం, ఆకలి.. ఇలా అన్ని వైపుల నుండి కష్టాలు చుట్టుముట్టినా, వాళ్ల నిశ్చయం ముందు హిమాలయాల ఎత్తు కూడా చిన్నబోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 21 మంది విద్యార్థులు ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌పై విజయకేతనం ఎగురవేసి, అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు.

Andhra Pradesh: 5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను జయించిన ఏపీ దివ్యాంగ విద్యార్థులు..
Specially Abled Ap Students Reach Everest Base Camp
M Sivakumar
| Edited By: |

Updated on: May 01, 2026 | 10:11 PM

Share

నువ్వు చేయలేవు.. నీ వల్ల కాదు.. అని ఎవరైనా చెప్పినప్పుడు చాలా మంది వెనక్కి తగ్గిపోతారు. కానీ అదే మాటలను బలంగా తీసుకుని ముందుకు వెళ్లిన పిల్లల కథ ఇది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 21 మంది విద్యార్థులు, ఎన్నో అవమానాలు, కష్టాలు ఎదుర్కొని చివరకు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు చేరుకున్నారు. ఇది కేవలం ఒక ట్రెక్కింగ్ యాత్ర కాదు తమను తక్కువగా చూసిన ప్రతి ఒక్కరికీ ఇచ్చిన సమాధానం. ఈ పిల్లల్లో కొందరికి వినికిడి లోపం, కొందరికి చూపు సమస్య, ఇంకొందరికి నడవడంలో ఇబ్బంది. పైగా చాలా మంది పేద కుటుంబాల నుంచి వచ్చినవారే.  తిండి ఎలా? అనేది పెద్ద ప్రశ్నగా ఉన్న పరిస్థితుల్లో ఎవరెస్ట్ ఎక్కాలి అనేది చాలా మందికి అసాధ్యంగా అనిపించింది. కానీ ఈ పిల్లలు మాత్రం ఆలోచన మార్చలేదు. అవకాశం దొరికితే మనం కూడా చేయగలమని నమ్మారు. ప్రభుత్వం సమగ్ర శిక్ష కార్యక్రమం ద్వారా ఈ యాత్రకు అవకాశం కల్పించింది. ముందుగా గండికోటలో శిక్షణ ఇచ్చారు. అక్కడి నుంచి లద్దాఖ్ వరకు తీసుకెళ్లి, చాలా చలిలో కూడా ప్రాక్టీస్ చేయించారు. మొత్తం రెండు నెలల పాటు కఠినంగా శిక్షణ తీసుకున్న తర్వాతే ఈ యాత్ర మొదలైంది.

ఏప్రిల్ 15న నేపాల్‌ వెళ్లిన ఈ బృందం, 16 రోజుల పాటు కష్టపడి చివరకు 5,364 మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేరుకున్నారు. ఈ ప్రయాణంలో చాలా కష్టాలు వచ్చాయి. చలి, అలసట, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైనా కూడా ఈ పిల్లలు వెనక్కి తగ్గలేదు. ఒక్క అడుగు తర్వాత ఇంకో అడుగు వేస్తూ ముందుకు వెళ్లారు. వాళ్లలో ఉన్న పట్టుదలే వారిని అక్కడికి తీసుకెళ్లింది. కాగా ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌లో విజయం సాధించిన విద్యార్థులతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. మీ పట్టుదలే మీ బలం అని మంత్రి నారా లోకేష్ చెప్పిన మాటలు వారికి మరింత ధైర్యం ఇచ్చాయి. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేరుకున్నప్పుడు, ఒకప్పుడు తమను ఎగతాళి చేసిన వాళ్ల మాటలు గుర్తొచ్చాయి. కానీ ఈసారి బాధగా కాదు… గర్వంగా అనిపించింది. మేము చేయగలిగాం అనే ఆనందం వాళ్ల కళ్లలో కనిపించింది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల విజయాన్ని చూసి చాలా ఆనందపడ్డారు. మా పిల్లలు ఇంత దూరం వస్తారని ఊహించలేదు” అని ఆ పిల్లలు చెప్పారు…

ఈ 21 మంది పిల్లలు ఇప్పుడు సాధారణ విద్యార్థులు కాదు. వాళ్లు చాలా మందికి స్ఫూర్తి. వైకల్యం ఉన్నా.. మనసు బలంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఈ పిల్లలు నిరూపించారు. అవకాశం ఇస్తే ప్రతి ఒక్కరిలోనూ ఉన్న ప్రతిభ బయటకు వస్తుంది. చివరగా చెప్పాలంటే ఎవరెస్ట్ ఎత్తు ఎంతైనా ఉండొచ్చు, కానీ మన నమ్మకం, మన పట్టుదల అంతకంటే ఎక్కువైతే.. ఏ శిఖరాన్నైనా చేరుకోవచ్చు అని చాటి చెప్పారు

Follow Us