Talasani Srinivas Yadav: మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు.. మంత్రి తలసాని శ్రీనివాస్..
మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసే వారి పట్ల తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.

మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసే వారి పట్ల తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. రెండు రోజుల క్రితం అయ్యప్ప స్వామిపై భైరి నరేష్ అనే వ్యక్తి చేసిన అనుచిత వ్యాఖ్యలపై మంత్రి శ్రీనివాస్ యాదవ్ శనివారం స్పందించారు. సమాజంలోని ఇతర మతస్థుల నమ్మకాలను దెబ్బతీసేలా, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానించడం, మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడటం సహించరానిదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి మత విద్వేషాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే వారు ఎంతటి వారైనా తెలంగాణా ప్రభుత్వం వదిలిపెట్టదని, అలాంటి వారిపై ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు ఉంటాయని మంత్రి శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు.
అయ్యప్ప స్వామిపై నోరు పారేసుకున్న భైరి నరేష్ ను పోలీసులు వరంగల్ లో అదుపులోకి తీసుకుని.. పరిగి సబ్‌జైలుకు తరలించారు. ఈ సందర్భంగా అతన్ని కొడంగల్ కోర్టులో హాజరుపర్చగా.. 14 రిమాండ్ విధించింది. మరోవైపు భైరి నరేష్ అనుకూల పోస్టులపైనా పోలీసుల నజర్ వేశారు. గతంలో భైరి నరేష్ పోస్ట్ చేసిన వీడియోలపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదిలాఉంటే.. విచారణ కోసం రేంజర్ల రాజేష్ వికారాబాద్ కు తరలిస్తున్నారు. కాసేపట్లో రాజేష్ అరెస్ట్ చూపించే అవకాశం ఉంది. నరేష్, రాజేష్ బ్యాక్ గ్రౌండ్‌నూ పోలీసులు వెరిఫై చేస్తున్నారు. గతంలో పోస్ట్ చేసిన వీడియోలు, ఫేస్ బుక్ పోస్ట్‌ల వివరాలు సేకరిస్తున్నారు.
అయ్యప్ప స్వామిపై నోరు పారేసుకున్న భైరి నరేష్ జైలుకెళ్లినా.. అయ్యప్ప భక్తులు శాంతించడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అటు.. పరిగి సబ్ జైలు వద్ద హైటెన్షన్ నెలకొంది. అయ్యప్ప భక్తులు ఎటాక్ చేస్తారన్న భయంతో నరేశ్ జైలులోకి పరిగెత్తాడు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం..