- Telugu News Photo Gallery Spiritual photos Shani Transit 2026: Guru's Aspect Brings Relief to 6 Zodiac Signs
కొత్త సంవత్సరంలో వీరికి శని దోషం మటుమాయం! అష్టకష్టాల నుంచి విముక్తి
ప్రస్తుతం శని దోషంతో అష్టకష్టాలు పడుతున్న రాశులకు 2026 మే తర్వాత నుంచి శని ప్రభావం నుంచి పూర్తిగా విముక్తి కలిగే అవకాశం ఉంది. వాస్తవానికి ఏలిన్నాటి శని, సప్తమ శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వంటి దోషాలు 2027 డిసెంబర్ వరకు కొనసాగవలసి ఉన్నప్పటికీ, మే నుంచి గురువు ఉచ్ఛపట్టి ఈ శనిని పూర్ణ దృష్టితో వీక్షిస్తున్నందువల్ల మేషం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం, మీన రాశులకు శని దోషం పూర్తిగా తొలగిపోయి సుఖ సంతోషాలు వృద్ధి చెందడం జరుగుతుంది.
Updated on: Dec 06, 2025 | 1:17 PM

మేషం: ఈ రాశికి ప్రస్తుతం ఏలిన్నాటి శని జరుగుతోంది. ప్రస్తుతం వ్యయ స్థానంలో సంచారం చేస్తున్న శనీశ్వరుడి వల్ల 2027 డిసెంబర్ వరకు ఈ రాశివారు శ్రమ, తిప్పట, అనారోగ్యాలు, అనవసర ఖర్చులు, అనుకోని ఖర్చులు, నష్టాలు, మోసాలు, ఆశాభంగాలతో అవస్థలు పడాల్సి ఉంది. అయితే, మరో ఆరు నెలల తర్వాత కర్కాటక రాశిలో ఉచ్ఛపట్టిన గురువు ఈ శనిని వీక్షించడం వల్ల వీరికి ఈ కష్టనష్టాల నుంచి పూర్తిగా విముక్తి లభించి, సుఖ సంతోషాలు బాగా వృద్ధి చెందుతాయి.

సింహం: ఈ రాశికి మరో రెండేళ్ల పాటు అష్టమ శని దోషం పీడించే అవకాశం ఉంది. దీనివల్ల వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉండడం, ఆర్థికంగా నష్టపోవడం, వైద్య ఖర్చులు పెరగడం, ఏదీ కలిసి రాకపోవడం, అనారోగ్యాలు పీడించడం, సమస్యలు వృద్ధి చెందడం, ఒత్తిడి ఎక్కువగా ఉండడం వంటివి జరుగుతాయి. అయితే, వచ్చే ఏడాది మే తర్వాత నుంచి గురు దృష్టి వల్ల ఈ శని శుభ ఫలితాలనివ్వడం జరుగుతుంది. ఏడాది పాటు ఈ రాశివారికి అన్ని విధాలా పురోగతి ఉంటుంది.

కన్య: ఈ రాశికి ఏడవ స్థానంలో శని సంచారం వల్ల ప్రతి పనీ, ప్రతి ప్రయత్నమూ నిదానంగా పూర్తవుతుంది. అంతేకాక, ప్రతి పనీ అసంపూర్తిగా నిలిచిపోతుంటుంది. ఒత్తిడి, శ్రమ, తిప్పట ఎక్కువగా ఉంటాయి. పెళ్లి ప్రయత్నాల్లో ఆశాభంగాలు ఎక్కువగా ఉంటాయి. చివరి క్షణంలో పెళ్లి సంబంధం రద్దయ్యే అవకాశం కూడా ఉంటుంది. దాంపత్య జీవితంలో సమస్యలు తలెత్తుతాయి. అయితే, మే నుంచి గురు వీక్షణతో వీరికి మళ్లీ మంచి రోజులు ప్రారంభం అవుతాయి. ప్రతిదీ కలిసి వస్తుంది.

ధనుస్సు: ఈ రాశివారికి ప్రస్తుతం అర్ధాష్టమి జరుగుతోంది. 2027 డిసెంబర్ వరకూ ఇది కొనసాగుతుంది. అయితే, గురు వీక్షణ వల్ల 2026 మే నుంచి ఏడాది పాటు వీరికి శని దోషం నుంచి విముక్తి లభిస్తుంది. అర్ధాష్టమ శని వల్ల కుటుంబంలో సుఖశాంతులు తగ్గుతాయి. కుటుంబ సభ్యుల్ని అనారోగ్యాలు బాధిస్తుంటాయి. శుభకార్యాలు కలిసి రావు. ఆస్తి సమస్యలు ఇబ్బంది పెడతాయి. అయితే, శని దృష్టి వల్ల కుటుంబంలో శుభకార్యాలు జరగడం, ఆదాయం వృద్ధి చెందడం జరుగుతుంది.

కుంభం: ఈ రాశికి ద్వితీయ స్థానంలో శని సంచారం వల్ల 2027 డిసెంబర్ వరకు ఏలిన్నాటి శని పీడించే అవకాశం ఉంది. దీనివల్ల వీరికి కుటుంబ సమస్యలు, కుటుంబ ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరగకపోగా, రుణాలు చేయవలసి వస్తుంది. కష్టార్జితంలో ఎక్కువ భాగం వృథా అవుతుంది. ఆర్థికంగా, కుటుంబపరంగా ఎదుగుదల ఉండదు. అయితే, మే నుంచి శని మీద గురు దృష్టి పడుతున్నందువల్ల ఆర్థికంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా దశ తిరుగుతుంది.

మీనం: ప్రస్తుతం ఈ రాశిలో శని సంచారం వల్ల ఏలిన్నాటి శని జరుగుతోంది. దీనివల్ల ప్రాభవం, ప్రాధాన్యం, ప్రాబల్యం తగ్గిపోతాయి. బంధుమిత్రులు దూరమవుతారు. సమస్యలతో ఒంటరిగా పోరాడాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు కూడా లభించకపోవచ్చు. అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఉద్యోగంలో పదోన్నతులు ఆగిపోతాయి. అయితే, మే తర్వాత క్రమంగా శుభ యోగాలు, ధన యోగాలు కలిసి వస్తాయి. సుఖ సంతోషాలు వృద్ది చెందుతాయి.



