Andhra: మీ ఊరి ఆలయానికి మైక్ సెట్ కావాలా.. అయితే టిటిడిని ఇలా సంప్రదించండి.
దేశంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థగా గుర్తింపు పొందిన టిటిడి సనాతన ధర్మ ప్రచారాన్ని మరింత విస్తృతం చేస్తోంది. హిందూ దేవాలయాలకు మైక్ సెట్‌లు, గొడుగులు, శేషవస్త్రం, రాతి మరియు పంచలోహ విగ్రహాలను భారీ రాయితీలతో, కొన్ని సందర్భాల్లో ఉచితంగానూ అందించనున్నట్లు ప్రకటించింది.

దేశంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థ టిటిడి సనాతన ధర్మ ప్రచారంలో దూసుకుపోతోంది. ఇప్పటికే హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్న టిటిడి ఇప్పుడు హిందువుల ఆలయాలకు మైక్ సెట్, గొడుగులు, శేషవస్త్రం, రాతి, పంచలోహ విగ్రహాలను రాయితీపై అందిస్తుంది. నిబంధనలకు అనుగుణంగా డిడితో పాటు పూర్తి చేసిన దరఖాస్తులను కార్యనిర్వహణాధికారి, టిటిడి పరిపాలనా భవనం, కె.టి.రోడ్డు, తిరుపతి అనే చిరునామాకు పంపాలి. ఇతర వివరాల కోసం 0877-2264276 నంబరును సంప్రదించాలని టిటిడి కోరుతోంది.
మైక్ సెట్ కోసం అయితే..
మైక్ సెట్ కొనుగోలుకు అయ్యే ఖర్చు రూ.25,000లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన SC, STలకు 90 శాతం రాయితీ మినహాయించి రూ.2,500 డి.డి. తీసి పంపించాల్సి ఉంటుంది. ఇతరులకు 50 శాతం రాయితీ మినహాయించి రూ. 12,500లు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆలయ కమిటీ దరఖాస్తు పత్రం, సంబంధిత ప్రాంతంలోని తహశీల్దార్, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ నుంచి సిఫార్సు లేఖ, ఆలయ ఫొటో, ఆలయ కరెంట్ బిల్లు, దరఖాస్తుదారు ఆధార్ కార్డును జత చేయాల్సి ఉంటుంది.
గొడుగుల కోసం అయితే..
హిందూ దేవాలయాలకు.. కేటగిరీలతో సంబంధం లేకుండా అర్హులైన దరఖాస్తుదారులకు రూ.14,500 విలువ చేసే గొడుగులను 50 శాతం రాయితీతో రూ.7,250 లకే టిటిడి అందిస్తుంది. ఇందుకోసం ఆలయ కమిటీ దరఖాస్తు పత్రం, సంబంధిత ప్రాంతంలోని తహశీల్దార్ లేదంటే దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్‌తో సిఫార్సు లేఖ, దరఖాస్తుదారు ఆధార్ కార్డ్, ఆలయ ఫొటోను జత చేసి దరఖాస్తు చేయాలి. సదరు పత్రాలతోపాటు రాయితీ మినహాయించి రూ. 7,250ల డిడిని జత చేసి పంపాలి.
శేష వస్త్రం కోసం అయితే..
హిందూ దేవాలయాలకు శేష వస్త్రాన్ని టిటిడి ఉచితంగా అందిస్తోంది. ఇందుకోసం ఆలయ అభ్యర్థన లేఖను.. కార్యనిర్వాణాధికారి, తిరుపతి పేరుతో దరఖాస్తు చేయాలి. సంబంధిత ప్రాంతంలోని తహశీల్దార్ లేదంటే అసిస్టెంట్ కమిషనర్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి సిపార్సు లేఖ, దరఖాస్తుదారు ఆధార్ కార్డు, ఆలయ ఫోటోను జత చేయాలి.
రాతి, పంచలోహ విగ్రహాలు కావాలంటే..
శ్రీవేంకటేశ్వర స్వామి, శ్రీ పద్మావతీ అమ్మవారి రాతి విగ్రహాలను 5 అడుగులు, అంతకంటే తక్కువ ఎత్తులో ఉన్న విగ్రహాలను ఉచితంగా అందిస్తారు. మిగిలిన దేవతా విగ్రహాలకు 75 శాతం సబ్సిడీపై కేవలం 25 శాతం ధరను చెల్లిస్తే వివిధ వర్గాల వారికి అందిస్తారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి ఉచితంగా రాతి విగ్రహాలను అందిస్తారు.
పంచలోహ విగ్రహాలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి 90 శాతం సబ్సిడీతో, ఇతర వర్గాల వారికి 75 శాతం సబ్సిడీతో అందిస్తారు. ఇక దేవతా మూర్తుల రాతి, పంచలోహల విగ్రహాల పేర్లు, కొలతలతో కార్యనిర్వహణాధికారి, టిటిడికి ఆలయ అభ్యర్థన లేఖ పంపించాలి. దరఖాస్తుదారులు ఖచ్చితంగా స్థానిక తహసీల్దార్, ఎండోమెంట్ అసిస్టెంట్ కమీషనర్ నుంచి సిఫార్సు లేఖ, ఆలయ బ్లూ ఫ్రింట్‌ను ఏ4 సైజ్‌లో.. అవసరమైన విగ్రహాల డ్రాయింగ్, ఒరిజినల్ ఆలయ ఫోటో, దరఖాస్తుదారు ఆధార్ కార్డును జత చేయాలి.
విద్యాసంస్థలకు సరస్వతీ దేవీ విగ్రహాలు..
ఇక ఎంఈవో లేదంటే డీఈవో లతో ఆమోదం పొందిన విద్యా సంస్థలకు సరస్వతీ దేవీ రాతి విగ్రహాన్ని 50 శాతం సబ్సిడీతో టిటిడి అందిస్తోంది. మఠాలు, ట్రస్ట్‌లకు, ఆశ్రమాలకు వివిధ దేవతామూర్తుల విగ్రహాలను 50 శాతం రాయితీతో అందిస్తారు.




