Prakasam district: బంజరు భూమిలో ఈ ఆనవాళ్లు.. ఆ పక్కనే ఉన్న నీటి కుంట వద్ద..
పచ్చని పంటలు పండే పొలాల పక్కన ఉన్న బంజరు భూమిలో క్షుద్రపూజల ఆనవాళ్లు కనిపించడంతో గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, నల్లకోడి, గుమ్మడికాయ వంటి పూజాసామాగ్రి కనిపించడంతో రైతులు, గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. .. .. ..

అది పొదిలి శివారులోని పచ్చని పంటలు పండే పొలాల పక్కన ఉన్న బంజరు భూమి.. రైతులు, కూలీలు నిత్యం పనులు చేసుకుంటూ పండిన పంటలు తరలించే ప్రదేశం… అలాంటి ప్రదేశంలో ఒక్కసారిగా అలజడి రేగింది… పొలాలకు పక్కనే ఉన్న బంజరు భూమిలో ఎవరో క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. అంతే ఒక్కసారిగా కలకలం రేగింది. రైతులు, గ్రామస్థులు హడలిపోయారు. వెంటనే సమాచారం గ్రామంలో వ్యాపించడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలే శుక్రవారం అమావాస్య, పైగా మంత్రగాళ్లు గ్రామంలోకి వచ్చి పూజలు చేసిన ఆనవాళ్లతో పొలాల వైపు ఎవరూ ఒంటరిగా వెళ్లవద్దంటూ గ్రామస్థులు ఒకరికొకరు సూచించుకుంటున్నారు.
పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, కత్తి, బూడిద గుమ్మడికాయ, నల్ల కోడి … ఇవన్నీ క్షుద్రపూజలు చేసే మంత్రగాళ్ల పూజాసామాగ్రి. అలాంటి సామాగ్రి నలుగురు తిరిగే పంటపొలాల పక్కన కనిపించడంతో ఆ గ్రామ రైతులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు చేశారా, లేక ఎవరినైనా హతమార్చేందుకు బాణామతి, చేతబడి వంటి ప్రయోగాలు చేశారా అన్న అనుమానాలతో బిక్కుబిక్కుమంటున్నారు. క్షుద్రపూజలు జరిగాయా లేక గుప్తనిధుల తవ్వకాల కోసం ఏమైనా తవ్వారా అనే డౌట్స్ కూడా వస్తున్నాయి.
శుక్రవారం ఈ ఏడాది చివరి అమావాస్య…
ఈ ఏడాది చివరి నెల డిసెంబర్‌లో 19వ తేది చివరి ఆమావాస్య వచ్చింది. ఈ అమావాస్య 19వ తేది శుక్రవారం వేకువజామున ప్రారంభమై రోజంతా ఉంటుంది. వేకువజామున 4 గంటల 19 నిమిషాలకు ప్రారంభమై డిసెంబర్ 20వ తేది ఉదయం 7గంటల 13 నిమిషాలకు ముగుస్తుంది. ఈ సమయంలో కొందరు గుప్తనిధుల కోసం, బాణామతి, చేతబడి వంటి క్షుద్రపూజలు చేసే మంత్రగాళ్లు ఉంటారు.. ఈ క్రమంలోనే తెల్లవారుజామున ప్రకాశం జిల్లా పొదిలి శివారులో పొలాల పక్కన బంజరు భూమిలో క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు ఉండటంతో గ్రామస్థులు, రైతులు హడలిపోతున్నారు. చక్కగా గుంత తీసి పూజలు చేసి సమీపంలోని నీటి కుంట దగ్గర నల్లకోడిని బలిచ్చిన ఆనవాళ్లు కనిపించాయి… దీంతో పొలాలవైపు వెళ్లాలంటే రైతులు హడలిపోతున్నారు… ఈ క్షుద్రపూజలు చేసింది ఎవరో కనిపెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




