Karimnagar: కరీంనగర్ ఎంపీ స్థానంలో బిగ్ ఫైట్.. గెలుపుపై మూడు ప్రధాన పార్టీల ధీమా..!
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బిగ్ ఫైట్ కొనసాగుతుంది. మూడు ప్రధాన పార్టీలు నువ్వ నేనా అన్నట్లు పోటీ పడుతుండడంతో త్రిముఖ పోరు నెలకొంది. ఇప్పటికీ బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారయ్యారు. ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. అయితే.. కాంగ్రెస్ మాత్రం బలమైన నేత కోసం అన్వేషణ మొదలు పెట్టింది.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బిగ్ ఫైట్ కొనసాగుతుంది. మూడు ప్రధాన పార్టీలు నువ్వ నేనా అన్నట్లు పోటీ పడుతుండడంతో త్రిముఖ పోరు నెలకొంది. ఇప్పటికీ బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారయ్యారు. ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. అయితే.. కాంగ్రెస్ మాత్రం బలమైన నేత కోసం అన్వేషణ మొదలు పెట్టింది. అభ్యర్థి ఖరారు కానప్పటికీ, లోక్‌సభ స్థానంపై కన్నేసిన మంత్రులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో మూడు పార్టీలు ప్రచార స్పీడ్‌ను పెంచుతున్నారు.
కరీంనగర్ పార్లమెంట్ స్థానంపై ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి. ఇక్కడ గెలువడానికి ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు మూడు పార్టీలు. ఉత్తర తెలంగాణ లోనే ముఖ్యమైన సీటు కావడంతో ఇక్కడ మూడు పార్టీలు బలంగా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ వినోద్ కుమార్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచీ ఇంకా అభ్యర్థి ఖరారు కాలేదు. ఈ నియోజకవర్గానికి ఇంచార్జిగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యవహరిస్తున్నారు. ఇతనే ముందు ఉండి ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఇక ఇప్పటికే బీజేపీ అభ్యర్థి ప్రజాహిత యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం కవర్ చేసే విధంగా ప్లాన్ చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, తాను తెచ్చిన నిధుల గురించి ప్రస్తావిస్తున్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా, ఎన్ని నిధులు తెచ్చానో వివరిస్తున్నారు. అదే విధంగా రామ మందిరం అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. ఇదే అంశం గురించి పదే పదే మాట్లాడుతున్నారు. ఇక నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. రెండవ సారి పార్లమెంటు సభ్యులుగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
ప్రచారంలో దూకుడుగా వెళ్తున్న బండి సంజయ్.. అందివచ్చిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలి పెట్టడం లేదు. ఎప్పటికప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్పులనున ఎత్తి చూపుతున్నారు. ముఖ్యంగా అయోధ్య రామ మందిర్ చిత్రపటాలను ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు. పూర్తిగా హిందూత్వ ఏజెండాతో ప్రజల్లోకి వెళ్తున్నారు. అటు.. బీఆర్ఎస్ తోపాటు కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారు. గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మోదీ మానియాతో మరోసారి విజయం సాధిస్తాననే ధీమాతో ఉన్నారు బండి సంజయ్.
ఇక 2014 నుంచి 2019 వరకు చేసిన అభివృద్ధి పనులను వివరిస్తున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్.. తన వల్లనే కరీంనగర్‌కు స్మార్ట్ సిటీ, రైల్వే పనులు, నేషనల్ హైవే లాంటి కార్యక్రమాలు చేపట్టాని అంటున్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేశానని చెబుతున్నారు. బీజేపీ ఎంపీ సంజయ్.. ఒక్క పైసా కూడా తేలేదని ఎత్తి చూపుతున్నారు. అబద్దపు మాటలతో ఓట్లు రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు. తాను చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసురుతున్నారు. ఇప్పటికే.. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ముమ్మరంగా పర్యటిస్తున్నారు. తాను చేసిన అభివృద్ధి గురించి వరిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఇక్కడి నుంచే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కదనభేరీ సభను నిర్వహించారు. ఇటు బీజేపీతోపాటు.. అటు కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా విజయం సాధిస్తానని వినోద్ కుమార్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అయితే.. కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం ఇప్పటివరకు ఖరారు కాలేదు. ఈ నియోజకవర్గ గెలుపు బాధ్యతలను పొన్నం ప్రభాకర్‌కు అప్పజెప్పింది అధిష్టానం. ఇప్పటికే పొన్నం నియోజకవర్గం మొత్తం పర్యటించారు. ఆరు గ్యారంటీల గురించి మాట్లాడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హాులను అమలు చేస్తున్నామని చెబుతున్నారు. ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటి అని ఆరోపిస్తున్నారు. ఈ రెండు పార్టీలకు గుణపాఠం చెప్పాలని పిలుపునిస్తున్నారు పొన్నం. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ని ఆదరించాలని కోరుతున్నారు. అంతేకాకుండా కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండటంతో గెలుపు ధీమాతో ఉన్నారు కాంగ్రెస్ నేతలు. మరోవైపు అయా అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అన్ని నియోజకవర్గాల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో ఈ మూడు పార్టీలు పొటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్నాయి మూడు ప్రధాన పార్టీలు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…