Hyderabad: భాగ్యనగర వాసులకు న్యూయర్ కానుక.. కొత్తగూడ ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్..
న్యూఇయర్ వేళ భాగ్యనగరం శిగలో మరో మణిహారం వచ్చి చేరనుంది. రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. ఆదివారం నాడు కొత్తగూడ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించనున్నారు.

న్యూఇయర్ వేళ భాగ్యనగరం శిగలో మరో మణిహారం వచ్చి చేరనుంది. రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. ఆదివారం నాడు కొత్తగూడ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు ఈ ఫ్లైఓవర్‌ను మంత్రి ఓపెన్ చేయనున్నారు. గచ్చిబౌలి ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి రూ. 263 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన కొత్తగూడ – గచ్చిబౌలి ఫ్లైఓవర్ ఆదివారం నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది. 2,216 మీటర్లు పొడవు గల ఈ ఫ్లైఓవర్‌ను ఎస్ఆర్‌డిపి కార్యక్రమంలో భాగంగా నిర్మించారు. నగర వాసుల సౌకర్యార్థం రోడ్ నెట్‌వర్క్ పెంచడం, రవాణా సమయం తగ్గించడం, ప్రయాణ వేగాన్ని పెంచడం, ఇంధన వనరులను తగ్గించడం, చేరవలసిన గమ్యానికి సకాలంలో చేరే లక్ష్యంతో నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే కొత్తగూడ ఫ్లైఓవర్‌ను కూడా నిర్మించింది జీహెచ్ఎంసీ.
కాగా, ఎస్ఆర్‌డీపీ ద్వారా నగర వ్యాప్తంగా చేపట్టిన ఫ్లైఓవర్లలో కొత్తగూడ ఫ్లైఓవర్ 18వది. 2,216(2.2 కిలోమీటర్లు) పొడవైన ఈ ఫ్లైఓవర్.. ఎస్ఎల్ఎన్ టెర్మినల్ నుంచి బొటానికల్ జంక్షన్ వరకు ఐదు లేన్ల వెడల్పుతో, బొటానికల్ జంక్షన్ నుంచి కొత్తగూడ జంక్షన్ వరకు ఆరు లేన్ల వెడల్పు, కొత్తగూడ జంక్షన్ నుంచి కొండాపూర్ ఆర్‌టీఏ ఆఫీస్ వరకు 3 లేన్ల వెడల్పు రోడ్డు ఫ్లైఓవర్‌ను పూర్తి చేశారు. బొటానికల్ గార్డెన్ జంక్షన్, కొత్తగూడ జంక్షన్, కొండాపూర్ జంక్షన్‌లను కవర్ చేస్తూ.. గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వైపు, హైటెక్ సిటీ వైపు వెళ్లేలా ఈ కొత్తగూడ ఫ్లైఓవర్‌ను నిర్మించారు. ఇక మజీద్ బండ నుంచి బొటానికల్ జంక్షన్ ట్రాఫిక్ కోసం 2 లేన్లతో బొటానికల్ అప్ ర్యాంపు, కొత్తగూడ నుంచి హైటెక్ సిటీ వెళ్లేందుకు 383 మీటర్ల పొడవుతో 3 లేన్ల డౌన్ ర్యాంపును ఏర్పాటు చేశారు. హఫీజ్‌పేట్‌కు వెళ్లేందుకు 470 మీటర్ల పొడవుతో 3 లేన్ల వెడల్పుతో అండర్ పాస్‌ను నిర్మించారు.
కొత్తగూడ ఫ్లైఓవర్ వలన వాహనదారులు, దాని చుట్టూ ఉన్న కాలనీలు, పరిసరాల వారికి రవాణా ఈజీ అవుతుంది. అందులోనూ బొటానికల్ గార్డెన్, కొత్తగూడ, కొండాపూర్ జంక్షన్ ల మధ్య చాలా తక్కువ దూరంలో ఉన్న కూడళ్ల నుండి సాఫిగా వెళ్లేందుకు వెసులుబాటు ఉంటుంది. దీనికి తోడె ప్రస్తుతం ఉన్న గ్రేడ్ కారిడార్ కు ఇరువైపులా వాణిజ్య పరమైన నిర్మాణాలకు ప్రయోజనం కలుగుతుంది. ఈ జంక్షన్‌ల పరిసరాల్లో అనేక సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉండడం వల్ల రద్దీ సమయంలో ట్రాఫిక్ సమస్య కూడా తగ్గుతుంది.




ఈ ఫ్లైఓవర్.. గచ్చిబౌలి నుండి మియాపూర్ వరకు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుండి హైటెక్ సిటీ వరకు కనెక్టివిటీతో పాటు మియాపూర్, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిసర ప్రాంతాలను కలుపుతుంది. ఫ్లై ఓవర్ వలన బొటానికల్ గార్డెన్ జంక్షన్ కొత్తగూడ జంక్షన్లలో 100 శాతం ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవడమే కాకుండా కొండాపూర్ జంక్షన్‌లో 65 శాతం ట్రాఫిక్ సమస్య తీరుతుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..