AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lok Sabha Election: అస్సలు తగ్గేదే లే..! పార్టీకి, బరిలో ఉన్న అభ్యర్థికి చుక్కలు చూపిస్తున్న నేత!

అన్నీ పార్టీల నేతలంతా ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎర్రని ‌ఎండలో గడపకు గడపకు తిరుగుతుంటే, ఆ పార్టీ‌నేతలు మాత్రం ఆ నేతను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అసమ్మతిని చల్లార్చి అలక మానిపించేందుకు అష్టకష్టాలు పడుతున్నారట. కానీ ఏం లాభం ఆ నేత మాత్రం అస్సలు తగ్గేదే లే.. నా రూటే సపరేట్ అంటూ పార్టీకి, బరిలో ఉన్న పార్టీ అభ్యర్థికి మూడు చెరువులు నీళ్లు తాగిస్తున్నాడట.

Lok Sabha Election: అస్సలు తగ్గేదే లే..! పార్టీకి, బరిలో ఉన్న అభ్యర్థికి చుక్కలు చూపిస్తున్న నేత!
Soyam Baburao
Naresh Gollana
| Edited By: |

Updated on: Apr 26, 2024 | 2:50 PM

Share

నామినేషన్ పర్వం ముగిసింది.. ప్రచార పర్వం మొదలైంది. అసమ్మతి నేతలను దారికి‌తెచ్చుకునే పర్వం కూడా సాగుతోంది. ఒక్కొక్కరుగా దారికొస్తున్నా ఆ పార్టీలో ఆ ఒక్క నేత మాత్రం నా దారి నాదే.. అస్సలు మీ దారికి రానంటూ పోపోమంటున్నాడు. అన్నీ పార్టీల నేతలంతా ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎర్రని ‌ఎండలో గడపకు గడపకు తిరుగుతుంటే, ఆ పార్టీ‌నేతలు మాత్రం ఆ నేతను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అసమ్మతిని చల్లార్చి అలక మానిపించేందుకు అష్టకష్టాలు పడుతున్నారట. కానీ ఏం లాభం ఆ నేత మాత్రం అస్సలు తగ్గేదే లే.. నా రూటే సపరేట్ అంటూ పార్టీకి, బరిలో ఉన్న పార్టీ అభ్యర్థికి మూడు చెరువులు నీళ్లు తాగిస్తున్నాడట. ఇంతకీ‌ ఎవరా అసమ్మతి నేత.. ఏంటా దారి తప్పిన కథ..?

ఆదిలాబాద్.. ఎండలు ముదిరి‌ నిప్పుల వర్షం కురిసినట్టు ఇక్కడి వాతవరణం కనిపిస్తుంటే, అంతకు మించి అన్నట్టుగానే ఇక్కడి రాజకీయ వాతవరణం మారుతోంది. నామినేషన్ల పర్వం ముగియడంతో ఓటర్ మహాశయులను ప్రసన్నం చేసుకునేందుకు నిప్పుల‌ కొలిమిలా మండుతున్న ఎండలను సైతం లెక్క చేయకుండా సుడిగాలి పర్యటనలతో దూసుకెళుతున్నారు ఇక్కడి నేతలు. కానీ‌ ఇక్కడి కాషాయ‌ పార్టీలో‌ మాత్రం సీన్ మరోలా ఉందన్న టాక్ నడుస్తోంది.

ఎన్నికలకు ఇంకా మూడు వారాలు కూడా లేని ఈ సమయంలో ఇక్కడి కాషాయ దళంలో అసమ్మతి మళ్లీ భగ్గుమంటోంది. బరిలో ఉన్న కాషాయ అభ్యర్థికి ఏసీలోను చెమటలు పట్టే పరిస్థితిని‌ తెస్తుందంట. కారణం ఈ పార్లమెంట్ పరిధిలో గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు కలిసినట్టుగానే కలిసి నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. అయితే జిల్లాకు చెందిన ముఖ్య నేత మాత్రం కినుక వహించి తిరుగుతున్నారట. అభ్యర్థి‌ ప్రకటన నుండి పార్టీకి‌ దూరంగా ఉంటూ, నా దారి‌ నాదే అన్నట్టుగా వ్యవహరిస్తున్న ఎంపీ సోయం బాపురావు వ్యవహార శైలి నేతల్లో గుబులు పుట్టిస్తోంది.

నెల రోజులుగా మౌనం దాల్చిన‌ సోయం బాపురావు నా రూటే సపరేట్ అంటూ తనదైన స్టైల్ లో అభ్యర్థికి షాక్ ల షాక్ ఇస్తున్నాడట. గెలిపే లక్ష్యంగా కాషాయ క్యాడర్ గడపగడపకు ప్రచారం చేస్తున్నా, బీజేపీకి ఆదివాసీ గూడాల నుండి ఆ స్థాయి‌ మద్దతు రావడం లేదట. కారణం సోయం బాపురావు నిర్ణయమే అని టాక్ బలంగా రీసౌండ్ ఇస్తోందట. కారణం ఆయన బీజేపీ అభ్యర్థి గోడెం నగేష్ కు కాకుండా మరోసారి ఆదివాసీ నేతకు జైకొట్టడమే అని తెలుస్తోంది. ఎంపీగా మరోసారి సీట్ దక్కకపోవడంతో అలక బూనిన సోయం బాపురావు, నెల రోజులుగా పార్టీకి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా బీజేపీ అభ్యర్థికి మద్దతు ఉపసంహరించుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అక్కడితో ఆగకుండా ఆదివాసీ గూడాల్లో ఆదివాసీ పెద్దలతో రహస్యంగా సమావేశమై, తాను బీజేపీలోనే ఉన్నానని, కానీ ఆదివాసీల పక్షాన నిలిచే నేతకే ఈ‌సారి పట్టం కట్టాలని, పార్టీలు ముఖ్యం కాదు నేతలే ముఖ్యం అంటూ తనదైన శైలిలో ఒంటరి ప్రచారం చేస్తున్నారట.

అయితే ఆ ప్రచారం బీజేపీ అభ్యర్థికి మద్దతుగా చేస్తున్నది కాకపోవడంతో సోయం ఎవరి పక్షాన నిలిచి ఒంటరి ప్రచారం చేస్తున్నారనే చర్చ పార్లమెంట్ పరిధిలో జోరుగా సాగుతోంది. ఆదివాసీ ఉద్యమ నేతకే పట్టం కట్టాలని సోయం బాపురావు గూడాల్లో గడపగడపకు తన సమాచారం చేరవేస్తుండటంతో.. ఆ ఉద్యమ నేత ఎవరనే టాక్ ఇటు బీజేపీ‌ పార్టీలో అటు రాజకీయ‌వర్గాల్లో జోరుగా సాగుతోంది. అయితే ఆ ఆదివాసీ ఉద్యమ నేత తన చిరకాల మిత్రుడే అన్న టాక్ పార్టీలో రీ సౌండ్ ఇస్తుండటంతో సోయంను దారి‌కి తెచ్చుకునేందుకు‌ అధిష్టానం, పార్లమెంట్ ఇంఛార్జ్ విశ్వప్రయత్నాలే చేస్తున్నారట. బీజేపీ అభ్యర్థి గోడెం నగేష్ నామినేషన్ ర్యాలీకి రావాలంటూ పార్లమెంట్ ఇంఛార్జ్ కాకపట్టినా.. అదిష్టానం నుండి ఫోన్ వచ్చినా, నో వే అంటూ తన నిర్ణయాన్ని ప్రకటించారట. దీంతో ఎంపీ సోయం ఏం చేస్తాడో అంటూ ఆందోళన చెందుతున్నారు క్యాడర్.

అయితే ఇదే సమయంలో పార్లమెంట్ పరిధిలో‌ గెలిచిన నలుగురు ఎమ్మెల్యేల మద్య సోయం వ్యవహారం చర్చకు‌ రావడం.. నామినేషన్ ర్యాలీలో జనసమీకరణ లేక ర్యాలీ చప్పగా సాగడంతో ఆ నలుగురిలో ఓ ఇద్దరు కీలక ఎమ్మెల్యేల మధ్య జనసమీకరణ విషయంలో అసమ్మతి‌ మరోసారి భగ్గుమందట. కలిసుంటే కలదు సుఖం అని అధిష్టానం నెత్తి నోరు కొట్టుకుంటున్నా, ఆదిలాబాద్ పార్లమెంట్‌లో నేతల మధ్య ఆ సఖ్యత కనిపించక పోవడంతో అసలుకే ఎసరు‌ వచ్చే ప్రమాదం ఉందన్న సంకేతాలు కనిపిస్తున్నాయంటోంది క్యాడర్.

ఓ వైపు ప్రత్యర్థి పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకెళుతుంటే, అసెంబ్లీ ఎన్నికల్లో‌ సత్తా చాటి కాషాయ అడ్డాగా మార్చుకున్న ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో విజయకేతనం ఎగరవేయాల్సిన కాషాయ పార్టీ మాత్రం ఇంకా అసమ్మతి రాగమే ఎత్తుకుని సాగుతుండటం విస్మయానికి గురి చేస్తోందట. దీంతో‌ ఇదే అదునుగా బావించిన ప్రతిపక్ష పార్టీలు ప్రచారంలో పదడుగులు ముందుకు దూసుకెళ్లగా.. సిట్టింగ్ సీటును కాపాడుకుని విజయ‌కేతనం ఎగర వేయాల్సిన బీజేపీ మాత్రం అసమ్మతి.. అలకలు.. నాయకుల మద్య అంతర్గత పోరుతో వెనక్కి సాగుతున్నట్టుగానే కనిపిస్తుంది. చూడాలి మరీ నాదారి నాదే అంటూ సాగుతున్న సోయం తీరు.. ఎమ్మెల్యేల‌ మధ్య కుదరని సఖ్యత.. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిదిలో బీజేపీ గెలుపును ఏ తీరాలకు చేరుస్తుందో..!

మరిన్ని తెలంగాణ వార్తల కోెసం  ఇక్కడ క్లిక్ చేయండి…