Hyderabad Crime: మెళ్లో మంగళసూత్రం కోసం మహిళపై దొంగదాడి.. ఊహించని ట్విస్ట్‌కు దొంగ హడల్..
భారతీయ మహిళలకు మంగళ సూత్రం పరమపవిత్రం. ఆడవారికి మాంగల్యం ఆరోప్రాణం. అంతటి విలువైన తన మెళ్లోని ఐదో తనాన్ని ఓ దుర్మార్గుడు కాజేయాలని చూశాడు. దుండగుడు కత్తితో దాడిచేసినా..

భారతీయ మహిళలకు మంగళ సూత్రం పరమపవిత్రం. ‘మాంగల్యం తంతునానేనా, మమజీవన హేతునా, కంఠే బధ్నామి సుభగే త్వం జీవశరదాం శతం’ అనే మాటకు కట్టుబడి భార్యభర్తలిద్దరూ జీవనం సాగిస్తారు. ఆడవారికి మాంగల్యం ఆరోప్రాణం. అంతటి విలువైన తన మెళ్లోని ఐదో తనాన్ని ఓ దుర్మార్గుడు కాజేయాలని చూశాడు. దుండగుడు కత్తితో దాడిచేయగా.. వాడితో పోరాడిమరీ తన తాళిబొట్టును కాపాడుకుంది ఓ వీరమహిళ. హైదరాబాద్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నిజామాబాద్‌కు చెందిన అశోక్, కనక మహాలక్ష్మి దంపతులు. వీరు హైదరాబాద్‌లోని బోరబండలో ఉన్న బంధువుల ఇంటికి ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో రోటేగావ్-కాచిగూడ ఎక్స్ ప్రెస్ రైలులో హైదరాబాద్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి బోరబండకు వచ్చే క్రమంలో సీతాఫల్ మండి రైల్వే స్టేషన్ సమీపంలో సిగ్నల్ పడటంతో రైలు ఆగింది. అదే రైలులో ఈ దంపతులను గమనిస్తున్న ఓ దొంగ అదే అదనుగా భావించి, కనక మహాలక్ష్మి మెడలోని మూడు తులాల బంగారు గొలుసు లాక్కొని పారిపోయేందుకు యత్నించాడు. వెంటనే తేరుకున్న దంపతులు దొంగను పట్టుకుని కేకలు వేశారు. దొంగ వద్ద కత్తి ఉండటంతో భయపడి చుట్టు ఉన్న ఇతర ప్రయాణికులు ముందుకు రాలేదు. ఇంతలో దొంగ తనవద్ద ఉన్న కత్తితో అశోక్, కనక మహాలక్ష్మిలను గాయపరిచాడు. ఈ పోరాటంతో కనక మహాలక్ష్మి రక్తం కారుతున్నా కిందపడిమరీ దొంగను వదలకుండా అతనితో చాలా సేపు పోరాడింది. ఆ తర్వాత తేరుకున్న తోటి ప్రయాణికులు ముందుకు రావడంతో దొంగ పరారయ్యాడు. సీతాఫల్ మండి రైల్వే పోలీసులకు దంపతులు ఫిర్యాదు చేశారు. దంపతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.




మరిన్ని తాజా నేర వార్తల కోసం క్లిక్ చేయండి.