Hyderabad: పండుగల వేళ ఫ్రీ గిఫ్టులు తీసుకుంటున్నారా..? అయితే జరభద్రం అంటున్న పోలీసులు
క్రిస్మస్, నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో మోసాల ముప్పు పెరిగిందని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ పండుగల సమయంలో ఆన్‌లైన్ లావాదేవీలు, సోషల్ మీడియా వినియోగం గణనీయంగా పెరగడంతో సైబర్ నేరగాళ్లు దీనిని అవకాశంగా మలుచుకుని అమాయకులను మోసం చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ముఖ్యంగా బహుమతులు, క్యాష్‌బ్యాక్‌లు, బోనస్‌లు, విదేశీ లాటరీలు అంటూ ఆకర్షణీయమైన ఆఫర్లతో ప్రజలను వలలోకి లాగుతున్నారని పేర్కొన్నారు.

ఎవరైనా గుర్తు తెలియని నంబర్లు లేదా అనుమానాస్పద సోర్స్‌ల నుంచి వచ్చే SMSలు, వాట్సాప్ మెసేజ్‌లు, ఈమెయిల్స్, సోషల్ మీడియా లింక్‌లపై క్లిక్ చేయవద్దని పోలీసులు సూచించారు. ‘ప్రాసెసింగ్ ఫీజులు’, వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ సమాచారం, ఓటీపీలు అడిగే మెసేజ్‌లను పూర్తిగా నిర్లక్ష్యం చేయాలని స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ తమ బ్యాంక్ వివరాలు లేదా ఓటీపీలు ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరించారు.
ఇదిలావుంటే, నూతన సంవత్సరం వేడుకల పేరుతో నకిలీ పాస్‌లు విక్రయిస్తున్న మోసగాళ్లు కూడా పెరుగుతున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు. న్యూ ఇయర్ పార్టీలు, కచేరీలు, పబ్‌లు, రిసార్ట్స్‌కు సంబంధించిన పాస్‌లను నకిలీ వెబ్‌సైట్లు, ఫేక్ సోషల్ మీడియా పేజీల ద్వారా అమ్ముతూ ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. అలాగే సెలవుల ప్యాకేజీలు, పుణ్యక్షేత్ర యాత్రలు, క్రూయిజ్ టూర్లు, అంతర్జాతీయ ప్రయాణ డీల్స్ పేరుతో కూడా మోసాలు జరుగుతున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
అందువల్ల ప్రజలు ఆన్‌లైన్‌లో ఏదైనా కొనుగోలు లేదా బుకింగ్ చేసే ముందు సంబంధిత వెబ్‌సైట్ ప్రామాణికతను తప్పనిసరిగా పరిశీలించాలని పోలీసులు సూచించారు. అనుమానాస్పద లావాదేవీలు లేదా సైబర్ మోసాలకు గురైనట్లయితే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని, లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని సైబర్ క్రైమ్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. పండుగల సీజన్‌ను సురక్షితంగా, ఆనందంగా జరుపుకోవాలంటే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వారు సూచించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..