Telugu Politics: తెలుగు రాష్ట్రాల్లో ఇక పాదయాత్రల జోరు.. ఏపీలో లోకేశ్.. తెలంగాణలో రేవంత్.. రాజకీయ కలల ఛేదనకు ఇదే మార్గం
తెలుగు గడ్డ మీద ప్రజాక్షేత్రంలో.. రాజకీయ పోరాటంలో నిలవాలంటే, రాజకీయ లక్ష్యాలను సాధించాలంటే పాదయాత్ర ఒక్కటే మార్గమని తెలుగు రాజకీయ నాయకులు భావిస్తూ వస్తున్నారు.

ప్రస్తుతం పాదయాత్రల ట్రెండ్ కొనసాగుతుంది. 2003వ సంవత్సరంలో ఎప్పుడైతే ఆనాటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్రకు తెరలేపారో.. ఆనాటి నుంచి తెలుగు గడ్డ మీద ప్రజాక్షేత్రంలో.. రాజకీయ పోరాటంలో నిలవాలంటే, రాజకీయ లక్ష్యాలను సాధించాలంటే పాదయాత్ర ఒక్కటే మార్గమని తెలుగు రాజకీయ నాయకులు భావిస్తూ వస్తున్నారు. పాదయాత్రల పర్వంలో 2023 జనవరి నెల అత్యంత కీలకంగా కాబోతోంది. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ సుదీర్ఘ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. జనవరి 27వ తేదీన ఆయన పాదయాత్ర చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభం కాబోతోంది. దాదాపు నాలుగు వందల రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేయాలని లోకేష్ తలపెట్టారు. అందుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించుకున్నారు. తన పాదయాత్రకు ‘యువగళం’ అని పేరు కూడా పెట్టుకున్నారు నారా లోకేష్. ఇటు తెలంగాణలో గత ఏడాది కాలంగా పాదయాత్ర నిర్వహించాలని భావిస్తూ.. విభిన్న కారణాలతో దాన్ని వాయిదా వేస్తూ వస్తున్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా జనవరి 26వ తేదీ నుంచి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. భద్రాచల శ్రీరాముని సన్నిధి నుంచి పాదయాత్ర ప్రారంభించి జూన్ రెండవ తేదీన (తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం) తన పాదయాత్రకు ముగింపు పలకాలని రేవంత్ రెడ్డి తలపెట్టారు. తెలంగాణలో మొత్తం 119 నియోజకవర్గాలు ఉంటే దాదాపు 99 అసెంబ్లీ నియోజకవర్గాలలో పాదయాత్ర చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. సో.. 2023 సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నేతల పాదయాత్రలు హోరెత్తించబోతున్నాయి.
గమనాన్ని మార్చిన వైఎస్సార్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2003వ సంవత్సరంలో ఆనాడు సిఎల్పీ నేతగా ఉన్న డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం దాకా నిర్వహించిన పాదయాత్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మార్చివేసింది. అంతకుముందు ఫెరోషియస్ లీడర్ గా తనకున్న పేరును పోగొట్టుకొని ఒక ప్రజా నేతగా పరిణామం చెందే క్రమంలో వైయస్సార్ ఆనాడు పాదయాత్రను ఎంచుకున్నారు. ఆ లక్ష్యంలో ఆయన సఫలం అయ్యారని చెప్పవచ్చు. 2003 పాదయాత్ర తర్వాత 2004వ సంవత్సరంలో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో విజయపు బావుట ఎగురవేయించారు వైయస్సార్. ఆ తర్వాత పార్టీలో తిరుగులేని నేతగా మారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు రాజకీయ వ్యూహాలతో ప్రత్యర్థులను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ వచ్చారు. 2009వ సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి కాంగ్రెస్ పార్టీని అధికారం చేపట్టేలా వ్యూహరచన చేశారు.. సఫలీకృతమయ్యారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి, టీఆర్ఎస్, సీపీఐ ఇలా పార్టీలన్నీ కలిసి పోటీ చేసినా వైఎస్ఆర్‌ని అధికారం నుంచి దింపలేకపోయాయి. అయితే దురదృష్టవశాత్తు విధి వక్రించి ఆయన 2009 సెప్టెంబర్ రెండవ తేదీన హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. వైయస్సార్ అనంతరం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాదయాత్రల పర్వం కొనసాగింది. తన తండ్రి మరణానంతరం గుండె లాగి మరణించిన ప్రజల్ని ఓదార్చేందుకు దివంగత వైఎస్సార్ తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో నిర్వహించారు. 2013 వ సంవత్సరంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కూడా పాదయాత్రను ఎంచుకున్నారు. 61 ఏళ్ళ వయసులో చంద్రబాబు పాదయాత్రనే ఎంచుకున్నారంటే దాని ప్రాధాన్యత ఎంతలా పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు.
రాష్ట్ర విభజన తర్వాత జోరు
పాదయాత్రలపర్వాన్ని పరిశీలిస్తే 2014లో రాష్ట్ర విభజన తర్వాత మరిన్ని పాదయాత్రలు మనకు కనిపిస్తాయి. వైయస్సార్సిపి పార్టీని ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి కొంతకాలం పాదయాత్ర నిర్వహించారు. ఆయన సోదరి వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాలను వదిలి తెలంగాణలో రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ కూడా సుదీర్ఘ కాలం పాటు ఆమె పాదయాత్రలు కొనసాగించారు. ఇటీవల కాలంలో ఆమె పాదయాత్రలో పలు చోట్ల ఉద్రిక్తతలు ఏర్పడడంతో పాదయాత్రలకు పోలీసులు అనుమతి నిరాకరించడం.. ఆమె కోర్టు నాశ్రయించి అనుమతి పొందడం జరిగింది. ఈ క్రమంలో ఆమె మరోసారి పాదయాత్ర ఎప్పుడు ప్రారంభిస్తారనేది ఇంకా కచ్చితంగా తేలలేదు. మరోవైపు తెలంగాణలో భారతీయ జనతా పార్టీలో దూకుడు పెంచిన టి.బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఇప్పటివరకు ఐదు విడతలుగా ప్రజా సంగ్రామ యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహించారు. మొదటి రెండు విడతల పాదయాత్ర సాదాసీదా జరిగినప్పటికీ మూడో, నాలుగో విడతల్లో బండి సంజయ్ మాటల తూటాలతో అధికార బీఆర్ఎస్ నేతలు బెదిరిపోయారు. ఫలితంగా బీఆర్ఎస్ క్యాడర్ బీజేపీ క్యాడర్ మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది. అయిదో విడతగా బండి సంజయ్ నిర్మల్ జిల్లా భైంసా నుంచి పాదయాత్రకు సిద్దపడడంతో మతపరమైన ఇబ్బందులకు దారితీస్తుందన్న కారణంతో పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆయన కోర్టు అనుమతితో, కొన్ని షరతుల మేరకు పాదయాత్ర పూర్తి చేశారు. ఇటీవల ఆయన ఐదో విడత పాదయాత్రను ముగించారు. ప్రస్తుతం పార్టీ వ్యూహ రచనలో భాగంగా పలు అంతర్గత సమావేశాలకు ఆయన పరిమితం అవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీకి ఎప్పుడు ఎన్నికలు వచ్చిన సంసిద్ధంగా ఉండేందుకు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఒక్కరు చొప్పున ఇంఛార్జీలను నియమించింది బీజేపీ.
2023లో మరిన్ని పాదయాత్రలు
ఈ నేపథ్యంలోనే తెలంగాణలో మరో పాదయాత్రకు రేవంత్ రెడ్డి సంసిద్ధమయ్యారు. జనవరి 26వ తేదీ నుంచి జూన్ రెండవ తేదీ వరకు ఆయన 99 నియోజకవర్గాలను కవర్ చేస్తూ పాదయాత్ర చేపట్టబోతున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణలను అనుకూలంగా మార్చుకునే ఉద్దేశంతో నారా లోకేష్ పాదయాత్రకు సిద్ధమయ్యారు. జనవరి 27వ తేదీ నుంచి దాదాపు నాలుగు వందల రోజులపాటు నాలుగువేల కిలోమీటర్లను కవర్ చేస్తూ ఆయన ‘యువగళం’ పేరుతో నారా లోకేశ్ పాదయాత్ర చేయబోతున్నారు. ప్రజలతో సన్నిహితంగా మెదిలేందుకు పాదయాత్రలు ఎంతగానో ఉపయోగపడతాయన్నది గత 19 సంవత్సరాలుగా పలు సందర్భాలలో నిరూపణ జరిగింది. ఈ క్రమంలోనే రాజకీయ భవిష్యత్తును మెరుగుపరుచుకునేందుకువాలనుకుంటున్న.. రాజకీయ లక్ష్యాలను చేరుకోవాలనుకుంటున్న నేతలు పాదయాత్రలను ఎంచుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా తెలంగాణలో రేవంత్ రెడ్డి.. ఏపీలో నారా లోకేష్ పాదయాత్రలకు సంసిద్ధమవుతున్న నేపథ్యంలో అధికార పార్టీలు ఎలాంటి వ్యూహరచన చేస్తాయన్నది ఆసక్తి రేపుతోంది.