AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: కంట పడితే ఖతమే.. నగరంలో కాపర్ కేబుల్ ముఠా గుట్టురట్టు!

నగరంలోని కన్‌స్ట్రక్షన్ జరిగే ప్రాంతాల్లో కాపర్ కేబుల్‌ కాజేస్తు్న ఓ ముఠాకు కూకట్‌పల్లి పోలీసులు చెక్‌ పెట్టారు. ఇటీవల కూకట్‌పల్లి పీఎస్‌ పరిధిలోని ఓ బిల్డింగ్ వద్ద వీరు కాపర్ కేబుల్స్ ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు. ఈ కేసులో మొత్తం నలుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. వారి నుంచి సుమారు రూ.6 లక్షల విలువైన 500 కిలోల కాపర్ ఆర్మర్డ్ కేబుల్స్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

Hyderabad: కంట పడితే ఖతమే.. నగరంలో కాపర్ కేబుల్ ముఠా గుట్టురట్టు!
Copper Cable Theft
Anand T
|

Updated on: Feb 06, 2026 | 9:12 PM

Share

హైదరాబాద్‌ నగరంలో కన్‌స్ట్రక్షన్ జరిగే ప్రాంతాల్లో కాపర్ కేబుల్‌ కాజేస్తున్న ఓ  ముఠాకు కూకట్‌పల్లి పోలీసులు చెక్‌ పెట్టారు. ఈనెల 4వ తేదీన ఐడీఎల్ చెరువు సమీపంలో ఉన్న మకుట త్రిపుర సైట్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు రాత్రివేళ ఏడు బండిళ్ల కాపర్ కేబుల్స్ దొంగతనం చేశారు. అది గమనించిన సైట్ ఇంజినీర్ ఉల్లి కునాల్ తర్వాత రోజు ఘటనపై కూకట్ పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు క్రైం నం.183/2026, సెక్షన్ 305 BNS కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

అయితే దర్యాప్తులో భాగంగా స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు.. ఈ నెల 5వ తేదీన ఆయా ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా ఆ దొంగతనం తామే చేసినట్టు అంగీకరించారు. మకుట త్రిపుర సైట్‌లో సెక్యూరిటీ సిబ్బందిగా పనిచేస్తూ ఈ చోరీకి పాల్పడినట్లు వారు ఒప్పుకున్నారని తెలిపారు. చోరీకి పాల్పడిన నలుగురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 500 కిలోల కాపర్ కేబుల్స్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు పోలీసులు.

అరెస్టైన వారు లఖింద్ర బోరువా, అనుపమ్ గోగోయ్, నీతు దాస్, నబజ్యోతి దాస్ అని గుర్తించారు. వీరంతా అస్సాం రాష్ట్రానికి చెందినవారని, సెక్యూరిటీ ఉద్యోగాల కోసం హైదరాబాద్‌కు వచ్చి నివసిస్తున్నారని తెలిపారు. దురలబాట్ల కారణంగా సులభంగా డబ్బు సంపాదించాలని చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైందన్నారు.

మరో కేసులో రికవరీ..

ఇదిలా ఉండగా మరో కేసులో మహమ్మద్ సల్మాన్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతన్ని విచారించగా, డిసెంబరు నెలలో మూసాపేట అంజనేయ నగర్ ప్రాంతంలో ఒక ద్విచక్ర వాహనం, ఐదు రోజుల క్రితం వినావి హాస్టల్ వద్ద రెండు సెల్‌ఫోన్లు దొంగిలించినట్లు ఒప్పుకున్నాడని తెలిపారు. వాటిని స్వాధీనం చేసుకున్నామని ఇన్ స్పెక్టర్ తెలిపారు. నిందితులందరినీ కోర్టులో హాజరుపరిచామని తెలిపారు. సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకునే ముందు వారి పూర్తి వివరాలు, గుర్తింపు పత్రాలు పరిశీలించి భద్రపరుచుకోవాలని కుకట్ పల్లి పోలీసులు ప్రజలకు సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us