AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Personal Loan: పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.. లేకపోతే అప్పుల ఊబిలో..

పర్సనల్ లోన్స్ అర్జెంట్ అవసరాలకు తక్షణ పరిష్కారం. వ్యాపారం, వైద్య ఖర్చులకు ఇవి బాగా ఉపయోగపడతాయి. ఈ రుణాలకు పూచీకత్తు అవసరం లేదు. అయితే చాలా మంది అన్నీ విషయాలను తెలుసుకోకుండానే లోన్ తీసుకుంటారు. ఆ తర్వాత అధిక వడ్డీ కడుతూ తిప్పలు పడతారు. అందుకే లోన్ తీసుకునేముందు ఈ విషయాలను తెలుసుకోండి..

Personal Loan: పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.. లేకపోతే అప్పుల ఊబిలో..
Personal Loan Tips
Krishna S
|

Updated on: Dec 06, 2025 | 2:48 PM

Share

జీవితంలో ఆనందాలు, కష్టాలు సహజం. అకస్మాత్తుగా చేతిలో డబ్బు లేనప్పుడు, సడెన్‌గా డబ్బు అవసరం అయినప్పుడు పర్సనల్ లోన్ తక్షణ పరిష్కారంగా కనిపిస్తుంది. వ్యాపారం ప్రారంభించడానికి, వైద్య అత్యవసర పరిస్థితులకు లేదా ఊహించని ఖర్చుల కోసం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ రుణాన్ని సులభంగా పొందుతున్నామని గుడ్డిగా సంతకం చేయడం తెలివైన పని కాదు. వ్యక్తిగత రుణం వరం అవుతుందా..? శాపం అవుతుందా..? అనేది మీ నిర్వహణ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి లోన్ తీసుకునే ముందు ఈ ముఖ్యమైన విషయాలను తప్పక పరిశీలించండి:

సరైన కారణం ఉందో లేదో చెక్ చేయండి

పర్సనల్ లోన్ ఉత్తమ ఎంపిక కావాలంటే మీకు నిజంగా డబ్బు అవసరమా అని తనిఖీ చేసుకోవాలి. వ్యాపార మూలధనం కోసం, అత్యవసర వైద్య కార్యకలాపాల కోసం లేదా ఊహించని కష్టాలను ఎదుర్కోవడానికి లోన్ తీసుకోవడం సరైనదే. కానీ మొబైల్ ఫోన్ కొనడం, విహారయాత్రలకు వెళ్లడం వంటి చిన్న చిన్న విలాసాలకు రుణం తీసుకునే ధోరణి ఇటీవల యువతలో పెరుగుతోంది. సరదాగా గడపడానికి లోన్ తీసుకుంటే తరువాత తిరిగి చెల్లించే విషయంలో ఇబ్బందులు తప్పవు. అప్పుల ఊబిలో చిక్కుకోకుండా ఉండాలంటే మీ నిర్వహణ సామర్థ్యం చూసుకోవడం ముఖ్యం.

పూచీకత్తు అవసరం లేదు

వ్యక్తిగత రుణాలలో ఉన్న ప్రధాన ఆకర్షణ ఇదే. దీనికి ఇల్లు, బంగారం వంటి పూచీకత్తు అవసరం లేదు. అందుకే ప్రజలు దీనిని ఎక్కువగా ఇష్టపడతారు. లోన్ అప్రూవల్ కూడా త్వరగా లభిస్తుంది. మీ సౌలభ్యం కోసం బ్యాంకులు, NBFCలు సాధారణంగా 1 నుండి 5 సంవత్సరాల వరకు ఈఎంఐ చెల్లించడానికి సమయాన్ని ఇస్తాయి.

వడ్డీ రేటు – క్రెడిట్ స్కోర్ కీలకం

వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు ఎలా లెక్కిస్తారో తెలుసుకోవడం ముఖ్యం. ప్రస్తుతం బ్యాంకులు 9.99 శాతం నుండి 10.80 శాతం వరకు వడ్డీని వసూలు చేసే అవకాశం ఉంది. మీ క్రెడిట్ స్కోరు ఎంత సూపర్‌గా ఉంటే బ్యాంకులు మీకు అంత తక్కువ వడ్డీ రేటుకు లోన్ ఇస్తాయి. కాబట్టి మంచి క్రెడిట్ స్కోరును నిర్వహించడం చాలా ముఖ్యం.

గుడ్డిగా రుణం తీసుకోకండి

రుణం తీసుకునే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి: లోన్ ఎందుకు తీసుకుంటున్నాను? అనే ప్రశ్నకు సమాధానం స్పష్టంగా ఉండాలి. మీకు అవకాశం లభిస్తుందని ఒకే బ్యాంకును నమ్మకండి. మార్కెట్‌లోని వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల వద్ద వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులను తప్పనిసరిగా పోల్చండి.

అదనపు ఛార్జీలు

ప్రతి నాణేనికి రెండు వైపులా ఉన్నట్లే వ్యక్తిగత రుణాలలో కూడా ఎప్పుడూ ప్రమాదం ఉంటుంది. ఈ రుణాలు సాధారణంగా అధిక వడ్డీ రేటును కలిగి ఉంటాయి కాబట్టి తిరిగి చెల్లించేటప్పుడు మీ జేబుకు కోత పడటం ఖాయం. మీరు ఈఎంఐ చెల్లించడం మిస్ అయితే అదనపు ఛార్జీ పడుతుంది. మీ క్రెడిట్ స్కోరు తీవ్రంగా దెబ్బతింటుంది. సరైన ప్రణాళిక లేకుండా లేదా విలాసవంతమైన జీవితం కోసం రుణం తీసుకోవడం మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది.

వ్యక్తిగత రుణం కష్టంలో ఉన్నవారికి రెండవ అవకాశం లాంటిది. మీరు దానిని తెలివిగా ఉపయోగిస్తే మీ జీవితం స్థిరపడుతుంది. కానీ అనవసరంగా తప్పుగా లెక్కిస్తే, అది భారంగా మారిపోతుంది. కాబట్టి, రుణం తీసుకునే ముందు వందసార్లు ఆలోచించి, తెలివైన నిర్ణయం తీసుకోండి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి