TTD: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా? బీ అలర్ట్!
తిరుమల తిరుపతి దేవస్థానం పేరుతో నకిలీ వెబ్‌సైట్లు, వీఐపీ దర్శనాల మోసాలు, నకిలీ ఉద్యోగుల వలలు, రియల్ ఎస్టేట్ ఆఫర్లు, విగ్రహాల చోరీల వరకు వరుస ఘటనలు భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. టీటీడీ పేరును అడ్డుపెట్టుకుని సైబర్ నేరగాళ్లు, మోసగాళ్లు అమాయకులను లక్ష్యంగా చేసుకుంటుండటంతో భక్తులు అధికారిక మార్గాల ద్వారానే సేవలు పొందాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
నకిలీ TTD వెబ్‌సైట్‌తో ఇవాళ ఒకడు టోకరా వేశాడు. నిన్న.. ఫ్లాట్ కొంటే జీవితాంతం V VIP దర్శనమంటూ భక్తుల నమ్మకంతో ఆడుకున్నాడు. మొన్న.. దర్శనం చేయిస్తాను, తిరుమలలో వసతి గదులు ఇప్పిస్తానంటూ నకిలీ ఉద్యోగి అవతారం ఎత్తారు. అంతకు ముందు.. ఓ మాజీ ఉద్యోగి ఆర్జిత సేవలు చేయిస్తానంటూ లక్షలు నొక్కేశాడు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అక్రమాలకు అడ్డాగా మార్చుకుంటున్న వైనాన్ని మరింత డిటైల్డ్‌గా చూద్దాం. కోట్లాది మంది భక్తుల కొంగు బంగారం.. కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి. ఆ దివ్య నామం తలచుకుంటేనే చాలు.. భక్తుల కళ్లల్లో ఆనంద బాష్పాలు రాలుతాయి, మనసంతా ఆ శ్రీనివాసుని దివ్య రూపంతో పులకించిపోతుంది. సర్వస్వం ఆ దేవుడిపై భారమేసి, ఏడు కొండలెక్కి ఆ స్వామిని ఒక్కసారైనా కనులారా దర్శించుకోవాలని దేశం నలుమూలల నుంచి కోట్ల మంది పరితపించిపోతుంటారు. కానీ.. దేవుడిపై భక్తులకు ఉన్న ఆ అపారమైన భక్తిని, ఆ తపనను కొందరు దగుల్బాజీలు వ్యాపారంగా మార్చుకుంటున్నారు. ఆ కలియుగ దైవం పవిత్ర నామాన్ని అడ్డుపెట్టుకుని, అమాయక భక్తుల నమ్మకాలను నిలువునా ముంచేస్తున్నారు. భక్తుల భక్తితో చెలగాటమాడుతున్నారు. స్వామివారి దర్శనం కోసం తపించే భక్తుల పవిత్రమైన భక్తిని క్యాష్ చేసుకోవడానికి సైబర్ నేరగాళ్లు నీచమైన వల వేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌ను పోలిన ‘ttddevasthanam.online’ పేరుతో ఒక నకిలీ సైట్ క్రియేట్ చేశారు. టీటీడీ అధికారిక వెబ్‌సైట్ డిజైన్, రంగులను సరిగ్గా దించి భక్తులను బురిడీ కొట్టిస్తున్నారు. ఎలాంటి కోటా లేని సమయాల్లోనూ, ఈ ఫేక్ సైట్‌లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, సేవా టికెట్లు, వసతి గదులు అందుబాటులో ఉన్నట్లు చూపించి.. అమాయకుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసేందుకు కుట్ర పన్నారు. టెక్నాలజీ తెలియని సామాన్య భక్తుల నమ్మకంతో చెలగాటమాడుతున్నారు. ఇక నిన్నటి ఉదంతం చూస్తే.. మానవ విలువలు ఎంతలా దిగజారిపోయాయో అర్థమవుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఏకంగా దేవుడి దర్శనాలనే బేరసారాలుగా మారుస్తున్నారు. తిరుపతి హైవేలో ప్లాట్లు కొంటే చాలు.. ‘జీవితకాల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం’ ఇస్తామంటూ ‘ఎస్‌సీపీ డెవలపర్స్’ అనే సంస్థ సోషల్ మీడియాలో బరితెగించి ప్రచారం చేసుకుంది. టీటీడీ నిబంధనల ప్రకారం ఎలాంటి ప్రైవేట్ వ్యక్తులకు దర్శనాలు ఇప్పించే అధికారం లేకపోయినా.. కోట్ల రూపాయలు దండుకోవడానికి కలియుగ దైవాన్నే వాడుకోవడం అత్యంత హేయమైన చర్య. ఇక మొన్న వెలుగులోకి వచ్చిన మరో దారుణం.. అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరాచకం. తిరుమలలో వీఐపీ దర్శనాలు, గదులు ఇప్పిస్తానంటూ కీర్తి రెడ్డి అనే మహిళ ఏకంగా నకిలీ టీటీడీ ఉద్యోగి గుర్తింపు కార్డు తయారు చేసుకుని భక్తులను నమ్మించి డబ్బులు వసూలు చేసింది. మరోవైపు.. బస్ స్టాండ్లు, రద్దీ ప్రాంతాల్లో భక్తుల పర్సులు, బ్యాగులను కట్టర్లు, బ్లేడ్లతో కత్తిరించి నగదు, విలువైన వస్తువులు దోచుకుంటోంది. ఈ నెల 15వ తేదీన వెలుగు చూసిన మరో భారీ మోసం మరింత షాకింగ్. టీటీడీలో గతంలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేసి, అక్రమాల కారణంగా ఉద్యోగం పోగొట్టుకున్న టి. అరుణ్ కుమార్.. మాజీ ఉద్యోగి అనే హోదాను అడ్డుపెట్టుకుని దందాకు తెరలేపాడు. శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలు, తోమాల, సుప్రభాత సేవల పేరుతో భక్తులను నమ్మించి లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. బెంగళూరుకు చెందిన సంపన్న కుటుంబాలను టార్గెట్ చేసి 3 లక్షల 20 వేలు కాజేయగా.. ఇతని బ్యాంకు ఖాతాల్లో గతేడాది కాలంలో ఏకంగా 85 లక్షల రూపాయల అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అంటే.. భక్తిని అడ్డుపెట్టి ఎంత మందిని మోసం చేసి ఉంటాడో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు చెప్పుకున్నవన్నీ జుజుబీ. ఎందుకంటే.. సాక్షాత్తు దేవుడి విగ్రహాన్నే అపహరించాడొకడు. ఈ నెల 22న తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులోని ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయంలో ఉన్న హనుమంతుడి చిన్న విగ్రహాన్ని జశ్వంత్ కుమార్ అనే వ్యక్తి గోవిందమాల వేషంలో వచ్చి అపహరించాడు. అయితే.. టీటీడీ విజిలెన్స్ అధికారులు, పోలీసులు అప్రమత్తమై కేవలం 14 గంటల్లోనే నిందితుడిని ఒంగోలు దగ్గర అదుపులోకి తీసుకుని, విగ్రహాన్ని సురక్షితంగా రికవరీ చేసి యథాతథంగా ప్రతిష్టించారు. ఒకవైపు సైబర్ మోసాలు.. మరోవైపు నకిలీ ఉద్యోగుల వలలు.. రియల్ ఎస్టేట్ బేరసారాలు.. చివరకు దేవుడి విగ్రహాల చోరీలు. భక్తుల భక్తిని అడ్డుపెట్టుకుని తిరుమల పవిత్రతను మంటగలుపుతున్నారు కొందరు నీచులు. సో, తిరుమలకు వెళ్లాలనుకునే వారు ఇలాంటి మాయగాళ్ల వలలో పడే ముందు ఒకటికిరెండుసార్లు ఆలోచించుకోవడం బెటర్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వామ్మో.. చెడ్డీ గ్యాంగ్ మళ్లీ వచ్చింది.. సీసీ కెమెరాలు పీకేసి మరీ..
తాంత్రిక పూజల పేరుతో మహిళపై లైంగిక దాడి!
మీది పాత బండా? పీయూసీ గడువుపై కొత్త రూల్స్ ఇవే!
TTD: టీటీడీ కీలక నిర్ణయం.. శ్రీవారి సేవకులకు సీబిల్ తరహా రేటింగ్
భార్యను ఉరితీసి.. తల్లిదండ్రులకు వీడియో కాల్‌లో చూపించిన భర్త!
వరల్డ్ వండర్ కిడ్స్ .. చిన్న వయసు.. పెద్ద మనసు!
రైలు ఇంజిన్ చెక్ చేస్తున్న పైలట్.. అక్కడ మనిషి తలను చూసి..
ఫేస్బుక్ ఫ్రెండ్ ఆశల ఎర.. రూ.1.75 కోట్లు పోగొట్టుకున్న మహిళ!
చెడ్డీ గ్యాంగ్ మళ్లీ వచ్చింది.. సీసీ కెమెరాలు పీకేసి మరీ..
తాంత్రిక పూజల పేరుతో మహిళపై లైంగిక దాడి!
భార్యను ఉరితీసి.. తల్లిదండ్రులకు వీడియో కాల్‌లో చూపించిన భర్త!
ఇదేం భక్తయ్యా.. రైలు తగలబెడతావా ఏంటి సామీ!

