Telangana: ప్రాణహిత, గోదావరి మహోగ్రరూపం.. నిండుకుండలా మారిన ప్రాజెక్టులు
ఉత్తర తెలంగాణలోని మంచిర్యాల జిల్లాను కుండపోత వర్షాలు వణికిస్తున్నాయి. ప్రాణహిత, గోదావరి మహోగ్రరూపం దాల్చాయి. నిర్మల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తుండటంతో.. క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

ఉత్తర తెలంగాణలోని మంచిర్యాల జిల్లాను కుండపోత వర్షాలు వణికిస్తున్నాయి. ప్రాణహిత, గోదావరి మహోగ్రరూపం దాల్చాయి. నిర్మల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తుండటంతో.. క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 70 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా, వెయ్యి క్యూసెక్కులను బయటకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ ప్రస్తుత నీటిమట్టం 1,069 అడుగులుగా ఉంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు లక్షా ఒక వేయికి పైగా క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో ప్రాజెక్టు మొత్తం 62 గేట్లలో 15 గేట్లను ఎత్తి అధికారులు 92 వేలకు పైగా క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ నీటిమట్టం 147.45 మీటర్లకు చేరింది. కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టుకు 10,282 క్యూసెక్కుల వరద వస్తుండగా, నీటిమట్టం 698 అడుగుల వద్ద నిలకడగా ఉంది.
మహారాష్ట్రలో భారీ వర్షాల ప్రభావంతో గోదావరి పోటెత్తుతోంది. కాళేశ్వరం దగ్గర వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతుండటంతో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌కు భారీగా వరద వచ్చి చేరుతోంది. మేడిగడ్డ ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో ఏకంగా 8 లక్షల 35వేల 800 క్యూసెక్కులుగా ఉంది. తుపాకులగూడెం సమ్మక్క సాగర్ బ్యారేజ్ దగ్గర కూడా వరద ఉధృతి కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో 11 లక్షల 86వేల 500 క్యూసెక్కులుగా నమోదైంది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి నీటిమట్టం ప్రమాదకరంగా మారుతోంది. అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
ఎగువ నుంచి వస్తున్న భారీ వరదలతో భద్రాచలం దగ్గర గోదావరి ఉప్పొంగుతోంది. నీటిమట్టం 48 అడుగులకు చేరడంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నదిలోకి 11 లక్షలకు పైగా క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండటంతో.. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అలర్ట్ చేశారు.
అలాగే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నీటిమట్టం 7 అడుగులకు చేరింది. బ్యారేజ్ 175 గేట్ల ద్వారా 4 లక్షల 30వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి, డెల్టా కాలువలకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వరద ప్రవాహం మరింత పెరుగుతుండటంతో శనివారం ఉదయం ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
